డిఫాల్ట్ మిల్లర్లకే కేటాయింపులు చేతులు మారుతున్న
కోట్లాది రూపాయలు అక్రమార్కుల నుంచి భారీగా
వసూళ్లు.. అధికారులు, నేతలకు బహుమతుల ఎర
ఈ సీజన్‌లో ఒక్క సూర్యాపేటలోనే రూ. 100
కోట్ల విలువైన ధాన్యం మాయం గడిచిన కొద్ది
సంవత్సరాలుగా ప్రభుత్వ ఖజానాకు పంగనామాలు
టెండర్ల విషయంలో సర్కార్ వైఫల్యానికి రాష్ట్ర,
జిల్లా స్థాయి అధికారుల ఉదాసీనతే కారణం
తెర వెనుక బియ్యం మాఫియా
రూ. 7వేల కోట్ల విలువ చేసే ధాన్యం పక్కదారి
ఆ పెద్ద గద్ద నేతృత్వంలోనే సిఎంఆర్ ఎగవేత
రైతు ఆరుగాలం పండించిన ధాన్యం అక్రమార్కులకు వరంగా మారుతోంది. ఒకవైపు మద్దతు ధర కోసం రైతన్న పోరాటం చేస్తుంటే… మిల్లర్లు మాత్రం అసోసియేషన్ ముసుగులో వేల కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. అందులోని ఓ పెద్ద గద్ద సిఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టించే ఈ తతంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తద్వారా మిల్లర్ల డాన్‌గా ఎదిగాడు. సిఎంఆర్ అంటే కస్టమ్ మిల్లింగ్ రైస్. ప్రభుత్వం రైతుల నుంచి ఐకెపి కేంద్రాల ద్వారా మద్దతు ధరకు ధాన్యాన్ని కొని బియ్యంగా మార్చడానికి మిల్లరకు కేటాయిస్తుంది. మిల్లర్లు నిర్దేశిత వ్యవధిలోగా ఆ ధాన్యాన్ని బియ్యంగా మార్చి సర్కార్‌కు అప్పగించాల్సి ఉంటుంది. ఆ బియ్యాన్ని ప్రభుత్వం స్థానిక అవసరాల కోసం వినియోగిస్తుంది.మిల్లింగ్ చేసినందుకుగానూ ప్రభుత్వం మిల్లర్లకు కొంత మొత్తంలో ఛార్జీలు చెల్లిస్తుంది. ఇదే సిఎంఆర్ విధానం. అయితే అక్రమ మిల్లర్లు గుడితో పాటు గుడిలో లింగాన్ని మింగినట్లు వారికి కేటా యించిన ధాన్యాన్ని మార్కెట్‌లో అమ్మి సొమ్ము చేసుకోవడమే కాకుండా ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు.
మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో మిల్లర్లకు ప్రతి సీజన్‌లో ప్ర భుత్వం సిఎంఆర్ కింద ఇచ్చే ధాన్యాన్ని తిరిగి ఇవ్వకుండా రూ. వేల కోట్లు ఎగవేసే దందాలో మిల్లర్ల అసోసియేషన్ పెద్దల ముసుగులోని గద్దలే ప్రధాన పాత్ర వహిస్తున్నారని తెలుస్తోంది. ఎప్పటి మాదిరినే ఈ సీజన్‌లో ప్రభుత్వానికి మిల్లర్లు ఇవ్వాల్సిన 35లక్షల టన్నుల ధాన్యం మొత్తం పక్కదారి పట్టడానికి మిల్లర్ల ముసుగులోని ఒక డాన్ కీలక పాత్ర పోషించినట్లు ఆ వర్గాల ద్వారా తెలిసింది. దాదాపు రూ. 7 వేల కోట్ల విలువ చేసే 33 లక్షల టన్ను ల ప్రభుత్వ ధాన్యం మాయం కావడానికి డాన్ తెర వెనుక ఆశీస్సులే కారణమని తెలుస్తున్నది. హైదరాబాద్ కేంద్రంగా ఈ డాన్ జిల్లాల వారీగా అక్రమ మిల్లర్ల దగ్గర నుంచి కోట్లు వసూలు చేసి అధికారులకు, నేతల కు లక్షలు ఎర వేసి ప్రభుత్వానికి ప్రతి ఏటా సిఎంఆర్ ధాన్యాన్ని మా యం చేసే తతంగాన్ని వి జయవంతంగా నడిపిస్తున్నారు.
