Friday, December 20, 2024

వెతలు తరిమిన బతుకుల విషాదాంతం..

- Advertisement -
- Advertisement -

జొహన్నెస్‌బర్గ్ : దక్షిణాఫ్రికాలో శరణార్థులు మంటలకు ఆహుతి అయ్యారు. జొహెన్నెస్‌బర్గ్‌లోని ప్రధాన డిస్ట్రిక్ బిజినెస్ డిస్ట్రిక్‌లో ఉన్న బహుళ అంతస్తుల భవనంలో గురువారం మంటలు చేలరేగి కనీసం 73 మంది బుగ్గి అయ్యారు. 52 మంది వరకూ గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడైంది. మృతులు ఎక్కువగా టాంజానియా వారే అని తెలిసింది. మృతులలో కొందరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ ఐదు అంతస్తుల భవనంలో అత్యధికంగా శరణార్థులే నివాసం ఉంటున్నారు. సిటీసెంటర్‌లో ఈ భవనంలో చెలరేగిన మంటలకు కారణాలు ఏమిటనేది తెలియలేదు. అయితే భవనానికి ఏర్పాటు చేసిన సెక్యూరిటీ గేట్‌కు భారీ తాళాలు వేసి ఉండటంతో మంటలు వ్యాపిస్తూ ఉండగా జనం పరుగులు తీస్తూ బయటకు వచ్చినా, గేటు దాటి వెళ్లలేకపొయ్యారు. దీనితో వీరిని మంటలు కబళించినట్లు తెలిసింది. తెల్లవారుజామున డెల్వర్స్ కార్నర్, అల్బర్ట్ స్రీట్‌లో మంటలు చెలరేగినట్లు సమాచారం అందడంతో అగ్నిమాపక శకటాలు హుటాహుటిన అక్కడికి తరలివెళ్లాయి.

ఈలోగానే ఘోరం జరిగింది. గేట్లు బద్దలు చేసి లోపలికి ప్రవేశించిన అగ్నిమాపక దళాలకు పలు అంతస్తులలో కాలిబూడిదై పడి ఉన్న వారి ఆనవాళ్లు కన్పించాయి.చాలా మంది పొగతో ఉక్కిరిబిక్కిరి అయ్యి మృతి చెందారని, వారిని కాపాడేందుకు తాము ఎంతగానో కష్టపడ్డామని స్థానిక ఎమర్జెన్సీ సేవల విభాగం ప్రతినిధి రాబర్ట్ ములౌద్జీ తెలిపారు. ఇప్పటివరకూ 73 మంది చనిపోయినట్లు గుర్తించారని వెల్లడించారు. శరణార్థులు రహస్యంగా ఎక్కువ సంఖ్యలో వచ్చి ఇక్కడ తలదాచుకోవడం కూడా ప్రమాదానికి దారితీసి ఉంటుందని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అంతస్తుల మధ్య ఉన్న కట్టడాలు, శరణార్థులే కల్పించుకున్న చిన్నచిన్న గుడిసెల వంటి ఏర్పాట్లు, విద్యుత్ కనెక్షన్ లేకపోవడం చాలా మంది నేలమీదనే స్టవ్‌లు, కట్టెల పొయ్యిలతో వంటలు చేసుకోవడం ఏదో విధంగా బతుకులు ఈడ్చుకుంటూ రావడం, ఇక్కడ అధికారికంగా ఎందరు ఉన్నారు? లెక్కల్లోకి వచ్చే వారెందరు? ఒకరిద్వారా వేరొకరుగా ఎందరు వచ్చి చేరారనేది లెక్కకు అందని సమస్య అయింది. అయితే మొత్తం మీద ఈ భవనంలో 200 మంది వరకూ నివాసం ఉంటున్నట్లు తెలిసింది.

ఆఫ్రికా దేశాల మారుమూల ప్రాంతాలలో పేదరికం, జీవనోపాధి లేకపోవడం వంటి పరిణామాలతో చాలా మంది పెద్ద పెద్ద పట్టణాలకు, నగరాలకు వలస వస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ నివాసం ఉంటున్నారు. దయనీయ స్థితిలో ఉన్న వీరు ఇప్పుడు భారీ మంటల్లో చిక్కి సజీవదహనం చెందారు. ఈ భవనానికి అధికారులు విద్యుత్ కనెక్షన్లు తీసివేశారు. దీనితో చాలా మంది ప్రమిదలు, కొవ్వొత్తుల మధ్యనే చీకట్లో గడపాల్సి వస్తోంది. పూర్తిగా మూసివేసి ఉన్న గదులు, మధ్యలో నేలపై చెక్కలు కట్టెలతో మంటలు పెట్టడం వంటివి వీరి జీవన శైలి అయింది. చివరికి ఇదే వారి జీవితాలకు మంటై మసిచేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News