Tuesday, April 1, 2025

మయన్మార్ భూవిలయంలో వెయ్యి దాటిన మృతుల సంఖ్య

- Advertisement -
- Advertisement -

కూలిన భవనాల శిథిలాల్లో నుంచి మరిన్ని మృతదేహాల వెలికితీత
2376 మంది గాయపడినట్లు సైనిక ప్రభుత్వం వెల్లడి
ఇంకా జాడ తెలియని 30 మంది

బ్యాంకాక్ : మయన్మార్‌లో 7.7 తీవ్రతతో సంభవించిన శక్తిమంతమైన భూకంపంలో మృతుల సంఖ్య శనివారం వెయ్యి దాటింది. దేశంలోని రెండవ పెద్ద నగరం మాండలే సమీపంలో భూకంపం సంభవించినప్పుడు కుప్పకూలిన పెక్కు భవనాల శిథిలాల్లో నుంచి మరిన్ని మృతదేహాలను వెలికితీశారు. 1002 మంది మృతి చెందారని, మరి 2376 మంది గాయపడ్డారని, మరి 30 మంది వ్యక్తుల జాడ ఇంకా తెలియరాలేదని దేశంలోని మిలిటరీ సారథ్యంలోని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలియజేసింది. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చునని, ‘సమగ్ర వివరాలను ఇప్పటికీ సేకరిస్తున్నాం’ అని ప్రభుత్వం ఆ ప్రకటనలో తెలిపింది. ఒకప్పుడు బర్మా అయిన మయన్మార్‌లో సుదీర్ఘ కాలంగా, రక్తపాతంతో కూడిన అంతర్యుద్ధం సాగుతోంది. ఆ యుద్ధం ఇప్పటికే భారీ ఎత్తున మానవతావాద సంక్షోభానికి దారి తీసింది.

దేశవ్యాప్తంగా ప్రయాణం సంక్లిష్టంగా, ప్రమాదకరంగా మారుతోంది. దీనితో సహాయ కార్యక్రమాల నిర్వహణ కష్టంగా ఉన్నది. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది. భూకంపం శుక్రవారం మధ్యాహ్నం సంభవించింది. భూకంపం ప్రధాన కేంద్రం మాండలేకు దూరంలో లేదు. ఆతరువాత 6.4 తీవ్రతతో భూకంపంతో సహా పలు భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అనేక ప్రాంతాల్లో భవనాలు నేలమట్టం అయ్యాయి. రోడ్లు దెబ్బ తిన్నాయి. వంతెనలు కూలిపోయాయి. ఒక డ్యామ్ పేలిపోయింది. రాజధాని నేపిదాలో దెబ్బ తిన్న రోడ్ల మరమ్మతు పనుల్లో సిబ్బంది శనివారం నిమగ్నమయ్యారు. నగరంలో అధిక భాగంలో విద్యుత్, ఫోన్, ఇంటర్నెట్ సర్వీసులు ఇంకా పునరుద్ధరణ కాలేదు. భూకంపం అనేక భవనాలను నేలమట్టం చేసింది. వాటిలో ప్రభుత్వ ఉద్యోగుల నివసిస్తున్న పలు ఇళ్లు కూడా ఉన్నాయి. అయితే, నగరంలో ఒక సెక్షన్‌ను అధికారులు శనివారం ఇతరులకు అందుబాటులో లేకుండా చేశారు.

