Sunday, January 19, 2025

వృత్తి విద్యాకోర్సులపై తగ్గుతున్న ఆసక్తి

- Advertisement -
- Advertisement -

సాధారణ డిగ్రీలకే విద్యార్థుల మొగ్గు
ఇంటర్ తర్వాత చేరే కోర్సులపై మారుతున్న వైఖరి

మనతెలంగాణ/హైదరాబాద్ : వృత్తి విద్యా కోర్సులపై క్రమంగా ఆసక్తి తగ్గుతుండగా, సాధారణ డిగ్రీలకు ఆదరణ పెరుతూ వస్తోంది. ఇంటర్ అర్హతతో ప్రవేశాలు పొందే ఇంజనీరింగ్, ఫార్మసీ వంటి వృత్తి విద్యాకోర్సుల్లో సీట్లు మిగలడమే అందుకు అద్దం పడుతోంది. వృత్తి విద్యా కోర్సుల్లో డిమాండ్ ఉన్న కొన్ని కోర్సులు మినహా మిగతా కళాశాలల్లో ఏటా సీట్లు మిగుతులున్నాయి. ఒకప్పుడు సాధారణ డిగ్రీ అంటే చులకన భావం ఉండేది. కానీ ఇప్పుడు డిగ్రీ చేయడానికి చాలా మంది విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంజనీరింగ్,ఫార్మసీ వంటి కోర్సులకు నాలుగేళ్లపాటు ఎంతో ఖర్చు చేసి సీరియస్‌గా చదవాల్సి ఉంటుంది. అదే సాధారణ డిగ్రీ అయితే ఖర్చు తక్కువగా ఉండటంతో పాటు మూడేళ్లలో కోర్సు పూర్తవుతుంది. కోర్సు చేస్తున్న సమయంలో కూడా పార్ట్‌టైం ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉంటుంది. దాంతో పేద,దిగువ మధ్యతరగతికి చెందిన విద్యార్థులు డిగ్రీలో చేరేందుకే ఆసక్తి కనబరుస్తున్నారు. ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సులతోపాటు పాటు బిఎఎంఎస్,బిహెచ్‌ఎంఎస్, పశువైద్య, వ్యవసాయ డిగ్రీ తదితర కోర్సుల్లో దాదాపుగా సీట్లుగా పూర్తిగా భర్తీ అవుతుండగా, ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో మాత్రం సీట్లు ఖాళీగా మిగులుతున్నాయి. కొంతమంది విద్యార్థులు ఇంటర్ తర్వాత నర్సింగ్, హోటల్ మేనేజ్‌మెంట్, డి.ఫార్మసీ, పాలిటెక్నిక్, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులలో చేరుతున్నారు.

ఏటా మిగులుతున్న ఇంజనీరింగ్ సీట్లు

ఒకప్పుడు ఇంటర్ ఎంపిసి ఉత్తీర్ణత అయితే చాలు, ఏదో ఒక కళాశాలలో ఇంజనీరింగ్‌లో చేరేవారు. రానురాను ఇంజనీరింగ్ విద్యలో ప్రమాణాల పెంపుపై ప్రభుత్వం దృష్టి సారించడం, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో విద్యార్థులకు మెరిట్ ఉంటేనే ఉద్యోగాలు ఇచ్చేందుకు కంపెనీలు ముందుకురావడం వంటి పరిణామాల నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రుల ఆలోచన విధానం కూడా మారుతూ వస్తోంది. ఖర్చు ఎక్కువైనా టాప్ ఇంజనీరింగ్ కాలేజీలు, ఎన్‌ఐటి, ఐఐటి, ఇతర జాతీయ సంస్థల్లో ఇంజనీరింగ్ చేయడమే ఉత్తమమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అక్కడ సీటు రాకపోతే ఇక్కడి టాప్ కళాశాలల్లో ప్రవేశం పొందేలా ప్రయత్నాలు చేస్తున్నారు. దాంతో రాష్ట్రంలో ఏటా సీట్ల సంఖ్య పెరుగుతున్నా, కన్వీనర్ కోటా సీట్లు కూడా పూర్తిగా భర్తీ కావడం లేదు. 2020 21 విద్యాసంవత్సరంలో 66.39 శాతం సీట్లు భర్తీ కాగా, 2021 22లో 70.78 శాతం, 2022 23లో 76.37 శాతం, 2023 24లో 90 శాతం వరకు భర్తీ అయ్యాయి.

