Wednesday, January 8, 2025

మరో పోరాటం

- Advertisement -
- Advertisement -

ఆత్మగౌరవం, అస్థిత్వం
ప్రమాదంలో పడినప్పుడు
సమాజాన్ని జాగృతం చేయాలి
కెసిఆర్ ఆనవాళ్లు కాదు..
తెలంగాణ ఆనవాళ్లు
చెరిపేందుకు కుట్రలు
దీక్షాదివస్ కార్యక్రమంలో
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కెటిఆర్ రాష్ట్రవ్యాప్తంగా
ఘనంగా దీక్షా దివస్

మన తెలంగాణ/హైదరాబాద్ : పదవుల త్యా గంతో పార్టీని ప్రారంభించి.. ప్రాణ త్యాగానికి వెనుకాడకుండా రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కెసిఆర్ అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కొనియాడారు. ప్రపంచానికే పా ఠాలు నేర్పిన ఉజ్వల ఉద్యమ గాథ మనది అని పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం దీక్షా దివస్ వేడుకలు జరిగాయి. ఈ సందర్భం గా తెలంగాణ తల్లి విగ్రహానికి, అమరవీరు ల స్థూపానికి, ప్రొ.జయశంకర్ విగ్రహానికి కెటిఆ ర్ పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కెసిఆర్ చేసిన పోరాట ఘట్టాలు, ఆయన చేసిన వివిధ కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలతో ఏర్పాటు చే సిన ఫొటో ఎగ్జిబిషన్‌ను కెటిఆర్ బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి వీక్షించారు. అనంతరం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కెటిఆర్ ప్రసంగిస్తూ, తెలంగాణ ఉద్యమ చరిత్ర, కెసిఆర్ దీక్షను కళ్లకు కట్టినట్లు వివరించారు.

చరిత్ర చదవకుండా..భవిష్యత్‌ను నిర్మించలేము అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల కోసం మరోసారి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆత్మగౌరవం.. అస్తిత్వం ప్రమాదంలో పడుతున్నప్పుడు తెలంగాణ సమాజాన్ని జాగృతం చేయకపోతే తప్పు చేసినవాళ్లవుతమవుతామని చెప్పారు. కెసిఆర్ ఆనవాళ్లు కాదు..తెలంగాణ ఆనవాళ్లు చెరిపేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కష్టమొస్తే రాష్ట్ర ప్రజలకు తెలంగాణ భవన్ గుర్తొస్తోందని, తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్‌గా మారిందని చెప్పారు.సమైక్యాంధ్ర సంచులు మోసిన తెలంగాణ ద్రోహి ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఇక్కడున్న సిఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వంపై దాడి మొదలు పెట్టారని పేర్కొన్నారు. ఉద్యమంపై గన్ను ఎక్కుపెట్టిన సిఎం రేవంత్ రెడ్డి, కెసిఆర్ ఆనవాళ్లను చెరిపేస్తా అని రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. సోనియమ్మ లేకపోతే.. తెలంగాణ అడుక్కుతినేదని అహంకారంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అస్తిత్వంపై గుజరాత్ గులాములు ఓ పక్క, ఢిల్లీ కీలుబొమ్మలు మరో పక్క దాడి చేస్తున్నారని అన్నారు. ప్రస్తుత పార్లమెంట్‌లో మన గళం వినిపించే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ గొంతు బిఆర్‌ఎస్ మాత్రమే అని స్పష్టం చేశారు. లగచర్ల భూముల సేకరణ విరమణ బిఆర్‌ఎస్ విజయం… తెలంగాణ ప్రజల విజయం అని వ్యాఖ్యానించారు.

