బారీగా తగ్గిన పాజిటివ్ కేసులు
రోజు వారీ విధులు నిర్వహిస్తున్న నగరవాసులు
మార్కెట్లు, దుకాణాల వద్ద కోవిడ్ నిబంధనలు అమలు
లాక్‌డౌన్ సడలింపుతో కడుపు నింపుకుంటామంటున్న దినసరికూలీలు
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో గత పది రోజుల నుంచి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గడంతో నగరవాసులకు రోజు రోజుకు కరోనా భయం వీడుతుంది. లాక్‌డౌన్ సడలించి సాయంత్రం 5గంటల వరకు రోజు వారీ పనులు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించడంతో ప్రజలు పాత రోజులను గుర్తు చేసుకుంటూ విధులకు హాజరైతున్నారు. దీంతో ఆర్టీసీ బస్సులు, మెట్రోలో ప్రయాణికులు సందడి నెలకొంది. అదే విధంగా మార్కెట్లు,దుకాణాలు, మద్యం షాపుల వద్ద జనం తమ కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తూ మహమ్మారి ఉనికి తగ్గుతుందంటున్నారు. వైద్య ఆరోగ్య, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, పోలీసుల అధికారులు వైరస్‌తో చేసిన పోరాటంతో కరోనా కంట్రోల్‌లోకి వచ్చిందని నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కావడంతో విషజ్వరాలు విజృంభించే వాతావరణం ఉంటుందని వైద్య నిపుణుల సలహా మేరకు నగర ప్రజలు ముఖానికి మాస్కులు,శానిటైజర్లు వాడటంతో పాటు భౌతికదూరం పాటిస్తున్నారు. షాపుల యాజమానులు కూడా కోవిడ్ నిబంధనలు అమలు చేస్తూ ఇష్టానుసారంగా దుకాణాల్లోకి వస్తే దూరంగా ఉంచుతూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
ఏప్రిల్, మే నెలల్లో రోగులతో నిండిపోయిన గాంధీ, కింగ్‌కోఠి, ఈఎన్‌టి,టిమ్స్ ఆసుపత్రుల్లో జూన్ నుంచి పడకలు ఖాళీ ఉన్నాయి. పాజిటివ్ కేసుల కంటే రికవరీ రోగుల సంఖ్య ఎక్కువగా ఉందని, అక్కడక్కడ బ్లాక్‌ఫంగస్ కేసులు నమోదైతున్నట్లు ఆసుపత్రుల వైద్యులు చెబుతున్నారు. ప్రజలు జాగ్రత్తలు పాటించడంతో వైరస్ అదుపులోకి వచ్చిందని, ఒకవేళ థర్డ్‌వేవ్ వస్తే కూడ ఎదుర్కొనేందుకు వైద్యశాఖ సిద్దంగా ఉందని,గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆసుపత్రుల్లో సరిపడ వసతులు ఏర్పాటు చేసినట్లు వెల్లడిస్తున్నారు.గత వారం రోజుల నుంచి నమోదైన పాజిటివ్ కేసులు వివరాలు చూస్తే ఈనెల 9వ తేదీన 179 కేసులు, 10న 174 మందికి సోకగా, ఈనెల 11వ తేదీన 158, ఈనెల 12న 171మందికి, ఈనెల 13వ తేదీన 165, ఈనెల 14న 173మందికి సోకగా, ఈనెల 15వ తేదీన 182మందికి వైరస్ ఉన్నట్లు గుర్తించినట్లు జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు.
ఈనెలాఖరు వరకు పూర్తిగా మహమ్మారి తగ్గిపోతుందని భావిస్తూ ప్రజలు గతేడాది నుంచి ఏవిధంగా కరోనా పట్ల జాగ్రత్తలు పాటించారో అదే విధంగా మరో రెండు నెలల వరకు మాస్కులు, భౌతికదూరం తప్పనిసరిని సూచిస్తున్నారు. బడులు తెరిస్తే చిన్నారులపై వైరస్ ప్రభావం ః ప్రభుత్వం ఈనెల 20వ తేదీవరకు వేసవి సెలవులు ఇవ్వడంతో తరువాత పాఠశాలల్లో ప్రత్యక్ష పాఠాలు బోధిస్తే పిల్లలపై వైరస్ ప్రబావం చూపుతుందని జిల్లా వైద్యాధికారులు భావిస్తున్నారు. గడిచిన ఏడాది మాదిరిగానే మరో మూడు నెలల పాటు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తే ఇబ్బందులు ఉండవని, తరగతి గదిలోకి విద్యార్దులు వస్తే థర్డ్‌వేవ్ విరుచుకపడుతుందని పేర్కొంటున్నారు.