Friday, January 31, 2025

ఫైనల్లో టీమిండియా

- Advertisement -
- Advertisement -

మలేసియా వేదికగా జరుగుతున్న మహిళల అండర్19 టి20 వరల్డ్‌కప్‌లో భారత్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్లో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆదివారం జరిగే ఫైనల్లో సౌతాఫ్రికాతో టీమిండియా తలపడుతుంది. రెండో సెమీస్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు. భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేక ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 113 పరుగులు మాత్రమే చేసింది.

తర్వాతబ్యాటింగ్‌కు దిగిన భారత్ 15 ఓవర్లలోనే కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు కమిలిని, గొంగడి త్రిష మరోసారి జట్టుకు శుభారంభం అందించారు. ఇద్దరు ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన త్రిష 29 బంతుల్లో ఐదు ఫోర్లతో 35 పరుగులు చేసింది. ఈ క్రమంలో తొలి వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యంలో పాలుపంచుకుంది. ఇక కమిలిని 50 బంతుల్లో 8 ఫోర్లతో 56 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. సానికా చల్కె 11(నాటౌట్) తనవంతు పాత్ర పోషించింది.

పరుణిక జోరు..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు డవినా పెర్రిన్, జెమీమా స్పెన్స్ శుభారంభం అందించారు. అయితే కుదురుగా ఆడుతున్న జెమీమాను పరుణికా సిసోడియా క్లీన్ బౌల్డ్ చేసింది. దీంతో 37 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. వన్‌డౌన్‌లో వచ్చి జాన్సన్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరింది. పరుణిక అద్భుత బంతితో జాన్సన్‌ను క్లీన్‌బౌల్డ్ చేసింది. ఈ క్రమంలో కెప్టెన్ అబి నొర్‌గ్రొవ్‌తో కలిసి ఓపెనర్ పెర్రిన్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచేందుకు ప్రయత్నించింది.

భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న పెర్రిన్ 6 ఫోర్లు, రెండు సిక్సర్లతో 45 పరుగులు చేసి ఆయూషి శుక్లా వేసిన అద్భుత బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యింది. ఆ వెంటనే కెప్టెన్ అబి కూడా పెవిలియన్ చేరింది. ఈ వికెట్ కూడా ఆయూషికే దక్కింది. ఆ తర్వాత ఇంగ్లండ్ మళ్లీ కోలుకోలేక పోయింది. వైష్ణవి శర్మ వెంటవెంటనే వికెట్లను తీసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో ముఖ్య భూమిక పోషించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News