మన జాతికి మహత్తరమైన పోరాట చరిత్ర ఉంది : కెటిఆర్
మన జాతికి మహత్తరమైన పోరాట చరిత్ర ఉందని కెటిఆర్ అన్నారు. అది తెలంగాణ సాయుధ పోరాటం కావొచ్చు.. వీరోచితమైన ఉద్యమ గాథ కావొచ్చు. చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమలమ్మ పోరాటాల్లో వెనక్కి పోలేదని తెలిపారు. ఒక తెలంగాణ ఉద్యమ రూపంలోనే కాకుండా సాయుధ పోరాటంలో కూడా షేక్ బందగీ, దొడ్డి కొమురయ్య, మగ్దూం మొయినుద్దీన్ లాంటి వారు పోరాటలు చేశారు. స్వరాజ్య సమరాన్ని మించిన సముజ్వల సన్నివేశాలను సృష్టించి, సంకెళ్లను తెంచుకున్న సందర్భం.. విజయం మన జాతికి ఉన్నది. కుట్రలను, కుతంత్రాలను చేధించి.. యావత్ జాతిని ఏకతాటి మీదికి తీసుకొచ్చి శాంతియుత పంథాలో వ్యూహాలు, ఎత్తగడలు రచించి ఉక్కు సంకల్పంతో గమ్యాన్ని ముద్దాడిన నాయకులు ఉన్నారని కేటీఆర్ తెలిపారు.

లంబాడా మహిళలతో ఎంఎల్‌సి కవిత డ్యాన్స్
దీక్షా దివస్ కార్యక్రమంలో భాగంగా బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నుంచి తెలంగాణ భవన్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లో ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బసవతారకం ఆసుపత్రి వద్ద నిర్వహించిన కార్యక్రమంలో బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా లంబాడా మహిళలతో కలిసి ఆమె డ్యాన్స్ చేశారు. అనంతరం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన దీక్ష దివస్ కార్యక్రమంలో ఎంఎల్‌సి కవిత పాల్గొన్నారు. అలాగే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పార్టీ నేతలతో కలిసి నిమ్స్ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా దీక్షా దివస్
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009 నవంబర్ 29న బిఆర్‌ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సందర్భంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా బిఆర్‌శ్రీస్ పార్టీ దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా 33 జిల్లాల్లో బిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. దీక్షా దివాస్ సందర్భంగా కరీంనగర్‌లోని అలుగునూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కెటిఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్, పార్టీ నాయకులు బండ ప్రకాష్, రసమయి బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు. అలాగే సిద్ధిపేటలో మాజీ మంత్రి హరీష్‌రావు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా కేంద్రంలోని రంగదాంపల్లిలో అమరులవీరుల స్థూపం దగ్గర అంజలి ఘటించారు. ఈ కార్యక్రమాల్లో ఎంఎల్‌ఎ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంఎల్‌సి యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాలో ఎంఎల్‌ఎ చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ నిర్వహించారు.

అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో, జోగులాంబ గద్వాల జిల్లాలో మాజీ ఎంఎల్‌సి కర్నె ప్రభాకర్ ఆధ్వర్యంలో, వరంగల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో దీక్షా దివస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఎంఎల్‌సి మంకెన కోటిరెడ్డి, మాజీ ఎంఎల్‌ఎ రాజేందర్ రెడ్డి, మక్తల్ మాజీ ఎంఎల్‌ఎ చిట్టెం రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా క్లాక్ టవర్ సెంటర్‌లో జిల్లా ఇంఛార్జ్ మన్నెం శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో దీక్షా దివస్ నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లాలో మాజీ మంత్రి రెడ్యానాయక్, మాజీ ఎంపీ మాలోతు కవిత, మాజీ ఎంఎల్‌ఎ శంకర్ నాయక్ తదితరులు దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఎంఎల్‌సి షేరి సుభాష్ రెడ్డి, ఇతర నేతలు దీక్షా దివస్ నిర్వహించారు. ములుగు జిల్లా కేంద్రంలోని బిఆర్‌ఎస్ భవన్ వద్ద కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మాజీ ఎంఎల్‌ఎ గండ్ర ఆధ్వర్యంలో, మెదక్‌లో నర్సాపూర్ ఎంఎల్‌ఎ సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎంఎల్‌ఎ పద్మాదేవేందర్ రెడ్డిల ఆధ్వర్యంలో దీక్షా దివస్ వేడుకలు జరిగాయి. జనగామ జిల్లాలో ఎంఎల్‌ఎ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో దీక్షా దివస్ నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News