Sunday, July 7, 2024

తమిళనాడు కల్తీసారా ఘటన..34కు చేరిన మృతుల సంఖ్య

- Advertisement -
- Advertisement -

తమిళనాడులోని కళ్లకురిచి జిల్లా కరుణాపురంలో కల్తీ సారా మృతుల సంఖ్య గురువారానికి 34కు చేరింది. కరుణాపురం, చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి. అక్రమ, కల్తీసారా తాగి ప్రాణాల మీదకు తెచ్చుకున్న వారి కుటుంబాలలో రోదనలకు అంతులేకుండా పోయింది. కనీసం 34 మంది అత్యంత ప్రాణాంతక మిథనాలు కలిపిన సారా సేవించిన ఘటనలో మృతి చెందారు. కాగా వంద మంది వరకూ చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇప్పటికీ పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అధికారులు గురువారం తెలిపారు. రాష్ట్రంలోని ఉత్తర జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలకు దారితీసింది. అధికారంలోని డిఎంకె ప్రభుత్వం కల్తీ సారా వ్యాపారాన్ని అడ్డుకోలేకపోతోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దీనిపై డిఎంకె నేతలు ఎదురుదాడికి దిగారు. ఇది సామాజిక అంశం అయిందని, అయినా ఇటువంటి ఘటనలు కేవలం డిఎంకె హయాంలోనే జరిగాయనే వాదన పనికిరానిదని తెలిపారు.

ఇక్కడ జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ స్పందించారు. ఇటువంటి దారుణాలు జరగకూడదు. తనకు ఈ విషాద ఘటన దిగ్భ్రాంతిని, ఆవేదనను కల్గించిందని తెలిపారు. మిథనాలు మిశ్రిత ప్రత్యేక సారా తాగడం ఈ దారుణానికి దారితీసిందని, ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తాను సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.ఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మద్రాసు హైకోర్టు రిటైర్డ్ జడ్జి బి గోకుల్‌దాస్ సారధ్యంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చారు. ఇటువంటి ఘటనలు ఇకపై జరగకుండా చేసేందుకు చేపట్టే చర్యల విషయంలో ఈ కమిషన్ సిఫార్సులు వెలువరిస్తుందన్నారు. మృతుల కుటుంబాలకు రూ 10 లక్షల పరిహారం చొప్పున అందిస్తారు. చికిత్స పొందుతున్న వారికి తలో రూ 50,000 సాయం అందిస్తారని వెల్లడించారు. కల్తీసారా ఘటనపై రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి , డిజిపిలు నివేదిక అందిస్తారని, తరువాత చర్యలు ఉంటాయని వివరించారు. కాగా ఈ విషపూరిత కల్తీ మద్యం విక్రయంతో సంబంధం ఉందని పేర్కొంటూ ఇప్పటివరకూ ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.

సారా వ్యాపారులకు మిథనాలు ఎక్కడి నుంచి అందిందనేది గుర్తించి , సరఫరాదారులను శిక్షించడం జరుగుతుందన్నారు. కల్తీసారా కాటు సంభవించిన కరుణాపురం మృతులలో ఇద్దరు మహిళలు , ఒక ట్రాన్స్‌జెండర్ కూడా ఉన్నారు. జరిగిన దారుణంతో ఈ ప్రాంతం అంతా విషాదభరితం అయింది. ఈ ప్రాంతాన్ని రాష్ట్రంలో ప్రతిపక్ష నేత ఎడప్పడి కె పళనిస్వామి సందర్శించారు. బాధిత కుటుంబాలను సందర్శించారు.
కల్తీసారాతో కాదని అధికారుల తొలి బుకాయింపు
బుధవారం ఈ ప్రాంతంలో కల్తీసారాతో ఐదుగురు చనిపోగా జిల్లా అధికారులు పెద్దగా స్పందించలేదు. వేరే మరణాలు, కల్తీసారా తాగి చావలేదని బుకాయించినట్లు తెలిసింది. అప్పటికే ఐదుగురు చనిపోయినా ఈ కోణంలో స్పందించలేదని వెల్లడైంది. ఈలోగా చాలా మంది తమ ఇళ్లల్లోనే ఈ కల్తీసారా సేవించడంతో పరిస్థితి విషమించింది. మృతుల సంఖ్య పెరిగిందని వెల్లడైంది.

ఇది సరయా మోడల్ ప్రభుత్వం
రేపు నిరసనలకు అన్నామలై పిలుపు
ఘటనపై రాజకీయ విమర్శలు తీవ్రతరం అయ్యాయి. సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున స్పందనలు వెలువడ్డాయి. ఇది ద్రవిడయన్ మోడల్ కాదు సరయా మోడల్ అని విమర్శించారు. రాష్ట్రంలోని స్టాలిన్ ప్రభుత్వం అసమర్థతకు నిరసనగా ఈ నెల 22న రాష్ట్రవ్యాప్త నిరసనలకు దిగుతున్నట్లు రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కె అన్నామలై ప్రకటించారు. పోలీసు స్టేషన్, కోర్టుకు సమీపంలోనే పెద్ద ఎత్తున కల్తీసారా కేంద్రాలు ఉన్నాయని ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News