Sunday, November 24, 2024

నేడు రాష్ట్రపతి ప్రసంగంపై పార్లమెంట్‌లో చర్చ

- Advertisement -
- Advertisement -

చర్చకు మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ శ్రీకారం
నీట్ పేపర్ లీక్, అగ్నిపథ్, ద్రవ్యోల్బణంపై వాడిగా వేడిగా చర్చ సాగే సూచన
ప్రతిపక్షాలు నిరుద్యోగిత సమస్యను లేవదీయవచ్చు
న్యూఢిల్లీ : పార్లమెంట్ ఉభయ సభలు సోమవారం తిరిగి సమావేశమైనప్పుడు నీట్ పేపర్ లీక్, అగ్నిపథ్, ద్రవ్యోల్బణం వంటి వివిధ అంశాలపై వాడిగా వేడిగా చర్చలు సాగే అవకాశం ఉంది. ప్రశ్న పత్రం లీక్ వ్యవహారంతో పాటు నిరుద్యోగిత గురించి కూడా ప్రతిపక్షాలు ప్రస్తావించవచ్చు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో చర్చను బిజెపి సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రారంభించనున్నారు.

బిజెపి ప్రముఖురాలు దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె, మొదటిసారి లోక్‌సభ సభ్యురాలు బాన్సురి స్వరాజ్ ఆ తీర్మానాన్ని సమర్థిస్తారు. ధన్యవాదాల తీర్మానంపై చర్చకు లోక్‌సభ 16 గంటలు కేటాయించింది. ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం చర్చకు సమాధానం ఇస్తారు, రాజ్యసభలో తీర్మానంపై చర్చకు 21 గంటలు ప్రత్యేకించారు. ప్రధాని బుధవారం చర్చకు సమాధానం ఇస్తారు. నీట్ వివాదంపై నిరసనలతో పార్లమెంట్ దద్దరిల్లిపోయింది. ఎన్‌టిఎ మే 5న నీట్ యుజిని నిర్వహించగా, సుమారు 24 లక్షల మంది హాజరయ్యారు. ఆ ఫలితాలను జూన్ 4న ప్రకటించారు.

ఆ తరువాత బీహార్ వంటి రాష్ట్రాల్లో ప్రశ్న పత్రం లీక్‌లు, ఇతర అవకతవకల ఆరోపణలు వెల్లువెత్తాయి. బిజెపి సభ్యుడు సుధాంశు త్రివేది రాజ్యసభలో చర్చను ప్రారంభిస్తూ, మోడీని ‘అతుల్నియా’ (సాటిలేని) నేతగా అభివర్ణించారు. దేశాన్ని వేధిస్తున్న సమస్యల పట్ల మోడీ వ్యవహరిస్తున్న తీరుకు, తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అనుసరించిన విధానానికి మధ్య ఎంతో అంతరం ఉందని త్రివేది పేర్కొన్నారు, బిజెపి సభ్యురాలు కవితా పాటిదార్ తీర్మానాన్ని సమర్థించారు. మరి తొమ్మిది మంది సభ్యులు ఇంత వరకు చర్చలో పాల్గొన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను లోక్‌సభ శుక్రవారం చేపట్టనున్న తరుణంలో ప్రతిపక్ష ఇండియా కూటమి నీట్ సమస్యపై ప్రత్యేక చర్చ కోరుతూ సభ వాయిదా పడేలా చేశారు.

రాజ్యసభలో చర్చ సమయంలో తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. నీట్ వివాదంపై చర్చను ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే తోటి సభ్యులతో కలసి సభాధ్యక్షుని వేదికను చుట్టుముట్టారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కాంగ్రెస్ సభ్యురాలు ఫూలో దేవి నేతమ్ రాజ్యసభలో నినాదాలు చేస్తూ అధిక రక్త పోటు కారణంగా స్పృహ తప్పి పడిపోగా ఆమెను రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి హుటాహుటిని తరలించారు. సభ కార్యక్రమాలను వాయిదా వేయనందుకు ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు దుయ్యబట్టాయి. రాజ్యసభ సభ్యురాలి ఆరోగ్యం పట్ల ఆందోళన లేకపోయిందని ప్రతిపక్షాలు విమర్శించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News