Sunday, January 19, 2025

పర్యాటక హవాయిలో ఎవరు? ఎవరో

- Advertisement -
- Advertisement -

లహైనా : అమెరికాలో శతాబ్ధాల పర్యాటక చరిత్రగల హవాయి దీవుల ప్రాంతం ఇప్పుడు కార్చిచ్చుతో నల్లటి మరకలా మారింది. గత మంగళవారం ఆరంభమై అంతులేకుండా వ్యాప్తి చెందిన మంటలతో ఇప్పటికీ మృతుల సంఖ్య 93కు చేరింది. చారిత్రక, పర్యాటకుల సందళ్ల మయూయి టౌన్ ఒక్కప్పుడు టూరిస్టుల పాలిటి స్వర్గం. ఇప్పుడు ఎటుచూసినా మిగిలిన బూడిదకుప్పలతో , ఒళ్లుకాలి గాయాలతో ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారి ఆర్తనాదాలతో , భౌతికకాయాలను వెలికితీసే సహాయక బృందాల గాలింపులతో విషాదమయంగా మారింది. పలు వాహనాలు, వేలాదిగా నివాసాలు, సందడిగా ఉండే రెస్టారెంట్లు, బార్లు ఇప్పుడు బూడిద గుట్టలుగా మారాయి. ఇప్పటికీ పలువురు గుర్తించలేనంతగా దారుణ స్థితిలో శవాలుగా పడి ఉన్నారు. ఈ వందేళ్ల చరిత్రలో అమెరికాలో ఇప్పుడు తలెత్తిన కార్చిచ్చు అతి పెద్ద విషాదరకర ఘటన అయింది. కార్చిచ్చుకు హరికేన్ గాలులు తోడుకావడంతో దిక్కుతోచని స్థితి ఏర్పడింది. చాలా ఎక్కువ విస్తీర్ణంలో కార్చిచ్చు వ్యాపించింది.

ఇప్పటికీ కేవలం 3 శాతం మేరకూ గాలింపు చర్యలు చేపట్టగల్గినట్లు మయూయి పోలీసు ఉన్నతాధికారి జాన్ పెలిటిర్ తెలిపారు. మృతదేహాలను గుర్తించడం క్లిష్టతరమైన పని అయింది. పలు దిక్కుల్లో శరీరభాగాలు కాలిపడి ఉండటంతో వీటిని ఒక్కచోటికి చేర్చి ఎవరు ? ఎవరు? అనేది పసికట్టాల్సి వస్తోంది. ఇందుకు కాడవేర్ డాగ్స్ బృందాలను కూడా రంగంలోకి దింపారు. దాదాపు 5 కిలోమీటర్ల ప్రాంతంలో భారీ స్థాయిలో కార్చిచ్చు వీడకుండా సాగింది. ఇక్కడ పరిస్థితి భయానకం అయిందని అధికారులు తెలిపారు. చనిపోయిన వారిని గుర్తించాలంటే ముందుగా సంబంధితుల కుటుంబ సభ్యులు అందుబాటులోకి రావల్సి ఉంటుంది. వీరు వస్తే కానీ మృతులు ఎవరు? అనేది నిర్థారించడానికి వీల్లేదు. అయితే ఎవరైనా తమ వారి కోసం వస్తారా? ఎందరు బతికి ఉన్నారు? ఎందరు మృతి చెందారనేది ఇప్పుడు క్లిష్టమైన ప్రశ్నగా మారింది. ఇప్పుడు మిగిలిన వారికి తగు సాయం, పునరావాసం కీలకమైన విషయం అని అధికారులు తెలిపారు.

వెస్ట్ మవూయిలో కనీసం 2200 భవనాలు దెబ్బతిన్నాయి. కొన్ని నామరూపాలు ల్లేవు. వీటిలో అత్యధికం నివాసిత ప్రాంతాలు అంటే జనం ఎక్కువగా ఉండే అపార్ట్‌మెంట్లే ఉన్నాయి. ఇక్కడ మంటలు కార్చిచ్చులుగా విస్తరించుకునిపోవడంతో మృతుల సంఖ్యను ఖచ్చితంగా నిర్థారించడం తేలికకాదని అధికారులు తెలిపారు. ఇక్కడ జరిగిన నష్టం విలువ దాదాపుగా 6 బిలియన్ డాలర్ల వరకూ ఉంటుంది. ఈ నష్టం భర్తీ చేసుకోవడానికి ఎంత సమయం పడుతుందనేది తెలియని స్థితి ఏర్పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News