Saturday, November 23, 2024

అప్పులతోనే లోటు భర్తీ

- Advertisement -
- Advertisement -

బడ్జెట్ వెలుపలి రుణాలే అధిక భారం

ఎఫ్‌ఆర్‌బిఎం పరిధిని దాటి అప్పులు చేశారు
కాళేశ్వరం అప్పులు రూ.1,45,545 కోట్లు
2021-22లో ఆర్థ్ధిక నిర్వహణ అధ్వాన్నం
2021-22లో రూ.75,053 కోట్ల అధిక ఖర్చు

2014 నుంచి 2021 వరకూ రూ.2,14,062 కోట్ల అధిక చెల్లింపులు

అధిక చెల్లింపులకు అసెంబ్లీ ఆమోదం లేదు
కాగ్ నివేదిక స్పష్టీకరణ

మన తెలంగాణ/హైదరాబాద్: కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (సిఎజి-కాగ్) రాష్ట్ర ఆర్థిక నిర్వహణపై జరిపిన ఆడిట్‌లో అనేక చేదు నిజాలను బహిర్గతం చేసింది. ప్రతి ఏటా బడ్జెట్‌లో రెవెన్యూ మిగులుగా చూపించారేగానీ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి భారీగా రెవెన్యూలోటు ఏర్పడుతోందని, ఆ రెవెన్యూలోటును పూడ్చుకోవడానికి మళ్ళీ అప్పులు చేసి ఆర్ధిక అవసరాలను తీర్చుకొంటున్నారనే విమర్శలకు కాగ్ నివేదిక మరింత బలాన్ని చేకూర్చింది. 2021-22వ ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభు త్వం ఇలానే అంకెలగారడీ చేసిందని కాగ్ నివేదిక బట్టబయలు చేసిందని కొందరు ఆర్ధికశాఖాధికారులే వ్యాఖ్యానించారు. 2021-22వ ఆర్ధిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక నిర్వహణ అధ్వాన్నంగా ఉందని కాగ్ తన నివేదికలో పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభు త్వం గురువారం అసెంబ్లీలో కాగ్ నివేదికలను సభలో ప్రవేశపెట్టింది. అంతేగాక బడ్జెట్ వెలుపలి రుణాలు అం టే కార్పోరేషన్ల పేరుతో తీసుకొన్న అప్పులు కూడా ప్రభు త్వ ఆర్ధిక వ్యవస్థపై పెనుభారం అయ్యాయని కూడా కాగ్ తన నివేదికలో పేర్కొంది. రాష్ట్రం రెవెన్యూలోటును నమో దు చేసినందున ఆ రెవెన్యూ లోటును మార్కెట్ నుంచి తీసుకున్న రుణాలతోనే భర్తీ చేయాల్సి వచ్చిందని కాగ్ పేర్కొంది. మార్కెట్ రుణాలమీద వడ్డీ, అసలు మొత్తాల కోసం 2032-33వ ఆర్ధిక సంవత్సరం నాటికి రాష్ట్ర ప్రభు త్వం 2,52,,048 కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉం టుందని, ఇది ప్రభుత్వ ఆర్ధికాన్ని గణనీయమైన ఒత్తిడికి గురి చేస్తుందని కాగ్ ఆందోళన వ్యక్తంచేసింది. 2021-22వ ఆర్ధిక సంవత్సరం బడ్జెట్‌లో 1,18,955 కోట్ల రూ పాయల రుణాలను బడ్జెట్‌లో చూపించలేదని, ఇది జిఎస్‌డిపితో పోలిస్తే అప్పుల నిష్పత్తి మీద ఈ రుణాల ప్రభా వం తీవ్రంగా ఉంటుందని కాగ్ పేర్కొంది. బడ్జెట్ వెలుపలి రుణాల్లో అధికభాగం కాళేశ్వరం నీటిపారుదల ప్రాజెక్టు కార్పోరేషన్ లిమిటెడ్ (కెఐపిసిఎల్)కు చెందినవి ఏకంగా 66,854 కోట్ల రూపాయలు ఉన్నాయని కాగ్ పేర్కొంది. ఈ రుణాలను తిరిగి చెల్లించాల్సిన గరిష్ట వ్యవ ధి కూడా 14 సంవత్సరాలు మాత్రమే ఉందని, ఈ గడవు ముగిసేనాటికి కాళేశ్వరం ప్రాజెక్టు అప్పు 1,45,545 కోట్ల రూపాయలకు చేరుతుందని కాగ్ లెక్కగట్టింది. అం తేగాక కాళేశ్వరం సమగ్ర ప్రాజెక్టు నివేదికలో రెవెన్యూ వనరులను పరిగణించక పోవడంవల్ల ఈ భారీ చెల్లింపు బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని కాగ్ పేర్కొంది. దీనివల్ల రాష్ట్ర ఆర్ధికంమీద పెనుభారం పడటమే కాకుండా సమీప భవిష్యత్తులో అభివృద్ధి పనులను చేపట్టడం కూడా సాధ్యంకాకపోవచ్చునని కాంగ్ ఆందోళన వ్యక్తంచేసింది. 2021-22వ సంవత్సరంనాటికి రాష్ట్ర ప్రభుత్వ అప్పులు 3,14,663 కోట్ల రూపాయలు కాగా బడ్జెట్‌కు వెలుపల కార్పోరేషన్ల పేరుతో తీసుకున్న అప్పులు 1,18,955 కోట్ల రూపాయలు ఉన్నాయని కాగ్ తెలిపింది. వెలుపలి రుణాల అసలు మొత్తాలను, వడ్డీలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉందని కాగ్ పేర్కొంది. ప్రభుత్వ అప్పులకు బడ్జెట్ వెలుపలి అప్పులను కూడా కలిపి లెక్కిస్తే జిఎస్‌డిపిలో మొత్తం అప్పుల నిష్పత్తి 37.17 శాతం ఉంటుందని కాగ్ కుండబద్దలు కొట్టింది. ఇది రాష్ట్ర ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం ప్రకారం నిర్దేశించిన 25 శాతం అప్పుల కంటే 12.77 శాతం ఎక్కువగా అప్పులున్నాయని కాగ్ పేర్కొంది.

