Saturday, November 23, 2024

ఆక్సిజన్ పంపిణీలో లోపాలు

- Advertisement -
- Advertisement -

Defects in Oxygen distribution

 

ప్రస్తుతం ఎక్కడ విన్నా ఒక్కటే మాట ఆక్సిజన్.. ఆక్సిజన్.. ఆక్సిజన్ కొరత.. కరోనా మొదటి వేవ్ లో అయితే మనకు ఎదురైన ప్రధాన సమస్యలు ఔషధాలు బెడ్స్ కొరత ..ఆ సమయంలో అందరి దృష్టి శుచి శుభ్రత పోషకారం పైనే ఉండేది కానీ రెండవ వేవ్ లో మాత్రం ఆక్సిజన్ ఆక్సిజన్ అనే మాటలే మార్మోగుతున్నాయి. ప్రస్తుతం కోవిడ్ విషయంలో సమస్య అంతా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కనుక దాదాపు ప్రతీ ఇంటిలో ఆక్సి మీటర్ ఏర్పాటు చేసుకుంటున్నారు. దాని ద్వారా తరచు ఆక్సిజన్ శాతం చూడటం ఏ మాత్రం అనుమానం ఉన్నా ఆక్సిజన్ కోసం హాస్పిటల్ కు పరుగులు తీయడం చేస్తున్నారు..ఆక్సి మీటర్ లో సాంకేతిక లోపాలు వలన కానీ దానిలో బాటరీలు అయిపోయినప్పుడు కానీ ఆక్సిజన్ క్షీణించినట్లుగా ఫలితం వస్తుంది.ఆ సమయంలో ఆందోళన పెరిగి ఊపిరి తీసుకోవడం మరింత కష్టమై ప్రాణాలను పోగొట్టుకున్న వారు కూడా అనేకులు ఉన్నారు.ఈ రూపంలో ప్రభుత్వ లెక్కలలోనికి రాని మరణాలు కూడా అనేకం ఉన్నాయి.

ఆక్సిజన్ లభించక పోవడం వలన ప్రతీ నిత్యం మరణాలు.  ప్రతీ హాస్పిటల్ వద్ద ఆక్సిజన్ లభించక సంభవించే ఇటువంటి మరణాలును పత్రికలలో పతాక శీర్షికలలో వార్తలు రూపంలో వస్తూ ఉండగా టీవీలలో సామాజిక మాధ్యమాలలో ఇవే వార్తలు ఇవే చర్చలు పదే పదే కొనసాగుతూ ఉన్నాయి…దీనివలన కోవిడ్ బాధితులే కాదు కోవిడ్ సోకని వారు కూడా ముందు ముందు మనకు కోవిడ్ సోకినా ఆక్సిజన్ లభించకపోతే అదే విధమైన పరిస్దితి ఎదురవుతుందేమో అనే తీవ్ర ఆందోళన ప్రతీ ఒక్కరిలో చోటు చేసుకుంటూ ఉంది..చాలా మంది ఈ రూపేణా ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు.దేశ రాజధానిలో సైతం ఆక్సిజన్ అందక మరణించిన వారు అనేకులు.ఒక వేళ ఆక్సిజన్ దొరికినా కూడా 150 రూపాయిల సిలండర్ 6 వేల రూపాయిలు పలుకుతోంది అని సామాన్యు లు వాపోతున్నారు.కొరత అనే మాట వ్యాపించగానే బ్లాక్ మార్కెట్ అనేది మరింత విస్తృతం అయిపోయింది.భాగ్యవంతులు మాత్రం ఈ పరిస్థితిని గమనించి ముందుగానే ఆక్సిజన్ కాంసెంట్రేటర్ మిషన్లు కొనుగోలు చేసి ఇంటిలో పెట్టుకుంటున్నారు. హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న వాళ్ళు మరియు ప్రైవేట్ వైద్యశాలలు కూడా కొనుగోలు ఆరంభించే సరికి వీటి ధర కూడా కొండెక్కడం జరిగింది. కొందరు అయితే అద్దె ప్రాతిపదికపై వీటిని తీసుకుంటున్నారు.

