ఎయిమ్స్ సీనియర్ ఎపిడెమియోలజిస్ట్ డాక్టర్ సంజయ్ కె రాయ్ అభ్యంతరం
న్యూఢిల్లీ : పిల్లలకు కొవిడ్ టీకాలు ఇస్తామని ప్రభుత్వం నిర్ణయించడం అశాస్త్రీయమని ఎయిమ్స్ సీనియర్ ఎపిడెమియోలజిస్టు డాక్టర్ సంజయ్ కె రాయ్ అభ్యంతరం లేవదీశారు. కొవాగ్జిన్ టీకా ట్రయల్స్‌కు ప్రధాన పరిశోధకుడుగా వ్యవహరించిన ఆయన ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఉంటున్నారు. పిల్లలకు టీకాలు ఇవ్వాలని నిర్ణయించేముందు పిల్లలకు టీకాలు ఇవ్వడం ప్రారంభించిన దేశాల నుంచి డేటా సేకరించి విశ్లేషించడం మంచిదని సూచించారు. 15 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలకు జనవరి 3 నుంచి టీకా ఇస్తామని ప్రధాని మోడీ శనివారం ప్రకటించారు. దీనిపై సరైన సమయాల్లో సరైన నిర్ణయాలను తీసుకునే ప్రధానిగా మోడీని తానెంతో అభిమానిస్తానని, అయితే పిల్లలకు టీకాల విషయంలో మాత్రం ఆయన అశాస్త్రీయ నిర్ణయం నిరాశ కలిగించిందని వ్యాఖ్యానించారు.
వ్యాక్సిన్లకు సంబంధించి అవి ఇన్‌ఫెక్షన్‌ను అంతగా నియంత్రించ లేవని తెలుస్తోందని, కొన్ని దేశాల్లో ప్రజలు బూస్టర్ డోసు తీసుకున్నా ఇన్‌ఫెక్షన్‌కు గురవడం జరుగుతోందని పేర్కొన్నారు. బ్రిటన్‌లో రోజూ 50,000 వరకు బ్రేక్ త్రూ ఇన్‌ఫెక్షన్లు నమోదవుతున్నాయని, దీన్ని బట్టి వ్యాక్సినేషన్ కరోనా ఇన్‌ఫెక్షన్‌ను నియంత్రించడం లేదని స్పష్టమౌతోందని, అయితే వ్యాధి తీవ్రత కాకుండా, మృత్యుగండం ఏర్పడకుండా వ్యాక్సిన్లు నిరోధించగలవని ఆయన ఉదహరించారు. కొవిడ్ 19 వల్ల మరణాల రేటు కేవలం 1.5 శాతం మాత్రమే ఉంటోందని, అంటే మిలియన్ జనాభాకు 15,000 మరణాలు మాత్రమే సంభవిస్తున్నాయని, వ్యాక్సినేషన్ ద్వారా 80 నుంచి 90 శాతం మరణాలను మనం నివారించ గలుగుతున్నామని వివరించారు. పిల్లల విషయానికి వస్తే ఇన్‌ఫెక్షన్ తీవ్రత చాలా తక్కువగా ఉంటోందని, లభించిన డేటాను బట్టి మిలియన్ జనాభాకు కేవలం రెండు మరణాలే సంభవిస్తున్నాయని పేర్కొన్నారు.