Friday, November 22, 2024

తగ్గుతున్న కరోనా కేసులు!

- Advertisement -
- Advertisement -

Decreasing corona cases in India

 

అనుక్షణం గుండెలరచేతిలో పెట్టుకొని, మూతి, ముక్కు కప్పుకొని గడపక తప్పని పరిస్థితుల్లో ప్రపంచాన్ని కొనసాగిస్తున్న కరోనా దాడి మన దేశంలో తగ్గు ముఖం పడుతున్న సూచనలు గమనించదగినవి. దేశంలో కరోనా నయమవుతున్నవారి సంఖ్య కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య కంటే ఎక్కువగా ఉందని, మొత్తం కేసుల్లో తీవ్రస్థాయివి కేవలం 1.65 శాతమేనని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన సమాచారం సంతోషదాయకమైనది. గత వారం రోజుల్లో దేశంలోని 146 జిల్లాల్లో ఒక్క కరోనా కేసైనా నమోదు కాకపోడం శుభసూచకమే. దేశమంతటా మొత్తం 718 జిల్లాలున్నాయి. వాటిలో ఐదో వంతు జిల్లాలు కొత్త కేసులు లేనివి కావడం ఆనందం కలిగించే అంశమే. గత ఏడాది మార్చి 2324న దేశ వ్యాప్తంగా ఆకస్మిక లాక్‌డౌన్ విధించి అన్ని బహిరంగ ఆర్థిక కార్యకలాపాలకు తాళం బిగించి కొన్ని మాసాల పాటు కఠోరంగా అమలు చేసినందువల్ల సాధారణ ప్రజాకోటి, వలస కార్మికుల వంటి దయనీయ స్థితిలోని జనం, చిన్న చితక వ్యాపారులు, చిరుద్యోగులు, నిరుద్యోగులు ఎన్ని కష్టాలు పడినప్పటికీ అది కరోనా వ్యాప్తిని అరికట్టడంలో కొంతైనా ఉపయోగపడిందని అనుకోడానికి ఆస్కారముంది.

ప్రజలు భారీ ఎత్తున ఒక చోట చేరే థియేటర్లు, ఈత కొలనులు వంటివి ఇంకా పూర్తి స్థాయి పునరుద్ధరణకు నోచుకోలేదు. పాఠశాలలు, కళాశాలల ను కూడా తగిన జాగ్రత్తలు పరిమితులతో తెరుస్తున్నారు. వీటన్నిటిలో కరోనా పట్ల స్వల్ప లోపానికి కూడా ఆస్కారమివ్వని జాగరూకత కనిపిస్తున్నది. కరోనా నేపథ్యంలో తీసుకోవలసిన చర్యల పై ముమ్మరంగా సాగిన ప్రచారం, ప్రజల్లో వెల్లివిరిసిన స్వీయ రక్షణ చైతన్యం కూడా ఈ తగ్గుముఖానికి దోహదపడ్డాయని చెప్పవచ్చు. పరిమిత ఆరోగ్య వనరులున్న దేశంలో ప్రభుత్వ ఆసుపత్రులను వీలైనంత శీఘ్రంగా, సమగ్రంగా కొవిడ్ నియంత్రణకు సిద్ధం చేయడమూ బాగా ఉపయోగపడిందనుకోవాలి. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలతో పోలిస్తే సరైన వసతి, ఆహారాది సదుపాయాలు తగినంతగాలేని పేద, దిగువ మధ్య తరగతి జనాభా అత్యధికంగా ఉన్న దేశం మనది. కరోనా తీవ్రత గాని, దాని వల్ల చనిపోతున్నవారి సంఖ్య గాని అమెరికాలో కంటే మన వద్దనే తక్కువగా ఉండడం విశేషం. ప్రపంచంలో ఏ దేశంలో లేనంతగా కోటి 80 లక్షల మంది వీధి బాలలు భారత్‌లో ఉన్నారు. అలాగే మురికి వాడలకు, తల మీద సరైన కప్పు లేని వారికి దేశంలో లోటు లేదు. కాలుష్యం సరేసరి.

130 కోట్లకు మించిన ప్రజలతో ప్రపంచంలోనే రెండవ అత్యధిక జనాభా గల దేశం మనది. ఇన్ని ప్రతికూలతల్లో కూడా మన దేశం కరోనా కోరల నుంచి నెమ్మదిగా విముక్తి పొందుతున్నదని అనిపించడం గొప్ప విషయమే. అమెరికాలో ఇంత వరకు 2 కోట్ల 63 లక్షల 40 వేల 631 కరోనా కేసులు నమోదై 4 లక్షల 43 వేల 794 మంది మరణించారు. బ్రిటన్‌లో 37 లక్షల 43 వేల 734 కేసులు నమోదు కాగా, లక్షా 3 వేల మందికి పైగా మరణించారు. ఇంత భారీ జనాభా గల మన దేశంలో మాత్రం కోటి 72 వేల 971 కేసులు నమోదు కాగా, లక్ష 54 వేల పైచిలుకు మరణాలు మాత్రమే సంభవించడం ఒక విధంగా పరిమిత నష్టాలతో గట్టెక్కడం కిందికే వస్తుంది. అప్పటికీ దేశంలోని అసంఖ్యాక కుటుంబాలు ఆప్తులను కోల్పోయేలా చేసి తీరని విషాదాన్ని ఈ మహమ్మారి మనకు మిగిల్చింది. అది నెమ్మదినెమ్మదిగానైనా తగ్గు ముఖం పడుతున్నదని పూర్తిగా నిష్క్రమించే స్థితి ఒక నాటికైనా వస్తుందనే ఆశలు కలుగుతూ ఉండడం ఎంతైనా హర్షదాయకం. కరోనా మరణాలను సమర్థవంతంగా నివారించగలుగుతున్న రాష్ట్రాలలో తెలంగాణ 3వ స్థానంలో ఉన్నదన్న వార్త మనకు మరింత ముదావహమైనది.

అలాగని కరోనా కడతేరిందన్న ధీమాతో పూర్వపు జీవన శైలికి వెంటనే మళ్లడం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. విధి నిషేధాలను పాటిస్తూ దాని పునర్విజృంభణకు సూది బెజ్జమంత సందైనా ఇవ్వకుండా జాగ్రత్తలు కొనసాగించడం మానుకోరాదు.ఇంకా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అక్కడక్కడా మరణాలు రికార్డవుతున్నాయి. యుకె స్ట్రెయిన్ వంటి కొత్త రకాలు మందకొడిగానైనా వ్యాపిస్తూనే ఉన్నాయి. నిరంతర అప్రమత్తతతోనే వాటిని కడతేర్చి పూర్తి బేఫర్వా స్థితిని పునరుద్ధరించుకోవలసి ఉంది. రెండు టీకాలను స్వయంగా ఆవిష్కరించుకొని ఆరోగ్య కార్యకర్తలకు, వృద్ధులకు మిగతా జనాభా అంతటికీ పంపిణి చేసుకునే విషయంలో కూడా మన దేశం ముందుండడం మరింత గొప్ప విషయం. సుదీర్ఘ లాక్‌డౌన్ వల్ల దారుణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకొని ఉద్యోగాలు, ఉపాధులు కోల్పోయి దయనీయ స్థితిలోకి జారిపోయిన కోట్లాది మంది పేద, మధ్య తరగతి ప్రజలకు మళ్లీ మంచి రోజులు వచ్చే దిశగా దేశం పరుగులు తీయడానికి ప్రస్తుత ఒక మాదిరి స్థిమిత స్థితి దోహదపడాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News