Saturday, November 16, 2024

సెప్టెంబర్ 1నుంచి డిగ్రీ క్లాసులు

- Advertisement -
- Advertisement -

సెప్టెంబర్ 1 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం
ఆరు వర్సిటీలలో కామన్ విద్యాక్యాలెండర్‌కు ఆమోదం
కామన్ పిజిసెట్ నిర్వహణ బాధ్యతలు ఈసారి కూడా ఒయుకే
పిహెచ్‌డి ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష
వైస్ ఛాన్స్‌లర్ల సమావేశంలో కీలక నిర్ణయాలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని ఆరు యూనివర్సిటీలలో సెప్టెంబర్ 1నుంచి డిగ్రీ మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ టి.పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన వైస్ ఛాన్స్‌లర్ల సమావేశంలో ఆరు యూనివర్సిటీల పరిధిలో అమలు చేయనున్న కామన్ అకడమిక్ క్యాలెండర్‌ను ఆమోదించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్, దోస్త్ కన్వీనర్ ఆర్.లింబాద్రి, కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, వైస్ ఛైర్మన్ వెంకటరమణ, కార్యదర్శి ఎన్.శ్రీనివాస్, ఒయు వైస్ ఛాన్స్‌లర్ డి.రవీందర్, కాకతీయ వర్సిటీ విసి టి.రమేష్, తెలంగాణ వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ రవీందర్, మహాత్మాగాంధీ వర్సిటీ విసి సిహెచ్.గోపాల్‌రెడ్డి, పాలమూరు యూనివర్సిటీ విసి ఎల్‌పి లక్ష్మీకాంత్ రాథోడ్, అంబేద్కర్ వర్సిటీ విసి సీతారామారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో దోస్త్ ప్రవేశాల ప్రక్రియ, అకడమిక్ అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా దోస్త్ షెడ్యూల్‌ను సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. అలాగే ఆరు యూనివర్సిటీలకు కామన్ అల్మనాక్‌కు ఆమోదం తెలిపారు. రెండు సంవత్సరాల వరుసగా జీరో అడ్మిషన్లు నమోదైన కళాశాలలు దోస్త్ తమ వివరాలు పొందుపరచవద్దని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ విద్యాసంవత్సరం పిజి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ పిజిసెట్‌ను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. ఆరు యూనివర్సిటీలలో పిహెచ్‌డిలలో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలని, పరీక్ష తర్వాత పిహెచ్‌డి ప్రవేశాలలో అనుసరించాల్సిన విధానాలను అధ్యయనం చేయడానికి ఒక కమిటీని నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. నాలుగు కళాశాలల్లో బిఎ ఆనర్స్‌ను పైలట్ ప్రాజెక్టుగా తీసుకురావాలని, ఉస్మానియా యూనివర్సిటీ ఈ ప్రోగ్రాంను పర్యవేక్షించి కరికులమ్‌ను డిజైన్ చేసేందుకు చొరవ తీసుకోవాలని నిర్ణయించారు.
క్లస్టర్ విధానంపై చర్చ
రాష్ట్రంలో ప్రభుత్వ కళాశాలల్లో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకునేందుకు క్లస్టర్ విధానం అమలు చేయాలన్న ప్రతిపాదనలపై వైస్ ఛాన్స్‌లర్ల సమావేశంలో చర్చించారు. ఈ విధానంలో కళాశాలల్లో ఉన్న అధ్యాపకుల సేవలను సమీప కళాశాలల్లో అవసరాల మేరకు సద్వినియోగం చేసుకోనున్నారు. కళాశాలల మధ్య సమన్వనం చేసుకుని పరస్పరం సహకరించుకునేలా చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించారు. క్లస్టర్ విధానంపై అధ్యయనం చేయడానికి కమిటీని నియమించాలని నిర్ణయించారు.

డిగ్రీ కోర్సులకు విద్యా కాల పట్టిక

మొదటి సెమిస్టర్ షెడ్యూల్

2021, సెప్టెంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభం
2021, అక్టోబర్ 9 నుంచి 17 వరకు షార్ట్ వెకేషన్
2021, అక్టోబర్ 18 నుంచి వెకేషన్ తర్వాత పునఃప్రారంభం
2021, నవంబర్ 10 నుంచి 12 వరకు మొదటి ఇంటర్నల్ పరీక్షలు
2021, డిసెంబర్ 21 నుంచి 23 వరకు రెండవ ఇంటర్నల్ పరీక్షలు
2022, జనవరి 12 తరగతులకు చివరి రోజు
2022, జనవరి 13 నుంచి 23 వరకు ప్రిపరేషన్ సెలవులు, ప్రాక్టికల్ పరీక్షలు
2020, జనవరి 24 నుంచి ఫిబ్రవరి 16 వరకు మొదటి సెమిస్టర్ పరీక్షలు

రెండవ సెమిస్టర్ షెడ్యూల్

2022, ఫిబ్రవరి 17 నుంచి తరగతులు ప్రారంభం
2022, ఏప్రిల్ 6 నుంచి 8వరకు మొదటి ఇంటర్నల్ పరీక్షలు
2022,మే 11 నుంచి 12 వరకు రెండవ ఇంటర్నల్ పరీక్షలు
2022, జూన్ 8 తరగతులకు చివరి రోజు
2022, జూన్ 9 నుంచి 16 వరకు ప్రిపరేషన్ సెలవులు, ప్రాక్టికల్ పరీక్షలు
2022, జూన్ 17 నుంచి జులై 8 వరకు రెండవ సెమిస్టర్ పరీక్షలు

Degree classes to start from Sep 1 in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News