ఈ సంక్షోభం విషయంలో అత్యున్నత న్యాయస్థానం కూడా తీవ్రంగా స్పందించింది. మొదటి వేవ్ లో ఆక్సిజన్ అవసరం 41 శాతంగా ఉంటే రెండవ వేవ్ లో ఇది 54.5 శాతానికి చేరుకుందని నీతి ఆయోగ్ కూడా పేర్కొంది.దీనిని బట్టి ప్రాణవాయువు డిమాండ్ మనకు అర్ధం అవుతూ ఉంది. అయితే మన దేశంలో ఆక్సిజన్ కొరతకు ఆక్సిజన్ ఉత్పత్తి లేక కాదు..పంపిణీనే ప్రధాన సమస్యగా మారింది..2017 వరకు ద్రవరూప ఆక్సిజన్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ అగ్రగామిగా ఉంది.అయితే క్రమేపీ వైద్య మరియు పారిశ్రామిక అవసరాలు పెరిగిపోవడంతో ఆక్సిజన్ ఎగుమతులపై ప్రభుత్వం కొద్ది అంక్షలు కూడా విధించడం జరిగింది.అయితే గత సంవత్సరం మాత్రం ఒకే సారి వీటి ఎగుమతులను పెంచేసింది.గత సంవత్సరం మొదటి వేవ్ కోవిడ్ అనుభవాలు పొరుగు దేశాల్లో సెకండ్ వేవ్ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని వ్యవహరిస్తే ఈ దయనీయ పరిస్దితి వచ్చి ఉండేది కాదు అని విమర్శకులు పేర్కొంటున్నారు..సరైన వ్యూహంతో గత సంవత్సరం నుండి ముందుకు వెళ్లి ఉంటే ఈ విపత్తును చాలా వరకూ అధిగమించి ఉండే వాళ్ళం.ఈ క్లిష్ట సమయంలో ఆక్సిజన్ కోసం దేశంలో ప్రతీ రాష్ట్రం ఎదురు తెన్నులు చూస్తూ ఉంటే కేరళ రాష్ట్రం మాత్రం ఆక్సిజన్ కోసం ఎదురు చూడలేదు. తాను ఉత్పత్తి చేసిన దానిలో రాష్ట్ర అవసరాలు తీరగా తిరిగి తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాలకు ఎగుమతి చేస్తూ ఉంది దీనికి గల కారణం.

మొదటి వేవ్ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని దాదాపు నూరు శాతం ఆక్సిజన్ ఉత్పత్తులపై దృష్టి పెట్టడం వల్లనే అది సాధ్యం అయ్యిందని కేరళ ప్రభుత్వం చెబుతూ ఉంది.వాస్తవంగా ఆక్సిజన్ ఉత్పత్తి పంపిణీ కేంద్రం చేతిలో ఉన్నప్పటి కేంద్రం మాత్రం వ్యూహాత్మకంగా అడుగులు వేయలేదు అనేది సత్యం.మన దేశం ప్రస్తుతం రోజుకు 7128 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. అయితే వాస్తవంగా ఈ మొత్తం ఉత్పత్తిలో దాదాపు 92 శాతం పారిశ్రామిక అవసరాలకే కేటాయింపు జరుగుతూ ఉంది..అయితే ఈ సంక్షోభం తల ఎత్తిన తరువాత కేవలం అత్యవసర పారిశ్రామిక అవసరాలకు మినహాయించి మిగిలినది అంతా ఔషధ, వైద్య రంగాలకు కేటాయింపు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీనివలన పారిశ్రామిక ప్రగతి కుంటుపడినా ప్రజల ప్రాణాలను నిలబెట్టిన వాళ్ళం అవుతామని ప్రభుత్వం భావించింది.అంతే కాకుండా రాష్ట్రాలకు పుష్కలంగా ఆక్సిజన్‌ను పంపించేందుకు ‘ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల’ను నడపడం ప్రారంభించింది. మన దేశంలో ఈ సంక్షోభాన్ని గమనించిన అమెరికా, రష్యా, ఫ్రాన్స్ జర్మనీ వంటి 40 దేశాల వరకూ ఔషదాలను ద్రవరూప ఆక్సిజన్‌ను మనకు అందించడానికి ముందుకు వచ్చాయి. పొరుగు దేశం పాకిస్తాన్ కూడా మనకు ఆక్సిజన్ ఎగుమతి అందించడానికి ముందుకు వచ్చింది.

