న్యూఢిల్లీ : ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సంజాయిషీ కోరుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌కు పంపిన నోటీస్‌పై 8 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను ఢిల్లీ హైకోర్టు గురువారం ఆదేశించింది. గత నెల రాజస్థాన్ ఎన్నికల ప్రచారం సందర్భంగా జాలోర్‌లో జరిగిన కాంగ్రెస్ ప్రచార సభలో రాహుల్ మాట్లాడుతూ ఓ చెడు శకునం క్రికెట్ మ్యాచ్‌కు రావడం వల్లనే మనవాళ్లు ఓడిపోయారని పరోక్షంగా మోడీని ఉద్దేశిస్తూ ఎద్దేవా చేశారు. మోడీని పనౌతి (చెడు శకునం ), పిక్‌పాకెట్ అంటూ పేరు చెప్పకుండా వ్యాఖ్యానించారు.
దీనిపై ఎన్నికల కమిషన్ నవంబర్ 25 లోగా సమాధానం చెప్పాలని ఆదేశిస్తూ రాహుల్‌కు నోటీస్ పంపింది. అయితే ఈ గడువు దాటిపోయినా రాహుల్ నుంచి ఎలాంటి సమాధారం రాలేదు. దీనిపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం పై ఢిల్లీహైకోర్టు విచారణ జరిపింది. వీలైనంత తొందరగా ఈ నోటీస్‌పై నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌కు కోర్టు ఆదేశించింది. రాహుల్ గాంధీ మోడీపై నవంబర్ 22న దిగజారుడు ఆరోపణలు చేశారని, దీనిపై చర్య తీసుకోవాలని పిటిషనర్ భారత్ నగర్ తన వ్యాజ్యంలో కోర్టును కోరారు.