థాయిలాండ్‌లో మరింత నష్టం

పొరుగున ఉన్న థాయిలాండ్‌లో భూకంపం సుమారు కోటి 70 లక్షల జనాభా గల గ్రేటర్ బ్యాంకాక్ ప్రాంతాన్ని, దేశంలోని ఇతర ప్రాంతాలను కుదిపివేసింది. ఇంత వరకు ఆరు మృతదేహాలు లభ్యమయ్యాయని, 26 మంది గాయపడ్డారని, 47 మంది జాడ ఇంకా తెలియరాలేదని, వారిలో చాలా మంది రాజధానిలోని పాపులర్ చతుచాక్ మార్కెట్ సమీపంలోని ఒక నిర్మాణ ప్రదేశం నుంచి గల్లంతయ్యారని బ్యాంకాక్ నగర అధికారులు వెల్లడించారు. టన్నుల కొద్దీ శిథిలాల తరలింపు కోసం శనివారం మరిన్ని భారీ యంత్రాలను తీసుకువచ్చారు. అయితే జాడ తెలియకుండాపోయినవారిపై కుటుంబ సభ్యులు, మిత్రుల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయి. ‘వారు బతికి బయటపడాలని ప్రార్థిస్తున్నాను. కానీ నేను ఇక్కడికి వచ్చి. శిథిలాల కుప్పలు చూసినప్పుడు వారు ఎలా ఉండవచ్చు? ఏ మూల ఉన్నారు? వారు ఇంకా సజీవంగా ఉన్నారా? అని అనిపిస్తోంది. మొత్తం ఆరుగురూ సజీవంగా ఉండాలని ఇప్పటికీ ప్రార్థిస్తున్నాను’ అని 45 ఏళ్ల నరుమో తోంగ్లెక్ విలపిస్తూ చెప్పింది. మయన్మార్‌కు చెందిన తన భాగస్వామి, ఆ ప్రదేశంలో పని చేసిన ఐదుగురు స్నేహితుల గురించిన వార్త కోసం ఆమె నిరీక్షిస్తోంది.

భూకంపానికి దాదాపు ఒక గంట ముందు ఒక ఫోన్ కాల్ వచ్చినప్పటి నుంచి తన కుమార్తె కన్లయానీ నుంచి తాను ఏమీ వినలేదని వేన్‌ఫెట్ పాంటా తెలిపారు. కన్లయానీ శుక్రవారం ఆ భవనంపై ఎత్తులో పని చేస్తూ ఉందని ఆమెతో ఒక స్నేహితురాలు చెప్పింది. ‘నా కుమార్తె క్షేమంగా ఉండాలని, ఆమె బతికి బయటపడాలని,ఆమె ఆసుపత్రిలో ఉందని ప్రార్థిస్తున్నాను’ అని ఆమె తెలిపింది. కన్లయానీ తండ్రి ఆమె పక్కనే కూర్చుని ఉన్నారు. దేశంలోని చాలా ప్రావిన్స్‌లలో భూకంపం, తదనంతర ప్రకంపనల ప్రభావం కనిపించిందని థాయి అధికారులు తెలిపారు. ఉత్తరాన అనేక ప్రదేశాల్లో నివాస భవనాలు, ఆసుపత్రులు, చియాంగ్ మైతో సహా ఆలయాలు దెబ్బ తిన్నట్లు సమాచారం వచ్చింది. అయితే, మృతుల గురించిన సమాచారం బ్యాంకాక్ నుంచే వచ్చింది.

మేజర్ ఫాల్ట్ లైన్‌పై ఉన్న మయన్మార్

భూకంపాలు బ్యాంకాక్‌లో అరుదు. కానీ మయన్మార్‌లో సాధారణం. దేశం సగాయింగ్ ఫాల్ట్‌పై ఉంది. అది ఇండియాప్లేట్‌ను, సుండా ప్లేట్‌నే వేరు చేస్తున్న మేజర్ ఉత్తరదక్షిణ ఫాల్ట్. ఫాల్ట్‌లో 200 కిలోమీటర్ సెక్షన్ కేవలం ఒక నిమిషంపైగా దెబ్బ తిన్నట్లు కనిపిస్తోందని బ్రిటిష్ జియోలాజికల్ సర్వే సీస్మాలజిస్ట్ బ్రియాన్ బాప్టీ చెప్పారు. కలప, ఇటుకలతో నిర్మించిన భవనాల్లో అధిక భాగం జనం నివసిస్తుండే ప్రాంతాన్ని భూకంపం కుదిపివేసిందని ఆయన తెలిపారు.