ఇన్ని జరుగుతూ ఉన్న ఇంకా ఆక్సిజన్ అందక మరణాలు జరుగుతూనే ఉన్నాయి.ఆక్సిజన్ నిండుగా ఉంది కానీ ఆక్సిజన్ మరణాలు తగ్గడం లేదు. కారణం పంపిణీ సమస్య. ఉత్పత్తి చేసిన ఆక్సిజన్ ను దేశంలోని మారుమూల ప్రాంతాలకు వేగంగా చేరవేయడం చాలా పెద్ద సమస్యగా తయారయ్యింది. యుద్ధ ప్రాతిపదికపై ఆక్సిజన్ రవాణాకు చర్యలు చేపట్టినప్పటికి రవాణాలో తీవ్ర జాప్యం వలన మరెన్నో ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయి..

దేశ వ్యాప్తంగా ఉక్కు పరిశ్రమలు, చమురు శుద్ధి కర్మాగారాలు తమ ఫ్లాంట్ల ద్వారా నిరంతరం ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నాయి. అయితే, ఆక్సిజన్ సరఫరా చేయడానికి తగినంత ట్యాంకర్లు లేవు. చాలా ఫ్లాంట్లు తూర్పు భారతదేశంలో ఉన్నాయి. పశ్చిమాన ఒక ఆక్సిజన్ ఫ్లాంట్ కూడా లేదు. తగినంత ఆక్సిజన్ లభ్యత ఉన్నప్పటికీ, రవాణా ఒక పెద్ద సవాలుగా మిగిలిపోయింది.
ఆక్సిజన్ పంపిణీకి అవసరమైన రోడ్ ట్యాంకర్లు, స్టోరేజీ ట్యాంకు లు, సిలిండర్లు సమకూర్చుకోవడం అసలు సమస్య. ఇవన్నీ చాలా ఖర్చుతో కూడినవి. ఒక సిలిండర్ ఆక్సిజన్ ధర రూ.300 వరకు ఉంటుంది. కా నీ ఆక్సిజన్ రవాణాకు కంపెనీలు ఉపయోగించే ట్యాంకర్ ధర సుమారు రూ.45 లక్షలు, ఖాళీ సిలిండర్ ధర రూ.10వేలు వరకు ఉంటుంది. అందువల్ల ఆక్సిజన్ ఉత్పత్తి కంపెనీ లు సాధారణ పరిస్థితుల్లో అవసరమైన మేరకే వీటిని సమకూర్చుకొంటాయి.

