గౌహతి/ఇంఫాల్ : మణిపూర్ నానీ జిల్లాలో రైల్వే నిర్మాణంపై కొండచరియలు విరిగి పడి మృతి చెందిన వారి సంఖ్య 37కు చేరింది. శిధిలాల కింద చిక్కుకున్న మరో మూడు మృతదేహాలను ఆదివారం వెలికి తీయడంతో మృతుల సంఖ్య పెరిగింది. మరో 25 మంది కోసం గాలింపు కొనసాగుతోంది. శనివారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తుండడం, కొండచరియలు విరిగిపడుతుండడంతో గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు శిధిలాల నుంచి బయటపడిన 37 మృతదేహాల్లో 24 ఆర్మీ జవాన్లవి కాగా, 13 సాధారణ పౌరులవని గౌహతి అధికార ప్రతినిధి తెలిపారు. గల్లంతైన వారిలో ఇంకా మిగిలిన ఆరుగురు ఆర్మీ సిబ్బంది, 19 మంది పౌరుల కోసం గాలింపు కొనసాగుతుందని చెప్పారు. ఇంతవరకు 13 ఆర్మీ సిబ్బందిని, ఐదుగురు పౌరులను సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. వాల్ ఇమేజింగ్ రాడార్ ( టిడబ్లుఐఆర్) టెక్నాలజీని ఉపయోగించి శిధిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తిస్తున్నారు. రిస్కు జాగిలాలను సహాయంగా తీసుకుంటున్నారు.