అంతర్యుద్ధం నేపథ్యంలో ప్రకృతి విపత్తు

భూకంపం ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో రక్తం కోసం డిమాండ్ అధికంగా ఉందని మయన్మార్ ప్రభుత్వం తెలియజేసింది. పూర్వపు ప్రభుత్వాలు విదేశీ సాయాన్ని అంగీకరించేందుకు మందకొడిగా వ్యవహరించిన దేశంలో వెలుపలి నుంచి సహాయాన్ని స్వీకరించేందుకు మయన్మార్ సిద్ధంగా ఉందని మిన్ ఆంగ్ హ్లాయింగ్ చెప్పారు. మయన్మార్ మిలిటరీ 2021 ఫిబ్రవరిలో ఆంగ్ సాన్ సూచీ ఎన్నికైన ప్రభుత్వం నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. సుదీర్ఘ కాలంగా పాతుకుపోయిన మిలిషియాలు, కొత్తగా ఏర్పాటైన శక్తులతో బీభత్సకర అంతర్యుద్ధాన్ని మిలిటరీ ప్రభుత్వం సాగిస్తోంది. భూకంపం తరువాత కూడా తమ దాడులను సైనిక దళాలు కొనసాగించాయని, కరెన్ని రాష్ట్రంగా కూడా పిలుస్తున్న ఉత్తర కయిన్ రాష్ట్రంలోను, దక్షిణ షాన్ రాష్ట్రంలోను మూడు వైమానిక దాడులను సైనిక దళాలు జరిపాయని ఫ్రీ బర్మా రేంజర్స్‌ను స్థాపించిన మాజీ యుఎస్ ప్రత్యేక దళాల జవాను డేవ్ యూబ్యాంక్ తెలియజేశారు.

1990 దశకం నుంచి మయన్మార్‌లో పోరాట శక్తులకు పౌరులకు సహాయం అందజేసిన మానవతావాద సహాయ సంస్థ ఫ్రీ బర్మా రేంజర్స్. తాను కార్యకలాపాలు సాగిస్తున్న ప్రాంతంలో చాలా గ్రామాలను మిలిటరీ ఇప్పటికే ధ్వంసం చేసిందని, అందువల్ల భూకంపం ప్రభావం అంతగా లేదని యూబ్యాంక్ ‘అసోసియేటెడ్ ప్రెస్ (ఎపి)’తో చెప్పారు. ‘ప్రజలు అడవిలో ఉన్నారు. భూకంపం సంభవించినప్పుడు నేను అడవిలో ఉన్నాను. అది శక్తిమంతమైనది. కానీ, చెట్లు కేవలం కదిలాయి. కనుక బర్మా సైన్యం భూకంపం తరువాత కూడా దాడి కొనసాగిస్తుండడం కన్నా దాని వల్ల మాకు ప్రత్యక్ష ప్రభావం లేదు’ అని ఆయన తెలిపారు. ప్రభుత్వ దళాలు మయన్మారళ్‌లో అధిక భాగంపై నియంత్రణ కోల్పోయారు. అనేక ప్రదేశాలు అపాయకరంగా లేదా సహాయక బృందాలు చేరుకోవడం అసాధ్యమైనవిగా ఉన్నాయి. యుద్ధం వల్ల 30 లక్షల మందికి పైగా నిర్వాసితులయ్యారని, సుమారు రెండు కోట్ల మంది ఆపన్నులుగా ఉన్నారని ఐక్యరాజ్య సమితి తెలియజేసింది.

మయన్మార్‌కు వెళుతున్న రక్షక, సహాయ బృందాలు

మయన్మార్ మిలిటరీకి ఆయుధాలు సరఫరా చేసిన అతిపెద్ద దేశాలు చైనా, రష్యా. ఆ రెండు దేశాలు మానవతావాద సహాయంతో ముందుకు వచ్చిన దేశాల్లో ముందు ఉన్నాయి. వైద్య కిట్లు, జనరేటర్లతో పాటు 135 మందికి పైగా రక్షక, సహాయక సిబ్బందిని, నిపుణులను తాను పంపినట్లు చైనా వెల్లడించింది. తాను 120 రక్షక, సహాయక సిబ్బందిని, సప్లయిలను పంపినట్లు రష్యా అత్యవసర మంత్రిత్వశాఖ తెలియజేసింది. భారత్ కూడా అన్వేషక, సహాయక బృందాన్ని, వైద్య బృందాన్ని పంపింది. తాము ఆదివారం 50 మందిని పంపుతామని మలేషియా తెలిపింది.

కాగా, అంతర్జాతీయ సంస్థల ద్వారా తాను 2 మిలియన్ డాలర్లు విలువ చేస్తే మానవతావాద సహాయం అందజేస్తానని దక్షిణ కొరియా ప్రకటించగా, యుఎన్ సహాయ కార్యక్రమాలు ప్రారంభించేందుకు 5 మిలియన్ డాలర్లు కేటాయించింది. యుఎస్ సహాయం అందజేయబోతున్నదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం వెల్లడించారు. అయితే, విదేశాలకు సాయంలో ట్రంప్ ప్రభుత్వం బాగా కోతలు పెట్టిన దృష్టా ఆయన హామీ గురించి కొందరు నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News