స్వాతంత్ర ఫలాలను అందరికీ అందించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం
సిపిఐ రాష్ట కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
మన తెలంగాణ / హైదరాబాద్ : భగత్ సింగ్ పోరాట స్పూర్తితో మతోన్మాద శక్తులను ఓడిద్దామని, దేశ యువతకు మత రాజకీయాలను నూరి పోస్తున్న మోడీ నిరంకుశ విధానాలను ఎండగట్టాలని బారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. అఖిల భారత యువజన సమాఖ్య (ఎఐవైఎఫ్) రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 94వ వర్ధంతిని పురస్కరించుకుని ‘షహీద్ దివస్ ర్యాలీని‘ హిమాయత్ నగర్ లోని సత్యనారాయణ రెడ్డి భవన్ నుండి రామ్ కోఠి లోని భగత్ సింగ్ విగ్రహం వరకు నిర్వహించారు. మాధకద్రవ్యాలను నిర్మూలించాలని, ఇంక్విలాబ్ జిందాబాద్, భగత్ సింగ్ అమరేహే అనే నినాదాలతో భారీ యువజన ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ భారత స్వాతంత్య్ర పోరాటంలో భగత్ సింగ్ నిర్వహించిన పాత్ర యావత్తు దేశం విస్మరించరానిదన్నారు.
12ఏళ్ళ అతి చిన్న వయసులోనే స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని 23 ఏళ్ళ యువప్రాయంలోనే దేశం కోసం ప్రాణాలర్పించి ఎందరో యువతకు స్ఫూర్తిగా నిలిచి దేశ భక్తిని రగిలించిన సమరయోధుడు, విప్లవ మూర్తి భగత్ సింగ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈటీ. నర్సింహా, ఎఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శి వలి ఉల్లా ఖాద్రీ, కల్లూరు ధర్మేంద్ర, రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి. సత్య ప్రసాద్, శ్రీమాన్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శి ఆర్. బాల కృష్ణ , నెర్లకంటి శ్రీకాంత్, ఎఐవైఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శి మధు, శివ కుమార్, ఎఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మహమూద్, రాష్ట్ర సమితి సభ్యులు మాజీద్ అలీ ఖాన్, కళ్యాణ్, అనీల్ కుమార్, తదితరులు పల్గొన్నారు.
భగత్ సింగ్ కి భారత రత్న ప్రకటించాలి : ఎఐఎస్‌ఎఫ్
పంజాబ్ ప్రాంతంలోని ఖత్కర్ కలాన్ అనే గ్రామంలో జన్మించిన భగత్ సింగ్ చిన్న వయస్సులోనే తుపాకీ పట్టి బ్రిటిష్ వారిని గడ గడ లాడించాడని ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మణికంఠ్ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ అన్నారు. ప్రతి భారతీయుడిలో విప్లవాగ్నిని రగిలించిన యోధుడు, ఒక మండే అగ్నిగోళం, జ్వలించే నిప్పుకణిక దేశ స్వాతంత్య్రం కోసం తన స్నేహితులు రాజ్ గురు, సుఖ్ దేవ్ లతో కలిసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు కొనసాగించి, దేశ స్వాతంత్య్రం కోసం పోరాడి ఉరికొయ్యను ముద్దాడారని కొనియాడారు.
ఆదివారం ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 94వ వర్ధంతి సందర్బంగా రామ్ కోఠిలోని భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వారి స్పూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై విద్యార్థి, యువత పోరాడాలని, నూతన జాతీయ విద్యా విధానానికి, విద్యా కాషాయికరణ, విద్యా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం భగత్ సింగ్ వర్ధంతి జయంతులను అధికారికంగా నిర్వహించాలని, ఆయనకు భారత రత్న ప్రకటించాలని, భగత్ సింగ్ జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని, భగత్ సింగ్ ఆశయ సాధనకు నేటి విద్యార్థి లోకం కృషి చేయాలని కోరారు.