బీజింగ్/కున్మింగ్ : చైనా లోని యున్నాన్ ప్రావిన్స్‌లో సోమవారం కొండచరియలు విరిగిపడిన ప్రమాదంలో మృతుల సంఖ్య 31కి పెరిగింది. జెన్‌జియోంగ్ కౌంటీలో లియాంగ్‌షుయి గ్రామంపై సోమవారం ఉదయం కొండచరియలు విరిగి పడడంతో శిధిలాల కింద మొత్తం 47 మంది చిక్కుకు పోయారు. ఈ ప్రావిన్స్ మంచు పర్వతాల ప్రాంతంలో ఉండడంతో మంచు కొన్ని రోజుల పాటు దట్టంగా పేరుకుని ఉన్నందున సహాయ కార్యక్రమాలు చేపట్టడం కష్టమవుతోంది.
దాదాపు వెయ్యి మంది కార్మికులు, 45 జాగిలాలు, 120 వాహనాలతో గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. 33 అగ్నిమాపక వాహనాలు, 10 లోడింగ్ మెషిన్లు కూడా ఈ గాలింపులో పాలుపంచుకుంటున్నాయి. జెన్‌జియాంగ్ కౌంటీలో మిలిటరీ, 104 మిలీషియాలను కూడా ప్రభుత్వం రంగం లోకి దింపింది. సహాయ కార్యక్రమాలకు, గాలింపు పనులకు చైనా ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాల నిధి నుంచి 50మిలియన్ యువాన్ (దాదాపు 7 మిలియన్ డాలర్లు ) కేటాయించింది.