15వ ఆర్ధిక సఘం నిర్దేశించిన 29.30 శాతం అప్పుల కంటే ఇది 8.47 శాతం ఎక్కువ గా అప్పులు చేసి, అన్ని రకాలుగా లక్ష్మణరేఖలను దాటిపోయి అప్పులు చేశారని కాగ్ పేర్కొంది. విద్య, ఆరోగ్య రంగాలపై తెలంగాణ రాష్ట్రం వెనుకంజలోనే ఉందని, మొత్తం వ్యయంలో విద్యారంగంపై 8శాతం నిధులను ఖర్చు చేయగా, ఆరోగ్యరంగంపై కేవలం నాలుగు శాతం నిధులనే ఖర్చు చేశారని కాగ్ పేర్కొంది. అంతేగాక 2018-19వ సంవత్సరం తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల పంపకాల విషయంలో ఎలాంటి పురోగతి లేదని, విభజన పంపకాల విషయమై రాష్ట్ర ప్రభుత్వం తగినంత దృష్టిని సారించలేదని కాగ్ నిశితంగా విమర్శించింది. బడ్జెట్ నిర్వహణలో కూడా అనేక పొరపాట్లు జరిగాయని కాగ్ నిగ్గు తేల్చింది. ఖజానాకు రాబడికి సంబంధించిన బడ్జెట్ అంచనాలను సమీక్షించిన కాగ్ ఆదాయాన్ని, గ్రాంట్లను విపరీతంగా చూపించినట్లు తేలిందని తన నివేదికలో పేర్కొంది. ఖర్చులకు సంబంధించిన అంచనాలను కూడా ఎక్కువగా కేటాయింపులు చూపించారని, దాని పర్యావసానంగా పలు గ్రాంట్లలో బడ్జెట్‌లో కేటాయించిన మేరకు నిధులు ఖర్చు కాకుండా ఉన్నాయని కాగ్ పేర్కొంది. 2021-22వ ఆర్ధిక సంవత్సరంలో పది గ్రాంట్లు, రెండు అప్రోప్రియేషన్‌ల కింద రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన మొత్తాలకు మించి అదనంగా 75,053 కోట్ల రూపాయలను అధికంగా వ్యయం చేశారని కాగ్ తేల్చింది. అంతేగాక 2014-15వ ఆర్ధిక సంవత్సరం నుంచి 2020-21వ ఆర్ధిక సంవత్సరం వరకూ రికార్డు స్థాయిలో 2,14,062 కోట్ల రూపాయల అధిక చెల్లింపులు చేశారని, ఈ నిధులకు రాష్ట్ర శాసనసభ ఇంకనూ ఆమోదించాల్సి (క్రమబద్దీకరించాలి) ఉందని, ఇలా చేయడం రాజ్యాంలోని 204, 205 అధికరణాలకు పూర్తిగా విరుద్ధమని కూడా కాగ్ తన నివేదికలో పేర్కొం ది. ఇలా చేయడం మూలంగా బడ్జెట్ పరమైన, ఆర్ధిక పరమైన నియంత్రణలను బలహీనపరచడమే కాకుండా ప్రజల సొమ్ము నిర్వహణలో ఆర్ధికపరమైన క్రమశిక్షణారాహిత్యాన్ని ప్రోత్సహించినట్లే అవుతుందని కాగ్ ఆందోళన వ్యక్తంచేసింది. సేవా పింఛన్లలో 5,046 కోట్లు, దళితబంధు పథకంలో 3,442 కోట్ల రూపాయల వరకూ అధికంగా వ్యయం అయ్యాయని కాగ్ పేర్కొంది. రైతు రుణ మాఫీ పథకం కింద 4,462 కోట్ల రూపాయలు, గ్రామీణ పేదలకు రెండు పడక గదుల ఇళ్ళ నిర్మాణాలపైన 4,270 కోట్ల రూపాయల నిధులను తక్కువగా ఖర్చు చేశారని కాగ్ ఆక్షేపించింది. సిఎ దళిత సాధికారత కార్యక్రమం (తెలంగాణ దళితబంధు) పేరిట తొలి బడ్జెట్‌లో 1000 కోట్లను కేటాయించారని, ఆ తర్వాత వినియోగ పద్దుల్లో పేర్కొన్న 4442 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసినప్పటికీ ఆర్ధిక సంవత్సరం ముగిసేనాటికి దళితబంధు పథకంపై వాస్తవంగా చేసిన ఖర్చు 2,101 కోట్లు మాత్రమేనని కాగ్ ఆడిట్‌లో వెల్లడయ్యింది. ఇలా 2021-22వ ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరును, ఆర్ధిక నిర్వహణను కాగ్ తూర్పారబట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News