Monday, January 20, 2025

డిగ్రీ గెస్ట్ అధ్యాపకుల భవిష్యత్తు భద్రమేనా?

- Advertisement -
- Advertisement -

2012 వ సంవత్సరం లో మొదలైన గెస్ట్ లెక్చరర్ల వ్యవస్థలో ప్రస్తుతం రాష్ట్రంలో 145 డిగ్రీ కళాశాలలో ఆర్థిక శాఖ అనుమతి పొందిన 1940 శాంక్షన్ పోస్టుల్లో 1600 మంది గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. వీరిలో డాక్టరేట్ పట్టాలు, నెట్, సెట్ లాంటి ఉన్నత విద్య అర్హతలు కలిగి ఉన్నారు. ప్రస్తుతం 6 ప్రభుత్వ యూనివర్శిటీల పరిధిలో ప్రభుత్వ, ఎయిడ్, అన్‌ఎయిడ్ 226 డిగ్రీ కాలేజీలలో 200 కోర్సుల్లో ప్రతి సంవత్సరం 1,27,000 మందికి పైగా విద్యార్థులు అభ్యసిస్తున్నారు. 10 సంవత్సరాల నుండి డిగ్రీ కళాశాలలో రెగ్యులర్ నోటిఫికేషన్ ద్వారా లెక్చరర్ల పోస్టుల భర్తీ చేయని కారణం ఒకటైతే, ఇంటర్ కాలేజీలలో నుండి ప్రమోషన్లు పొంది డిగ్రీ కాలేజీలకు రాకపోవడం వల్ల ప్రభుత్వం గత 12 సంవత్సరాల నుండి గెస్ట్ లెక్చరర్ల సేవలను వినియోగించుకుంటూ రాష్ట్రంలో అన్ని డిగ్రీ కళాశాలలో 60 70% వరకు గెస్ట్ లెక్చరర్లతోనే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు నడుస్తున్నాయి.

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే 25 కళాశాలలో 300 పైగా గెస్ట్ లెక్చరర్లు పని చేస్తున్నారంటే డిగ్రీ విద్య వ్యవస్థను పటిష్టం చేయడంలో గెస్ట్ లెక్చరర్ల అవసరం ఎంత ఉందో తెలుస్తుంది. ఇలాగే ప్రతి కళాశాలలో 10 నుండి 30కి పైగానే గెస్ట్ లెక్చరర్లతోనే డిగ్రీ కళాశాలలు నడుస్తున్నాయి. డిగ్రీ కళాశాలలో ప్రస్తుతం రెగ్యులర్ టీచింగ్ స్టాఫ్ కేవలం 1400 (కాంట్రాక్ట్ నుండి రెగ్యులర్ అయిన వారిని కలుపుకొని) మంది మాత్రమే. కాంట్రాక్టు లెక్చరర్లు 500 మంది, గెస్ట్ లెక్చరర్లు 1600 మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కాంట్రాక్టు వ్యవస్థలో కొనసాగిన డిగ్రీ లెక్చరర్లను గత ప్రభుత్వం రెగ్యులర్ చేయడం జరిగింది. కానీ గెస్ట్ ఫ్యాకల్టీలో పది సంవత్సరాల పైబడి పని చేస్తున్న వారిని, అన్ని విద్యార్హతలు కలిగి ఉన్న మాకు కాంట్రాక్టు పద్ధతిలో మార్చరు, 12 నెలలకు జీతాలు ఇవ్వరు, సర్వీస్ ని కంటిన్యూ చేయరు. ఒకే రాష్ట్రంలో, ఒకే వ్యవస్థలో పని చేస్తున్న వారిని రెండు విధాలుగా చూడడం ఎంతవరకు న్యాయం.

ప్రస్తుతం 10, 5, 2, 3 సంవత్సరాల నుండి డిగ్రీ కళాశాలలో పని చేస్తున్న వారు కూడా ప్రతి సంవత్సరం ఉన్నత విద్య కమిషనరేట్ జారీ చేసే నోటిఫికేషన్ ద్వారా, త్రీ మెన్ కమిటీతో ప్రతి సంవత్సరం డెమో ఇచ్చుకుంటూ ఎంపిక కాబడిన వారు కూడా వచ్చే అకాడమిక్ ఇయర్‌లో మళ్లీ డెమో అనే నియమంతో మళ్లీ కొత్తగా జాయిన్ కావలసిన వింత పరిస్థితి. తెలంగాణలోని రెసిడెన్షియల్ కాలేజీలలో పని చేస్తున్న అతిథి అధ్యాపకులు ఒక్కసారి డెమో చెప్పి కన్సాలిడేటెడ్ పే తో కంటిన్యూవేషన్‌గా కొనసాగుతారు. ఇంటర్, కెజిబివి ఇంటర్ కాలేజీల విద్యా వ్యవస్థలో కూడా ఇదే పద్ధతిని కొనసాగిస్తున్నారు. కానీ కేవలం డిగ్రీ కళాశాలలో పని చేస్తున్న అతిథి అధ్యాపకులు మాత్రం భయం భయంతో, తీవ్ర ఆందోళన మధ్య, ప్రిన్సిపల్స్ మెప్పుకోసం ఉపగ్రహాలుగా తిరుగుతూ, కాలేజీలో ఉన్న మిగతా రెగ్యులర్, కాంట్రాక్టు, నాన్‌టీచింగ్ వారితో అన్యోన్యంగా ఉంటూ వారి పనులు చేస్తూ, వింటూ, ప్రసన్నం చేసుకుంటూ అడ్మిషన్లు మొదలైనప్పుడు కాన్వాసింగ్ చేసుకుంటూ, విద్యార్థుల పాస్ పర్సంటేజీ పడిపోకుండా చూసుకుంటూ,

