ఒమిక్రాన్ శిఖరస్థాయి నుంచి కిందికి
దిగుతోందని వైద్య నిపుణుల విశ్లేషణ
వారం క్రితం 27,000, ఇప్పుడు 15,424 కేసులు
జోహెన్స్‌బర్గ్: గత కొన్నిరోజులుగా దక్షిణాఫ్రికాలో కొవిడ్-19 కేసుల సంఖ్య తగ్గుతుండటంతో ఒమిక్రాన్ ప్రభావం ఏమంత తీవ్రంగా లేదని వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏదైనా వైరస్ లేదా వాటి వేరియంట్ల వ్యాప్తి శిఖరస్థాయికి చేరిన తర్వాత క్రమంగా తగ్గుకుంటూ వస్తుందన్నది వైరాలజిస్టుల అవగాహన. అదే ఇప్పుడు దక్షిణాఫ్రికాలో జరగడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత గురువారం దక్షిణాఫ్రికాలో 27,000 కొత్త కేసులు నమోదు కాగా, తాజాగా మంగళవారం ఆ సంఖ్య 15,424కు పడిపోయింది. కోటీ 60 లక్షల జనాభా ఉన్న గౌటెంగ్‌తోపాటు ఆ దేశంలోని అతిపెద్ద నగరం జోహెన్స్‌బర్గ్, రాజధాని ప్రిటోరియాలోనూ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఒమిక్రాన్ కేసులకు కొన్ని వారాలుగా కేంద్రంగా ఉన్న గౌటెంగ్‌లో కేసులు తగ్గడం, ఇప్పటికే శిఖరస్థాయి చేరుకొని కిందికి దిగుతున్నట్టుగా భావిస్తున్నామని జోహెన్స్‌బర్గ్‌లోని విట్‌వాటర్స్‌ర్యాండ్ యూనివర్సిటీలో అంటువ్యాధులు, వ్యాక్సిన్లపై పరిశోధకురాలైన మార్తానూనెస్ తెలిపారు.
ఇది స్వల్ప ఉధృతిగా తేలిందని, సంతోషించదగిన అంశమని ఆమె అన్నారు. నవంబర్‌లో ఒక్కసారిగా కేసులు భారీగా పెరగడం, ఇప్పుడు అంతే భారీగా తగ్గడం అంచనా వేయలేకపోయామని ఆమె అన్నారు. ఈ వేరియంట్‌తో ఆస్పత్రుల్లో చేరికలు, మరణాల సంఖ్య కూడా తక్కువేనని ఆమె తెలిపారు. గౌటెంగ్‌లో నవంబర్ మధ్యలో కేసులు పెరిగిన నేపథ్యంలోనే వైరస్‌ను సీక్వెన్సింగ్‌కు పంపి ఈ వేరియంట్‌ను మొదట అక్కడే గుర్తించారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్లూహెచ్‌ఒ) నవంబర్ 25న ఒమిక్రాన్‌గా దానికి నామకరణం చేస్తూ ఆందోళన కలిగిస్తోన్న వేరియంట్‌గా ప్రకటించింది. అప్పటి నుంచి గౌటెంగ్‌లో నమోదైన కేసుల్లో 90 శాతం ఈ వేరియంట్‌వే కావడం గమనార్హం. ఈ వేరియంట్ ఇప్పటికే 89 దేశాలకు విస్తరించిందని డబ్లూహెచ్‌ఒ వెల్లడించింది.