పారాలింపిక్స్ కాంస్య విజేత దీప్తి జీవాంజికి
రూ.కోటి నజరానా, గ్రూప్- 2 ఉద్యోగం
భారీ నజరానా ప్రకటించిన సిఎం రేవంత్‌రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: పారిస్ పారాలింపిక్స్-20024లో సత్తాచాటిన యువ అథ్లెట్ దీప్తి జీవాంజికి రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ఆమెకు రూ.కోటి నగదు, గ్రూప్ -2 ఉద్యోగంతోపాటు వరంగల్‌లో 500 గజాల ఇంటి స్థలం ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీప్తి కోచ్ ఎన్.రమేశ్‌కు రూ.10 లక్షల ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
పారాలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులకు శిక్షణ, ఇతర ప్రోత్సాహం అందించేందుకు ఏర్పాట్లు చేయాలని సిఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. యువ అథ్లెట్ దీప్తి జీవాంజి, ఆమె కుటుంబ సభ్యులు, కోచ్, శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి, ఎంపి బలరాం నాయక్, ఎంఎల్‌ఎ కెఆర్ నాగరాజు శనివారం సిఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. పారాలింపిక్స్-20024లో సత్తాచాటిన దీప్తి జీవాంజిని సిఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ జీవాంజి దీప్తి ప్రస్థానం
అథ్లెట్ జీవాంజి దీప్తి స్వగ్రామం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామం. దీప్తి విజయాల వెనక తల్లిదండ్రులు యాదగిరి, లక్ష్మి కృషి అపారం. వారిది నిరుపేద కుటుంబం. దీప్తికి మానసిక వైకల్యం ఉండటంతో ఆమె తండ్రి తల్లడిల్లారు. కుమార్తెకు ఫిట్స్ వస్తే విలవిలలాడిపోయేవారు. ఒకానొక దశలో దీప్తి క్రీడల్లో రాణించేందుకు వెనకాడవద్దని యాదగిరి తనకు ఉన్న ఎకరం పొలాన్ని అమ్మేందుకు కూడా లెక్కచేయలేదు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, జీవితంలో ఉన్నత లక్ష్యాన్ని సాధించాలనే తపనతో జీవాంజి దీప్తి తిరుగులేని క్రీడాకారిణిగా మారారు.
ఒకప్పుడు దీప్తి మానసిక స్థితి చూసి ఇరుగుపొరుగు వారు ఆమెను తరచూ అవహేళన చేసేవారట. వాటన్నింటిని లెక్కచేయకుండా మొక్కవోని దీక్షతో ప్రయత్నించి ఏకంగా పారాలింపిక్స్‌లో పతకం సాధించి తల్లిదండ్రులకు, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది. కాగా 400 మీటర్ల టి 20 విభాగం ఫైనల్‌లో దీప్తి 55.82 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని మూడో స్థానంలో నిలిచి కాంస్య పథకాన్ని ముద్దాడారు. దీప్తి విజయం పట్ల ఆమె తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. దీప్తి జీవాంజి తెలంగాణకు పారాలింపిక్స్‌లో తొలి పతకాన్ని అందించి రికార్డు సృష్టించారు. దీంతో ఆమెకు ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించారు.