Monday, December 23, 2024

సింధును వీడని పరాజయాలు.. కెరీర్ ప్రశ్నార్థకం!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఒకప్పుడు ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్‌లో ఎదురులేని శక్తిగా కొనసాగిన భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఇటీవల కాలంలో వరుస పరాజయాలతో నిరాశ పరుస్తోంది. తాజాగా జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో సింధు తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. అంతకుముందు కొరియా ఓపెన్‌లోనూ సింధు మొదటి రౌండ్‌లోనే ఓటమి పాలైంది. గతంలో చాలా రోజుల పాటు మహిళల బ్యాడ్మింటన్‌ను శాసించిన సింధుకు ప్రస్తుతం తొలి రౌండ్ దాటడం కూడా కష్టంగా మారింది. 2023లో సింధు అత్యంత పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచింది.

వరుస ఓటములు సింధును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పేలవమైన ఫామ్‌తో సతమతమవుతున్న సింధు ర్యాంకింగ్స్‌లో కిందికి పడిపోతోంది. సైనా నెహ్వాల్‌లాగే సింధు కెరీర్ కూడా ప్రశ్నార్థకంగా తయారైంది. సైనా కూడా వరుస ఓటములతో సతమతమవుతున్న విషయం తెలసిందే. తాజాగా సింధుకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురువుతోంది. టైటిల్ గెలవడం మాట అటుంచితే కనీసం క్వార్టర్ ఫైనల్ దశను దాటడం కూడా కష్టంగా మారుతోంది. కొన్నేళ్ల క్రితం వరకు మహిళల బ్యాడ్మింటన్‌లో సింధు స్టార్ షట్లర్‌గా ఓ వెలుగు వెలిగింది. ఒలింపిక్స్‌తో సహా ప్రపంచ ఛాంపియన్ వంటి మెగా టోర్నమెంట్‌లలో మెరుగైన ప్రదర్శనతో అలరించింది. కానీ రానురాను సింధు ఆట తీరు అత్యంత పేలవంగా తయారైంది. ర్యాంకింగ్స్‌లో కూడా సింధు కిందికి పడిపోయింది.

చైనా, కొరియా, జపాన్, తైపీ, ఇండోనేషియా, స్పెయిన్, డెన్మార్క్‌లకు చెందిన షట్లర్లు వరుస టైటిల్స్‌తో పెను ప్రకంపనలు సృష్టిస్తుండగా సింధు వరుస ఓటములను చవిచూస్తోంది. సింధు ఆట రోజురోజుకు తీసికట్టుగా మారడంతో ఆమె కెరీర్ ప్రమాదంలో పడిందనే చెప్పాలి. ఎంతో ప్రతిభ ఉన్నా సింధు మాత్రం దాన్ని తనకు అనుకూలంగా మార్చుకోలేక పోతోంది. ఈ ఏడాది ఓ టోర్నమెంట్‌లో మాత్రమే సింధు మెరుగైన ప్రదర్శన చేసింది. మిగిలిన టోర్నమెంట్‌లలో క్వార్టర్ ఫైనల్ దశ కూడా దాటలేక చేతులెత్తేస్తోంది.

ఓ దశలో ప్రపంచ బ్యాడ్మింటన్‌లో అగ్రశ్రేణి షట్లర్‌గా కొనసాగిన సింధు ప్రస్తుతం అనామక క్రీడాకారిణిగా మారిపోయింది. తనకంటే కింది స్థాయి ర్యాంకింగ్ కలిగిన షట్లర్లను సయితం ఓడించలేక పోతోంది. గతంలో అగ్రశ్రేణి షట్లర్లను సయితం అలవోకగా ఓడిస్తూ వరుస టైటిల్స్‌ను సొంతం చేసుకున్న సింధు ఇటీవల కాలంలో ఓటములతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇప్పటికైనా సింధు తన ఆటను మెరుగు పరుచుకోవడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే కెరీర్ కనుమరుగు కావడం ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News