ప్రభుత్వ ధాన్యంతో వేల కోట్ల వ్యా పారం చేసి వందల కోట్లు ఆర్జించే అక్రమ మిల్లర్లు జిల్లా స్థాయిలో అ ధికారులకు కార్లు, బంగారం, వజ్రాలు ఎర వే యడంతో వారు కఠిన చర్యలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాల స్థా యిలో సిఎంఆర్ ధాన్యం ఎగవేత ప్రతియేటా షరా మామూలుగా మా రి ప్రభుత్వానికి వేల కోట్ల నష్టం వచ్చినా రాష్ట్ర పౌర సరఫరాల శా ఖ కూడా కొరడా ఝళిపించకపోవడంతో ధాన్యం ఎగవేత అడ్డూఅదుపూ లేకుండా సాగుతోంది. రాష్ట్ర స్థాయిలోని అధికారులను, కీలక రాజకీయ నేతలను కూడా మిల్లర్ల ముసుగులోని డాన్ ప్రభావితం చేస్తున్నారు. ఇదంతా తెలియక ప్రభుత్వం నెత్తీనోరూ బాదుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారంలో ఎవరు ఉన్నా వారిని బుట్టలో వేసుకొని సిఎంఆర్ ఎగవేతను విజయవంతంగా నడిపించడంలో ఆ డాన్ కృతకృత్యులవుతున్నా పట్టించుకొనేవారు కరువయ్యారు.
ఈ దళారీ గద్ద అటు ప్రభుత్వాన్ని, ఇటు అధికారులను, నేతలను డబ్బు సంచులతో ప్రభావితం చేసి మిల్లర్లు డిఫాల్ట్‌గా మారే పరిస్థితిని కల్పిస్తున్నారు. జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్లు, డిఎస్‌ఒ లు, కొందరు నేతలు ఈ విషపు దందాలో తెలియకుండానే పాత్రధారులు అవుతున్నారు. రాష్ట్ర స్థాయిలో పౌర సరఫరాల శాఖ కార్యాలయాన్ని భ్రష్టు పట్టడానికి ఈ పెద్ద గద్దనే ప్రధాన కారణమని చెబుతున్నారు. ప్రస్తుత యాసంగి సీజన్‌లో 35 లక్షల టన్నుల ధాన్యానికి రెండు లక్షల టన్నుల ధాన్యమే రికవరీ కావడం దాదాపు 7 వేల కోట్ల ధాన్యాన్ని మిల్లర్లు పక్క దారి పట్టించడానికి కూడా ఈ గద్దనే కారణమని చెబుతున్నారు. రాష్ట్రంలో అధికార, విపక్షాల మధ్య బియ్యం వార్ జరుగుతున్న నేపథ్యంలో అసలు ఈ దందా వెనక సూత్రధారులు, పాత్రధారులను ప్రభుత్వం వదిలి వేస్తున్నది. నల్లగొండ జిల్లా సూర్యాపేట మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇమ్మడి సోమ నరసయ్య ఒకరే ఈ సీజన్‌లో రూ. 100 కోట్ల ధాన్యాన్ని మాయం చేశారు.