పెట్రోల్, డీజిల్, ఎల్పీజీలను పైప్‌లైన్ల ద్వారా వేల కిలోమీటర్లు రవాణా చేస్తున్నారు,అలాగే ఆక్సిజన్‌ను కూడా అలా చేరవేయగలగితే అసలు సమస్యే ఉత్పన్నం కాదు.దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం చేసిన విజ్ఞప్తి మేరకు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్ధ(డి. ఆర్.డీ.ఓ)మెడికల్ ఆక్సిజన్ తయారీకి టెక్నాలజీని అభివృద్ధి చేసింది.ఈ టెక్నాలజీలో వాతావరణంలోని గాలిని పీల్చుకుని జియోలైట్ పదార్థం సహాయంతో అందులోని ఇతర వాయువులను తొలగించి 93 శాతం గాఢతలో ఆక్సిజన్ ను వేరు చేస్తాయి. దీనిని నేరుగా రోగులకు అందించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు ఎక్కడికక్కడ ప్రతీ హాస్పిటల్ లో ఇటువంటి టెక్నాలజీ ఉపయోగించుకోగలిగితే ఆక్సిజన్ కొరత అంతర్ధానం అవుతుంది..అయితే ఎత్తైన ప్రదేశాలలో ఉండే హాస్పిటల్ లో ఈ టెక్నాలజీ సౌకర్యవంతంగా ఉంటుందని చెబుతున్నారు..దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిస్ధితులను దృష్టిలో ఉంచుకుని 500 వరకు ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు సిద్ధం అయినట్లు డీ.ఆర్.డీ.ఓ తెలియచేసింది.. దీని ద్వారా పంపిణీ సమస్యను చాలా వరకు అధిగమించి సత్వరమే ఆక్సిజన్ అందించడానికి ఎంతగానో వీలు పడుతుంది.

అయితే దీని ఏర్పాటు వ్యయాన్ని దృష్టి లో ఉంచుకుని అన్ని హాస్పిటల్స్ ముందుకు రాకపోవచ్చు.మరొక పక్క దేశ వ్యాప్తంగా 162 ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు అత్యవసర అనుమతులు మంజూరు చేసింది.వాటిలో ఇప్పటి వరకూ 4 మాత్రమే పూర్తి అయ్యాయి.అన్ని రాష్ట్రాల విషయంలో ఓకే విధంగా కాకుండా బాగా అవసరం ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ మొత్తంలో సరఫరా చేయడానికి కేంద్రం వ్యూహం సిద్ధం చేసింది.తెలంగాణ ప్రభుత్వం అయితే దేశంలోనే తొలిసారిగా ఆక్సిజన్ సరఫరా కోసం యుద్ధ విమానాలను సైతం ఉపయోగించింది.సాధారణ పరిస్ధితులలో అయితే లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తిలో భారత్ మిగులు దేశం.కాకపోతే కోవిడ్ సెకండ్ వేవ్ లో అనూహ్యంగా శ్వాస ఇబ్బంది సమస్య జఠిలం అయిన స్దితిలో సరైన ముందస్తు వ్యూహం లేకపోవడం వలన చాలా ప్రాణ నష్టం జరిగిపోయింది.

కరోనా వైరస్ సెకండ్‌వేవ్‌ఇంతలా విజృంభిస్తుందని ప్రభుత్వాలు, పాలకులు ఊహించలేదు. దీంతో అనేక రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించారు. ప్రజలలో కూడా నిర్లక్ష్యం ఎక్కువుగా కనిపించింది.

కరోనా అంతమైందనే భావనలో ప్రభుత్వాలు, ప్రజలు కరోనా మార్గదర్శకాలను పట్టించుకోలేదు. దీని పర్యవసానాలు ఇప్పుడు అనుభవవించాల్సి వస్తోంది..ఇప్పుడైనా సత్వరమే జాతీయ ప్రణాళికా వ్యూహాలతో ఎప్పటి కప్పుడు సమస్యను పరిశీలిస్తూ పంపిణీలో అసమానతలు మరియు జాప్యం లేకుండా విపత్తును దీటుగా ఎదుర్కోవాలని సర్వోన్నత న్యాయ స్దానం ఇచ్చిన ఆదేశాలను కేంద్రం అమలులో మరింత చొరవ చూపగలిగితే ప్రాణవాయువు సమస్యకు పరిష్కారం సుగమం అవుతుంది.

                                                                                     రుద్రరాజు శ్రీనివాసరాజు,
                                                                                        9441239578

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News