వర్షాలు పడితే మరింత తగ్గుతుంది
విద్యుత్ అధికారులు
హైదరాబాద్: గత కొద్ది రోజుల క్రితం వరకు మధ్యాహ్నం 12.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు బయటకు రావాలంటే నగర ప్రజలు భయపడేవారు. ఆ సమయంలో భానుడు తన ప్రతాపాన్ని చూపడంతో ఎంత ముఖ్యమైన పనులు ఉన్నా బయటకు రాలేని పరిస్థితి. దాంతో వారు తమ కార్యలకలాపాలను వాయిదా వేసుకుని కార్యాలయాలు, గృహాల్లోని ఏసీలు, కూలర్ల మధ్య అధిక సమయంలో వెచ్చించాల్సి వచ్చేది. దీంతో విద్యుత్ మీటరు గిర్రును తిరగడంతో విద్యుత్ బిల్లులు భారీ ఎత్తున వచ్చేవి.అంతే కాకుండా విద్యుత్ డిమాండ్ సైతం 70 మిలియన్ యూనిట్లకు పైగా చేరుకునేది. కాని ప్రస్తుత పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటోంది. వాతావరణంలో వస్తున్న మార్పుల కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం సమయంలో వాతవరణం చల్లబడుతూ సాయంత్రానికి ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుండటంతో ఏసీలు, కూలర్ల వినియోగం కూడా క్రమంగా తగ్గడమే కాకుండా విద్యుత్ డిమాండ్ సైతం క్రమంగా 66.06 మిలియన్ యూనిట్లకు పడిపోయింది. కొద్ది రోజుల్లో రాష్ట్రంలో నైరుతీ రుతుపవనాలు ప్రవేశిస్తాయని, దాంతో విరివిగా వర్షాలుకురిసే అవకాశం ఉండటంతో మరింత విద్యుత్ తగ్గుతుందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.