Friday, November 22, 2024

కాంగ్రెస్‌లో ఈటల చిచ్చు

- Advertisement -
- Advertisement -

Debate in Congress over Huzurabad defeat

భట్టిపై కెసి వేణుగోపాల్ సీరియస్, సమన్వయలోపమే హుజూరాబాద్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణం : పొన్నం, పార్టీ సంప్రదాయ ఓటు ఏమైంది? : విహెచ్, అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించడంపై ప్రశ్నించిన ఉత్తమ్
జగ్గారెడ్డిని ఆహ్వానించకపోవడంపై చర్చ, ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర, కేంద్ర పాలకపక్షాల డ్రామా, ఢిల్లీలో హాట్ హాట్‌గా కాంగ్రెస్ సమీక్షా సమావేశం

మన తెలంగాణ/ హైదరాబాద్ : హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓటమిపై హస్తినలో శనివారం జరిగిన సమీక్షా సమావేశం హాట్‌హాట్‌గా కొనసాగింది. ఎఐసిసి జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్ సమక్షంలో జరిగిన సమావేశానికి తెలంగాణ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేతలు హాజరయ్యారు. హుజూరాబాద్ ఓటమిపై వాడి వేడి చర్చ జరిగింది. ఓటమికి బాధ్యులు మీదంటే, మీదే బాధ్యత అని టిపిసిసి నేతలు పరస్పర విమర్శలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ ప్రస్తావన వచ్చింది. ఈటల రాజేందర్‌ను పార్టీలో చేర్చుకుంటే బాగుండేదని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రస్తావించారు. అయితే భట్టి వ్యాఖ్యలపై కెసి వేణుగోపాల్ సీరియస్ అయ్యారు. ఈటల రాజేందర్‌ను పార్టీలోకి తీసుకోవద్దని ముందు భట్టినే చెప్పారని, ఇప్పుడు ఇతరులపై నిందలు ఎందుకు వేస్తున్నారని మండిపడ్డారు. ఈ సమీక్షలో మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమన్వయ లోపమే హుజూరాబాద్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణమని ఆయన తేల్చి చెప్పారు.

ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోదరుడు(కజిన్) కౌశిక్‌రెడ్డికి ఎంఎల్‌సి ఇప్పించుకున్నారంటూ పొన్నం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాగే కొనసాగితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని పొన్నం ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొందరు నాయకులు పొన్నంను వారించే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో ఆయన మరింత రెచ్చిపోయారు. దమ్ముంటే పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయాలంటూ సవాల్ విసిరరారు. ఉప ఎన్నిక ఇంఛార్జిగా తనను బాధ్యుడిని చేసే విమర్శలు అర్ధరహితమంటూ మండిపడ్డారు. హుజూరాబాద్ మీదే కాకుండా గతంలో జరిగిన జిహెచ్‌ఎంసీ, నాగార్జునసాగర్, హుజూర్‌నగర్, దుబ్బాక ఓటమిపై కూడా సమీక్షలు నిర్వహించాల్సిందేనని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌లోనే ఉంటూ కొందరు టిఆర్‌ఎస్ పార్టీకి సహకరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తపర్చారు. గతంలో పిసిసి అధ్యక్షులుగా పనిచేసిన కె.కేశవరావు, డి.శ్రీనివాస్‌లు రాజ్యసభ సభ్యులయ్యేందుకు కాంగ్రెస్ పార్టీని మోసం చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

హుజూరాబాద్‌లో కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు బ్యాంకు ఏమైంది : విహెచ్

