కేరళలోని వయనాడ్‌లో సంభవించిన కొండచరియల విలయం నెత్తుటి మట్టి జ్ఞాపకాలనే మిగిల్చింది. అక్కడ ప్రకృతి వైపరీత్యంతో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య బుధవారానికి 184కు చేరింది. 191 మంది జాడ తెలియడం లేదు. ఇప్పటికీ మృతుల సంఖ్య దాదాపుగా నిర్థారణ అయిందని, అయితే గల్లంతయిన వారి పరిస్థితి ఏమిటీ? అనేది తమకు ఆందోళనకరంగా మారిందని వాయనాడ్ జిల్లా అధికారులు తెలిపారు. అక్కడ సహాయక చర్యలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని ముఖ్యమంత్రి పినరయి విజయన్ మీడియాకు తెలిపారు. కేరళ భూమి ఇంతకు ముందెప్పుడూ ఇటువంటి విపత్తును ఎదుర్కొలేని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే కన్పిస్తున్నాయని తెలిపారు. బుధవారం ఆయన తిరువనంతపురంలో విలేకరులతో మాట్లాడారు.
తనకు అందిన సమాచారం ప్రకారం 144 మృతదేహాలను కనుగొన్నారని, వీరిలో 79 మంది పురుషులు, 64 మంది మహిళలు , 43 మంది పిల్లలు ఉన్నారని వివరించారు. అయితే జాడ తెలియకుండా పోయిన వారి గురించి గాలింపు జరుగుతోందన్నారు. ప్రత్యేకించి ముందక్కల్, చూరాల్మాలా ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఈ ప్రాంతాలు మట్టిదిబ్బలు అయ్యాయని చెప్పారు. పెద్ద ఎత్తున చిక్కుపడ్డ వారిని కాపాడేందుకు సహాయక బృందాలు యత్నిస్తున్నాయని చెప్పారు. రెండు రోజుల సహాయక చర్యల క్రమంలో దాదాపు 1600 మందిని కాపాడినట్లు వివరించారు. అతి తక్కువ సమయంలో ఇంత మందిని సకాలంలో రక్షించగలగడం పూర్తి స్థాయి సమన్వయంతో సాధ్యం అయిందన్నారు. కొండచరియలు విరిగిపడుతూ వచ్చిన క్రమంలో 1386 మంది చిక్కుపడ్డారని, వారిని ఇళ్లల్లో నుంచి రక్షించినట్లు తెలిపారు. ఏడు సహాయక శిబిరాలకు పిల్లలను, మగవారిని ఆడవారిని హుటాహుటిన తరలించినట్లు చెప్పారు.
మంగళవారం రాత్రి సైనిక దళాలు దాదాపు వేయి మందిని ముప్పు నుంచి రక్షించాయని రక్షణ శాఖ ప్రకటన వెలువరించింది. మంగళవారం తెల్లవారుజామున అంతా నిద్రలో ఉన్న దశలో కొండచరియలు వరుసగా విరిగి పడటం జరిగింది. దీనితోనే అత్యధికులు తప్పించుకోవడానికి వీల్లేకుండా పోయింది. దెబ్బతిన్న ప్రాంతాల్లో పరిస్థితిని గమనించేందుకు , సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు వైమానిక దళ హెలికాప్టర్లను రంగంలోకి దింపారు. పలు సహాయక బృందాల మధ్య సమన్వయానికి ఎప్పటికప్పుడు సంకేతాలు సందేశాలు వెలువరిస్తూ , వైమానిక దళం పర్యవేక్షణకు దిగింది. ఈ ప్రాంతంలో ఆర్మీ హెలికాప్టర్లు, సైన్యం పెద్ద ఎత్తున రంగంలోకి దిగింది. కొండచరియలు విరిగిపడటం, వరదలు సంభవించడంతో ఇక్కడి ప్రజలకు జల భూ సమాధి పరిస్థితి ఏర్పడింది. చుట్టూ మట్టిదిబ్బలు , భారీ ఎత్తున నీరు వచ్చి చేరడంతో దిగ్బంధంలోని బాధితులను రక్షించేందుకు ముందక్కల్ ప్రాంతంలో తాత్కాలిక వంతెనలను నిర్మించారు.
వెదురుబొంగలు , తాళ్లతో నిర్మించిన ఈ బ్రిడ్జిలపైకి చిక్కుపడ్డ వారిని ముందుగా తరలించి తరువాత సహాయక శిబిరాలకు పంపించడం జరుగుతోంది. ఇక్కడి పొంగిపొర్లుతున్న నది మీదుగా ప్రజలను చిన్నపాటి పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తీసుకువస్తున్నారు. ఓ వైపు సుడులు తిరుగున్న నదులు , ఇరుకైన వంతెనల మీదుగా జనం సురక్షిత ప్రాంతాలకు చేరడం అత్యంత క్లిష్ట ప్రక్రియ అవుతోంది. ప్రధాని మోడీ ఇక్కడి పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు స్వయంగా గమనిస్తున్నారని కేంద్ర మంత్రి జార్జి కురియన్ విలేకరులకు తెలిపారు.