విశాఖపట్నం: దేశాన్ని ప్రమాదకరమైన పరిస్థితిలోకి తీసుకువెళుతున్న బిజెపిని 2024 ఎన్నికల్లో ఓడించడమే అన్ని పార్టీల లక్ష్యం కావాలని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికలు క మ్యూనిస్టు పార్టీకి మాత్రమే గాక దేశానికి, దేశ ప్రజలకు కూడా ఎంతో కీలకమన్నారు. విశాఖలో జరుగుతున్న సిపిఐ 27వ రాష్ట్ర మహాసభల్లో రెండో రోజు శనివారం ప్రతినిధుల సమావేశంలో ప్రారంభోపన్యాసం చేశారు. బిజెపిని ఓడించడమనేది రాజకీయ నినాదం కాకుండా ఒక డిమాండ్‌గా తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఎందుకంటే బిజెపి ముస్లింలు, క్రిస్టియన్లు, కమ్యూనిస్టులను శత్రువులుగా చూస్తోందని విమర్శించారు. పేరుకు బిజెపి ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఆర్‌ఎస్ఎస్ కనుసన్నల్లోనే కేంద్రం నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. దళితులు, మహిళలు, ఆదివాసీలు, కార్మికులతో పాటు అన్నివర్గాలపైనా ఆర్‌ఎస్ఎస్ ఆధ్వర్యంలోనే దాడులు జరుగుతున్నాయన్నారు. ‘‘దేశంలో కార్పొరేట్ సంస్థలను బిజెపి పోషిస్తోంది,బిజెపి మత రాజకీయాలనే నమ్ముకుని రాజకీయం చేస్తోంది. ఎన్డీఏ హయాంలో పేదలు మరింత పేదలుగా, సంపన్నులు మరింత కుబేరులుగా మారుతున్నారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్న అన్నదాతల డిమాండ్‌ను ఏమాత్రం పట్టించుకోవడం లేదు’’ అని డి.రాజా అన్నారు.