కానీ ఇదే అధ్యక్షుడు గతంలో వివిధ పేర్ల మీద రూ. 236 కోట్ల దాకా ధాన్యం ప్రభుత్వానికి తిరిగి అప్పగించే విషయంలో డిఫాల్ట్ అయ్యారు. అయినా ఇతనికే పదేపదే సిఎంఆర్ ధాన్యం అప్పగింత వెనక జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా జరిగిన డబ్బు సంచుల బాగోతమే కీలక పాత్ర కనిపిస్తున్నది. సూర్యాపేట జిల్లాలో కోదాడకు చెందిన ఓ అక్రమ మిల్లర్ రూ. 35 లక్షల విలువ చేసే ఇన్నోవాను జిల్లా స్థాయి అధికారికి గిఫ్ట్‌గా ఇచ్చారంటే ఈ దందాలో ముడుపుల పాత్ర ఎలా ఉందో తెలియజెప్పుతున్నది. ఈ సీజన్‌లో కొత్త ప్రభుత్వం టెండర్ల విషయంలో విఫలం కావడానికి రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారుల ఉదాసీనత, బియ్యం మాఫియా తెర వెనక పాత్ర కీలకంగా ఉంది. ఈ సీజన్‌లో 33 లక్షల టన్నుల సిఎంఆర్ ధాన్యాన్ని ఎగ్గొట్టిన మిల్లర్ల వివరాలు బయటకు రావడం లేదు. దాదాపు ఏడు వేల కోట్ల విలువచేసే ధాన్యం వివిధ జిల్లాల్లో పక్కదారి పట్టింది. మిల్లర్లు అక్రమంగా సిఎంఆర్ కేటాయింపులు పొంది ఆ ధాన్యాన్ని మిల్లింగ్ చేయకుండా కొందరు, చేసి కొందరు మార్కెట్‌లో అమ్మి సొమ్ము చేసుకొని ప్రభు త్వానికి పంగనామాలు పెట్టారు.
ఈ సీజన్‌లో సిఎంఆర్ కేటాయింపుల ఆధారంగా వివరాలు తీసుకొని జిల్లాలవారీగా ప్రభుత్వానికి ధాన్యం అప్పగించని మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటే మొత్తం సూత్రధారులు బయటికి వచ్చే అవకాశం ఉంది. పక్కదారి పట్టడం ఇప్పటి విషయం కాదు. ఇది గడచిన కొన్నేళ్ళుగా కొనసాగుతూనే ఉన్నది. ధాన్యం అప్పగించని మిల్లర్లకు ధాన్యం కేటాయింపుల విషయంలో మిల్లర్ల అసోసియేషన్ పెద్దలే ఆమ్యామ్యాలతో ప్రభుత్వానికి పంగనామం పెట్టిస్తున్నారు. కనీసం ఐదు కోట్ల రూపాయల విలువ చేసే మిల్లు ఇంకా చెప్పాలంటే బాయిలర్ లేని మిల్లులకు కూడా రూ. 50 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని కేటాయించడం మూలంగానే ప్రతి ఏడాది ధాన్యం గోల్ మాల్ జరుగుతున్నది. ప్రభుత్వం వేల కోట్లు నష్టపోతుంటే ఆ మేరకు అక్రమ మిల్లర్లు కోట్లకు పడగలెత్తుతున్నారు. వారికి హైదరాబాదు నుంచి ఆశీస్సులు అందిస్తున్న గద్దలు వంద రూపాయలు అక్రమ మిల్లర్ల నుంచి తీసుకుంటే పది రూపాయలు అధికారులకు, నేతలకు విదిలిస్తూ ధాన్యం కుంభకోణాన్ని ‘యథా రాజా తథా ప్రజ’లా కొనసాగిస్తున్నారు.
సిఎంఆర్ కేటాయింపుల్లో పారదర్శకత లేదు
వేల కోట్ల రూపాయల ధాన్యాన్ని మిల్లర్లకు సిఎంఆర్ రూపంలో అప్పగించే విషయంలో పారదర్శకత లేదు. స్పష్టమైన విధానపర నిర్ణయం లేకపోవడంతోనే మిల్లర్ల అక్రమాలు చోటు చేసుకొంటున్నాయి. సిఎంఆర్ ధాన్యాన్ని కేటాయించడానికి స్పష్టమైన మార్గదర్శక సూత్రాలు రూపొందించాలి. ముఖ్యంగా మిల్లుల కెపాసిటిని క్షేత్రంలో నిర్ధారించాలి. అవసరమైతే ఆ మిల్లు కరంటు సామర్థాన్ని తెలుసుకోవాలి. మిల్లర్ల క్రెడిబులిటీని కూడా జిల్లా స్థాయి అధికారులు నిర్ధారించుకోవాలి. ఆ తర్వాతే వారికి అర్హత, సామర్థం ప్రకారం ధాన్యం అప్పగించాలి. కాని ఇక్కడ స్పష్టమైన పాలనాపరమైన విధాన నిర్ణయం లేకపోవడాన్ని ఆసరాగా చేసుకొని అసోసియేషన్ ముసుగులోని గద్దలు బియ్యం దందాను అప్రతిహతంగా కొనసాగిస్తున్నారు.