డిగ్రీ కోర్సులకు పెరుగుతున్న ఆదరణ

బిఎస్‌సి, బికాం, బిఎ వంటి సాధారణ డిగ్రీ కోర్సులకు ఆదరణ పెరుగుతోంది. డిగ్రీ కోర్సులతోనే ఉపాధి అవకాశాలు లభిస్తుండటంతో విద్యార్థులు వీటిలో ప్రవేశాలు పొందేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంజనీరింగ్‌లో నాణ్యతా ప్రమాణాలు తగ్గడం, మంచి ప్యాకేజీలు లభించకపోవడంతో విద్యార్థులు డిగ్రీ కోర్సులవైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కోర్సు పూర్తయిన తర్వాత డిగ్రీతో ఉద్యోగం చేయడం ఇష్టం లేకపోతే ఎంబిఎ, ఎంసిఎ, బి.ఇడి, ఎంఎస్‌సి,ఎంకాం, ఎంఎ వంటి కోర్సుల్లో ప్రవేశాలు పొందుతున్నారు. ప్రస్తుతం డిగ్రీలో బిఎస్‌సి కంప్యూటర్ సైన్స్, బిఎస్‌సి కెమిస్ట్రీ, బికాం కంప్యూటర్స్ విభాగాల్లో విద్యార్థులు ఎక్కువగా చేరుతున్నారు. 2016- 17 విద్యాసంవత్సరంలో తొలిసారిగా ఆన్‌లైన్ సర్వీసెస్, తెలంగాణ(దోస్త్) డిగ్రీలో ఆన్‌లైన్ ప్రవేశాలు చేపట్టారు. ఈ విద్యాసంవత్సరం రాష్ట్రంలో 3.80 లక్షల డిగ్రీ సీట్లు అందుబాటులో ఉండగా, దాదాపు 2 లక్షల వరకు సీట్లు భర్తీ అయ్యాయి.

డిగ్రీతోనే లభిస్తున్న ఉద్యోగావకాశాలు

డిగ్రీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు క్యాంపస్ నియామకాలలోనే ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ఇంజనీరింగ్ అభ్యర్థులతో సమానంగా హోదా, వేతనాలు లభిస్తున్నాయి. గతంలో ఇంజనీరింగ్, ఫార్మసీ వంటి వృత్తి విద్యా కళాశాలలకే పరిమితమైన ప్రాంగణ నియామకాలు డిగ్రీ కళాశాలల్లో జరుగుతున్నాయి. డిగ్రీ కళాశాలల్లో సైతం బడా కంపెనీలు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ చేపడుతున్నాయి. సాధారణ డిగ్రీ పట్టభద్రులను ఎంపిక చేసుకుని సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా శిక్షణ ఇచ్చేందుకు మొగ్గుచూపుతున్నాయి. దాంతో విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో చేరేందుకే మొగ్గు చూపుతున్నారు. బిఎస్‌సి చేసిన వారికి ఫార్మా కంపెనీలతోపాటు కార్పోరేట్ కంపెనీలలో ట్రైయినీ అసోసియేట్స్‌గా, బిపిఒలుగా ఉద్యోగాలు లభిస్తున్నాయి. దాంతోపాటు బ్యాంకు ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలకు వెలువడే నోటిఫికేషన్లలో ఉద్యోగాలు పొందుతున్నారు. బి.కాం చేసిన వారికి అకౌంటింగ్,ఆడిటింగ్, బ్యాంకింగ్ రంగాలలో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. బిఎ చేసిన వారు జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలపై దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న నూతన ఆర్థిక విధానాలతో కామర్స్ అభ్యర్థులు డిమాండ్ పెరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News