ఈశాన్య అమెరికాలో తుపాన్ సంక్షోభం
ఇప్పటికీ 40 మందికి పైగా దుర్మరణం
న్యూయర్క్, న్యూజెర్సీ జలమయం
ప్రమాదసంకేతాలపై బైడెన్ హెచ్చరికలు
న్యూయార్క్ : ప్రచండవేగం, ఉధృతవర్షాలతో కూడిన ఇదా తుపాను అమెరికా ఈశాన్య తీర ప్రాంతాన్ని దెబ్బతీసింది. ఈ టోర్నోడోతో ఇప్పటికీ ప్రధాన మహానగరం న్యూయార్క్, న్యూజెర్సీ ఇతర ప్రాంతాలలో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రికార్డు స్థాయిలో భారీ వర్షాలు, ఉధృతగాలులతో సంభవించిన ఘటనల్లో కనీసం 40 మందికి పైగా దుర్మరణం చెందారు. ఇదా హరికేన్ ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేసిందని, పలువురు తాము సంచరిస్తున్న కార్లలో, ఉంటున్న ఇళ్లలోనే జలవిలయానికి బలి అయ్యారని వెల్లడైంది. మేరిలాండ్ నుంచి కనెక్టికట్‌వరకూ తుపాన్ తన తీవ్ర ప్రభావం చూపింది. న్యూజెర్సీలోనే కనీసం 23 మంది చనిపోయినట్లు డెమోక్రాటిక్ పార్టీకి చెందిన గవర్నర్ ఫిల్ మర్ఫీ తెలిపారు. న్యూయార్క్ సిటీలో 13 మంది బలి అయ్యారు. ఎప్పుడూ జనసమ్మర్థంగా ఉండే న్యూయార్క్ నగరం అంతా నీటమునిగిన దాఖలాలతో జనం అంతా బందీఖానాల జీవితాలు గడపాల్సి వచ్చింది. ఇప్పుడు ఈశాన్య ప్రాంతంలో తలెత్తిన ఇదా హరికేన్, మరో వైపు కార్చిచ్చు సమస్యలు వాతావరణ సంక్షోభానికి సంకేతాలని ప్రెసిడెంట్ బైడెన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈశాన్య ప్రాంతాలు జలమయం, మరో వైపు పశ్చిమ వైపు రాష్ట్రాలు అడవులలో మంటలతో రగిలిపోవడం వంటి ఘటనలు పర్యావరణ, వాతావరణ పరంగా సంభవిస్తున్న వికృత పరిణామాలను తెలియచేస్తున్నాయని , ఇప్పుడు వచ్చింది క్లైమెట్ క్రైసిస్ అని తెలిపారు. తీవ్రస్థాయి తుపాన్లు, ఇతరత్రా పరిణామాలు పూర్తిస్థాయి వాతావరణ సంక్షోభానికి దారితీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరింత ముప్పు వాటిల్లుతుందని, ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు అంతా సిద్ధం కావల్సి ఉంటుందని, ఏమరపాటు తగదని హెచ్చరించారు. పలు ప్రాంతాల్లో రహదారులు, బ్రిడ్జిలు, ఎలక్ట్రిక్ గ్రిడ్స్ , మురుగునీటి వ్యవస్థ వంటి వాటిని మెరుగుపర్చేందుకు తాము ట్రిలియన్ డాలర్ల నిర్మాణ పనులను తలపెట్టామని, సంబంధిత బిల్లుకు చట్టసభలు తక్షణ ఆమోదం తెలిపే దిశలో ఒత్తిడి తెస్తామని బైడెన్ వివరించారు. ఇప్పటి పరిస్థితిపై శ్వేతసౌథంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వెంటనే స్పందించడం అత్యవసరం అని, లేకపోతే జీవన్మరణ సమస్యను ఎదుర్కొవల్సి ఉంటుందని తెలిపారు.