Saturday, November 23, 2024

108కి చేరిన కాబూల్ పేలుళ్ల మృతుల సంఖ్య

- Advertisement -
- Advertisement -

Death toll rises to 108 in Kabul blasts

మృతుల్లో 13 మంది అమెరికా సైనికులు, 95 మంది అఫ్ఘన్లు
మా వాళ్లు 28 మంది ఉన్నారు: తాలిబన్లు
ఘటన తర్వాత ఎయిర్‌పోర్టుకు పోటెత్తిన జనం
ఎలాగైనా దేశం వదిలి వెళ్లాలనే అత్రుత

కాబూల్: కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద గురువారం జరిగిన జంట ఆత్మాహుతి దాడుల్లో మృతుల సంఖ్య 108కి చేరుకుంది. వీరిలో 95 మంది అఫ్ఘన్ పౌరులు ఉండగా, 13 మంది అమెరికా సైనికులున్నారు. మరో 150 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చని, శవాల గదిలో కెపాసిటీకి మించి మృతదేహాలు వస్తున్నాయని, అలాగే బంధువులు ఘటనా స్థలంనుంచి మృత దేహాలు తీసుకుని వెళ్లి ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని పేరు వెల్లడించడానికి ఇష్టపడని అఫ్ఘన్ అధికారులు చెప్పారు. మృతుల్లో తమ వాళ్లు కూడా 28 మంది ఉన్నారని తాలిబన్లు అధికారులు ప్రకటించారు. కాబూల్‌లోని వజీర్ అక్బర్ ఖాన్ ఆస్పత్రి బయట పదిదాకా మృత దేహాలు నేలపై పడిఉన్నాయి. శవాల గదిలోకి ఇకపై మృత దేహాలను అనుమతించబోమని ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారని బంధువులు అంటున్నారు. చాలా మృతదేహాలను ఎవరూ తీసుకెళ్లడం లేదని, ఎందుకంటే మృతుల కుటుంబ సభ్యులు చాలా దూరంలోని ప్రావిన్స్‌లనుంచి రావలసి ఉంటుందని అఫ్ఘన్లు అంటున్నారు.

మరిన్ని దాడులు జరగొచ్చు: అమెరికా

కాబూల్ విమానాశ్రయంపై మరిన్ని దాడులు జరిగే అవకాశముందని అమెరికా సెంట్రల్ కమాండ్ జనరల్ ఫ్రాంక్ మెకన్జీ ప్రకటించారు. ఈ సారి రాకెట్లు, వాహన బాంబులతో ఎయిర్‌పోర్టును లక్షంగా చేసుకోవచ్చని హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు.

విమానాశ్రయానికి పోటెత్తిన జనం

కాగా కాబూల్ విమానాశ్రయం వద్ద జరిగిన ఆత్మాహుతి దాడుల రక్తపు మరకలు ఇంకా చెరిగి పోకముందే శుక్రవారం విమానాశ్రయానికి జనం పోటెత్తారు. ఎలాగైనా దేశం వదిలి వెళ్ల్లాలనే తాపత్రయంతో ప్రాణభయాన్ని కూడా లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో జనం విమానాశ్రయానికి చేరుకున్నారు. బాంబుల భయం కంటే వారికి తాలిబన్ల భయం ఎంతగా ఉందో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. ఎయిర్‌పోర్టులోకి ఎలాగైనా వెళ్లి .. దేశం నుంచి బైటపడితే చాలన్న ఆత్రుత వారిలో కనిపిస్తోంది. శుక్రవారం ఎయిర్‌పోర్టు వద్ద ఉన్న పరిస్థితి వీడియోను అబ్దుల్ హక్ ఒమరి అనే జర్నలిస్టు ట్వీట్ చేశారు. ఎయిర్‌పోర్టు ముందు ఉన్న మురికి కాలువలో మోకాటి లోతు నీళ్లలో వాళ్లు నిరీక్షిస్తుండడం ఈ వీడియోలో కనిపిస్తోంది. అయితే ఎయిర్‌పోర్టుకు దాదాపు 500 మీటర్ల ముందే డజన్ల సంఖ్యలో సాయుధ తాలిబన్లు కాపలా కాస్తూ ఎవరూ దాన్ని దాటి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు.

‘ఈ పేలుళ్ల తర్వాత దేశం వదిలిపెట్టి వెళ్లాలని నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటే మరిన్ని దాడులు జరుగుతాయని నేను భయపడుతున్నాను. అందుకే ప్రమాదమని తెలిసినా దేవుడిపై భారం వేసి నా అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నాను’ అని భార్య, ముగ్గురు చిన్న పిల్లలతో శుక్రవారం ఉదయం కాబూల్ విమానాశ్రయం వద్దకు చేరుకున్న జంషేర్ అనే అఫ్ఘన్ పౌరుడు చెప్పారు. అయితే దేశం వీడి వెళ్లాలనుకునే చాలా మంది ఆశలు నెరవేరే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే ఆగస్టు 31 గడువులోగా అమెరికా తన పౌరులందరినీ తరలించేందుకు వీలుగా చాలా మిత్ర దేశాలు తమ పౌరులు తరలింపు కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు ప్రకటించాయి. ఇలా ప్రకటించిన దేశాల్లో బ్రిటన్, స్పెయిన్ కూడా ఉన్నాయి. వచ్చే మంగళవారం లోగా అమెరికా అఫ్ఘన్‌లోని 5000 మందికి పైగా సైనికులను స్వదేశానికి తరలించాల్సి ఉంది. దీంతో తరలింపు ప్రక్రియను ఆ దేశం మరింత వేగవంతం చేసింది. ఇదిలా ఉండగా అమెరికన్లు కాబూల్ విమానాశ్రయాన్ని వదిలి వెళ్లాక విమానాశ్రయాన్ని ఆపరేట్ చేయమని తాలిబన్లు టర్కీని కోరారు. అయితే దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయిప్ ఎర్డోగన్ శుక్రవారం చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News