నిందితుడు సినీఫీల్డ్‌లో సెట్‌వర్కర్
సంచలనం సృష్టించిన కేసు
వివరాలు వెల్లడించిన నగర సిపి అంజనీకుమార్
హైదరాబాద్: సినీనటి షాలు చౌరాసియాపై దాడి చేసి మొబైల్ ఫోన్ చోరీ చేసిన కేసులో నిందితుడిని వెస్ట్, నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి యాపిల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా, కులకచర్ల గ్రామానికి చెందిన కొమ్ము బాబు రెండో తరగతి వరకు చదువుకున్నాడు. తర్వాత చదువు ఆపివేసి వ్యవసాయ కూలీ పని చేసేవాడు. మూడేళ్ల క్రితం నగరానికి బతుకుదెరువు కోసం వచ్చి నగరంలోని ఇందిరానగర్‌లో ఉంటూ సినీఫీల్డ్‌లో సెట్ వర్కర్‌గా చేరాడు. రోజుకు రూ.500 ఇచ్చేవారు, నెలకు 10 రోజులు మాత్రమే పని ఉండడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.
డిసెంబర్01, 2019లో గోల్కొండ పోలీస స్టేషన్ పరిధిలో ఓ బాధితురాలి మొబైల్ ఫోన్ చోరీ చేసేందుకు యత్నించాడు. పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. వచ్చే డబ్బులు తన ఆర్థిక అవసరాలకు సరిపోవడంలేదు. దీంతో చోరీలు చేయాలని ప్లాన్ వేశాడు. జనవరి, 22వ తేదీ, 2021లో ఓ యువతి(25) కెబిఆర్ పార్క్‌లో వాకింగ్ చేస్తుండగా దాడి చేసి ఆమె వద్ద ఉన్న మొబైల్ ఫోన్ చోరీ చేయాలని దాడి చేశాడు. యువతి తీవ్రంగా ప్రతిఘటించడంతో గాయపర్చి అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 14వ తేదీన కెబిఆర్ పార్క్ వద్ద రెక్కీ నిర్వహించాడు. అదే సమయంలో సినీనటి షాలు చౌరాసియా సాయంత్రం 6.30 సమయంలో కెబిఆర్ పార్క్‌లో వాకింగ్ చేస్తోంది.
ఆమె తన పరిసరాల్లోకి వచ్చే సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో వెనుక నుంచి దాడి చేసి అరవకుండా నోటిని మూసివేశాడు. తర్వాత అరిస్తే రాయితో కొట్టి చంపివేస్తానని బెదిరించి ఆమె వద్ద ఉన్న యాపిల్ ఫోన్‌ను తీసుకున్నాడు. డబ్డులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశాడు, ఆమె వద్ద డబ్బులు లేకపోవడంతో అక్కడి నుంచి మొబైల్ ఫోన్‌తో పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేశారు. స్థానికంగా ఉన్న సిసికెమెరాల్లో ఎక్కడా ఆధారాలు లభించకపోవడంతో మ్యానువల్‌గా దర్యాప్తు ప్రారంభించారు. కేసు దర్యాప్తు కోసం నార్త్, వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పనిచేశారు. ఇద్దరు ఇన్స్‌స్పెక్టర్లు నాగేశ్వరరావు, రాజేష్, పదిమంది ఎస్సైలు, 30మంది పిసిలు నిందితుడి కోసం గాలించారు.
70మంది పాతనేరస్థుల విచారణ….
టెక్నికల్‌గా ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో పోలీసుల విచారణలో జాప్యం జరిగింది. దీంతో ఇలాంటి నేరాలు చేస్తున్న వారిలో బయట ఉన్నవారు, జైలులో ఉన్న వారి వివరాలు తెలుసుకున్నారు. జైలులో ఉన్న వారి పేర్లు విడదీసి, బయట ఉన్న వారు 70మంది పాతనేరస్థులను అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడి సొంత గ్రామానికి వెళ్లి విచారణ చేశారు. ఎట్టకేలకు కొమ్ము రాజును నిందితుడిగా గుర్తించారు.