హుజూరాబాద్ ఫలితాలపై ఒక్కొక్కరిని పిలిచి విడివిడిగా అడగాలని విహెచ్ కోరారు. ఎవరు రిఫర్ చేస్తే బల్మూరి వెంకట్‌కు టికెట్ ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. అసలు హుజూరాబాద్‌లో కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు బ్యాంకు ఏమైందంటూ విహెచ్ నిలదీశారు. తెలంగాణ కంటే ఏపిలో పార్టీ లేకపోయినా కాంగ్రెస్‌కు ఆరు వేల ఓట్లు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కొండా సురేఖకు టికెట్ ఎందుకు ఇవ్వలేదని ఈ సందర్భంగా విహెచ్ ప్రశ్నించారు. దీనికి సంబంధించి రాహుల్‌గాంధీకి రేవంత్‌రెడ్డిపై కొండా సురేఖ ఫిర్యాదు చేశారని ఆయన తెలిపారు. ఆ ఫిర్యాదు లేఖను కెసి వేణుగోపాల్‌కు ఇచ్చారు. హుజూరాబాద్ ఓటమిపై హైకమాండ్ ఆవేదనలో ఉందని.. మేం లేటుగా ప్రచారం ప్రారంభించామని, అభ్యర్థి ఎంపిక లేట్ చేశామని ప్రజల్లో ఆరోపణలు ఉన్నాయని విహెచ్ వ్యాఖ్యానించారు. సంప్రదాయంగా ఉండే కాంగ్రెస్ ఓటు బ్యాంకు, ఇందిరమ్మ ఓటు బ్యాంకు ఎటు పోయిందని ఆయన ప్రశ్నించారు. తమకు హామీనిచ్చిన ప్రజల ఓట్లు కూడా పడలేదన్నారు. గతంలో సెకండ్ స్థానంలో ఉండేదని, ఇప్పుడు మూడోస్థానానికి పడిపోయిందని చెప్పారు. 2023లో టిఆర్‌ఎస్, బిజెపిలతో కొట్లాడాలంటే గట్టిగా ప్రయత్నించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

కౌశిక్‌రెడ్డి వ్యవహారంపై ఉత్తమ్

కౌశిక్‌రెడ్డి వ్యవహారంపై ఉత్తమకుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఆయన పార్టీని వీడి వెళ్లిపోయిన 4 నెలల వరకు అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదన్నారు.

చర్చకు దారితీసిన జగ్గారెడ్డి వ్యవహారం

అయితే ఈ సమావేశానికి జగ్గారెడ్డిని ఆహ్వానించకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయన బహిరంగంగా ఏం మాట్లాడినా పార్టీకి మరింత సమస్యలు వస్తాయనే కారణంతో జగ్గారెడ్డిని దూరం ఉంచినట్లు చెబుతున్నారు.

తెలంగాణలో ధాన్యం కొనుగోలుపైనా టిఆర్‌ఎస్, బిజెపిలు డ్రామాలాడుతున్నాయి : మాణికం ఠాగూర్

మరోవైపు టిపిసిసి నేతల వార్‌పై హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్బంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సమన్వయ లోపం ఎక్కడ జరిగిందో తెలుసుకుంటున్నామని పేర్కొన్నారు. ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకుని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. తెలంగాణలో టిఆర్‌ఎస్ పార్టీ బిజెపి బి టీంగా తయారైందని ఠాగూర్ పేర్కొన్నారు. గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ అన్నట్లుగా ఆ రెండు పార్టీల వ్యవహారం సాగుతోందని ఆరోపించారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలుపైనా డ్రామాలు ఆడుతున్నాయని విమర్శించారు.

సమావేశంలో భిన్నాభిప్రాయాలు వచ్చినా…

సమావేశంలో భిన్నాభిప్రాయాలు వచ్చినా పార్టీ పరిస్థితిపైనా వాస్తవాలు తెలుసుకునేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. సమీక్షా సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణికం టాగూర్, టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సిఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నేతలు దామోదర రాజనర్సింహా, విహెచ్, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, షబ్బీర్ అలీలు పాల్గొన్నారు.

కాంగ్రెస్ ఓటు బ్యాంకు బిజెపికి…
ఎఐసిసికి రాసిన లేఖలో జగ్గారెడ్డి స్పష్టీకరణ

కాంగ్రెస్ ఓటు బ్యాంకు పూర్తిగా బిజెపికి షిప్ట్ అయ్యిందని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక సమీక్షకు తనను పిలవకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎఐసిసి సెక్రటరీ కెసి వేణుగోపాల్‌కు లేఖ రాశారు. ఆ లేఖలో ఇంఛార్జిగా ఉన్న తనను ఆహ్వానించకపోవడంపై అనుమానం కలుగుతోందని అభిప్రాయపడ్డారు. మూడు నెలలకు ముందే వెంకట్‌ను అభ్యర్థిగా ప్రకటించాల్సి ఉండేదన్నారు. అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించడం వల్ల పార్టీకి నష్టం జరిగిందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News