Thursday, June 27, 2024

ముకేశ్ అంబానీకి మళ్లీ బెదిరింపు

- Advertisement -
- Advertisement -

ముంబయి: ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి మరోసారి బెదిరింపులు రావడం కలకలం రేపింది. అంబానీ కంపెనీకి చెందిన ఓ ఇమెయిల్ ఐడికి శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తినుంచి బెదిరింపు మెయిల్ వచ్చింది. ‘ మావద్ద మంచి షూటర్లున్నారు.రూ.20 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తాం’ అని ఆ మెయిల్‌లో ఆగంతకుడు బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ముకేశ్ సెక్యూరిటీ ఇన్‌చార్జి పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీనిపై కేసు నమోదు చేసిన ముంబయి గామ్‌దేవీ పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.షాదాబ్ ఖాన్ అనే వ్యక్తినుంచి ఆ బెదిరింపు మెయిల్ వచ్చినట్లు గుర్తించారు. అతని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గత ఏడాది కూడా ముకేశ్ కుటుంబానికి ఇలాంటి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. గత ఏడాది ఆగస్టు 15న ఓ వ్యక్తినుంచి రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న హర్‌కిసాన్ దాస్ ఆస్పత్రికి బెదిరింపు ఫోన్‌కాల్ వచ్చింది.

ఆస్పత్రిని పేల్చేస్తామని, అంబానీ కుటుంబాన్ని చంపేస్తామని నిందితుడు బెదిరించాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపిన పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. 2021లో ముకేశ్ నివాసమైన అంటిలియా సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన ఓ స్కార్పియోను నిలిపి ఉంచడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ ఘటన జరిగిన వారం రోజులకే స్కార్పియో యజమాని మన్‌సుఖ్ హీరేన్ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఈ కేసులను తొలుత ఇన్‌స్పెక్టర్ సచిన్ వాజే దర్యాప్తు చేపట్టగా, తర్వాత ఆయనే ప్రధాన సూత్రధారి అని తేలడం గమనార్హం. దీంతో ఎన్‌ఐఎ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. ఈ ఘటన తర్వాతనుంచి ముకేశ్ అంబానీకి, ఆయన కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వమే భద్రత కల్పిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News