లండన్: తాను ఇప్పుడు అఫ్ఘన్‌లోని మహిళల పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్నానని నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మలాల యూసఫ్‌జాయ్ వ్యాఖ్యానించారు. తాలిబన్లు కాబూల్‌ను కైవసం చేసుకోవడం, అధికారం చేతులు మారడం వంటి పరిణామాలపై ఇప్పుడు బ్రిటన్‌లో ఉంటున్న మలాల ఆదివారం స్పందించారు. మహిళలు, మైనార్టీలు, హక్కుల ఉద్యమకర్తల పరిస్థితి ఏమిటనేది తనకు కలవరం కల్గిస్తోందని తెలిపారు. పాకిస్థాన్ గిరిజన ప్రాంతాల్లో బాలికల విద్య కోసం తన బాల్యదశలోనే తాలిబన్లను కూడా బెదిరించి నిలిచిన మలాల హక్కుల ఉద్యమకర్తగా చిన్నతనంలోనే పేరు తెచ్చుకున్నారు. అఫ్ఘన్‌లోని మహిళల కోసం , హక్కులు సంతరించుకుంటున్న వర్గాల కోసం తన మనసు పరితపిస్తోందని, అఫ్ఘన్‌లో తక్షణ శాంతి, కాల్పుల విరమణకు, పౌరులకు న్యాయం సాయం అందేందుకు ప్రపంచ, ప్రాంతీయ శక్తివంతమైన దేశాలకు విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. తాలిబన్లు ఆధిపత్యం సాధించడం పూర్తిగా దిగ్భ్రాంతికర పరిణామం అయిందన్నారు.
Deeply worried about Afghan women says Malala