కాలేజీలో పోటీపడి విద్యాబోధన చేస్తూ గాడిద కష్టం చేసిన ఆరు, ఏడు నెలల కాలానికి వచ్చే జీతం కోసం అందర్నీ మెప్పించి, ఒప్పించిన చివరికి ప్రతి సంవత్సరం ఆట మొదటి నుండి ఆడాలనే నియమం వల్ల మానసిక ఒత్తిడి, క్షోభ, వేదనతో పాటు రెగ్యులర్, కాంట్రాక్టు ఉద్యోగుల మధ్య అనునిత్యం రెగ్యులర్, కాంట్రాక్ట్ ఉద్యోగులతో సమానం కాదనే భావనతో వివక్షకు గురవుతూ బానిసలుగా బతుకవలసిన వ్యవస్థ డిగ్రీ కాలేజీలో పని చేస్తున్న ప్రతి లెక్చరర్ అనుభవిస్తున్న వింత జీవితం భరించరానిది. ప్రతి సంవత్సరం లెక్చరర్లను పూర్తి విద్యా సంవత్సర కాలానికి నియమించుకొని యూనివర్శిటీల అల్మానక్, సెమిస్టర్ విధానం అమలు వల్ల రెండు సెమిస్టర్లు కలిపి 180- 200 రోజులకి మాత్రమే వేతనం ఇవ్వడంతో, ఆరు, ఏడు నెలలకే వేతనం పొందడం. ఉదా॥ అక్టోబర్ నెలలో దసరా సెలవులు, విద్యార్థులకు పరీక్షల కారణంగా డిసెంబర్‌లో, జనవరిలో సంక్రాంతి సెలవుల కారణంగా మొత్తం రెండు నెలలకు ఒక్క రూపాయి కూడా వేతనం పొందని గెస్ట్ అధ్యాపకుల కుటుంబాలను అరకొర జీతాలతో నెట్టుకు రావడం భారంగా మారింది.

కుటుంబ పోషణ, నెలనెల సరుకులు, రవాణా చార్జీలు, పండుగలు, ఇన్సూరెన్స్ ఇతర ఖర్చులు గెస్ట్ లెక్చరర్ల పిల్లలను ఒక మంచి స్కూలు, కాలేజీలో చదివించుకోలేని దౌర్భాగ్యస్థితి, ఇదే గెస్ట్ట్ వ్యవస్థలో పని చేస్తూ సంవత్సరానికి రెండు లక్షల వేతనంతో 30 సంవత్సరాలు సర్వీస్ చేసినా సొంత ఇల్లు కట్టుకోలేని విచిత్ర పరిస్థితి. మహిళలకు ప్రసూతి, చైల్డ్ కేర్ సెలవులు, అలాగే గెస్ట్ లెక్చలర్లు ఏదన్న ఆపద వచ్చిన, ప్రమాదాలు జరిగిన ఆ రోజుల్లో కాలేజీకి రాకపోతే వేతనం రాదు. పెళ్లి కానీ యువ అతిథి అధ్యాపకులకు భద్రత లేని, ఎప్పుడు ఊడగోడతారో తెలియని కారణంగా పెళ్లి సంబంధాలు రావడం లేదు అనే ఆవేదనతో పాటు మానసిక సంఘర్షణకు గురి అవుతున్నారు. ఇలాంటి వింత విషయం ఎక్కడా విని ఉండరు ఎందుకంటే, సెలవులు వస్తే విద్యార్థులకు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఆనందం కానీ అతిథి అధ్యాపకులకు సెలవులు వస్తే భయం, ఆందోళన ఎందుకంటే? ప్రభుత్వ సెలవులు ఇచ్చినా, లోకల్ హాలిడే, ఆప్షనల్ సెలవులు తీసుకున్నా, చివరికి విద్యార్థులకు పరీక్షలు జరిగినా ఆ రోజులకు గెస్ట్ లెక్చరర్లు వేతనం పొందే అవకాశం ఉండదు. పాఠం బోధిస్తేనే ఆ రోజుకు వేతనం. ఈ వ్యవస్థ ఏవిధంగా ఉందంటే భారత దేశంలో గ్రామీణ ప్రాంతాలలో పేదలకు 100 రోజుల ఉపాధి హామీ పని పథకం లాగా ఉన్నది.

పేదలకు 100 రోజుల పని దొరికితే, ఉన్నత విద్యావంతులైన, భావి భారత పౌరులను తయారు చేసే, దేశ దశ దిశను, విద్యార్థులను ఉన్నత స్థానాలలో, అధికారులుగా నిలిపే గురువులకు మాత్రం 200 రోజుల పని దొరుకుతుంది. అతిథి అధ్యాపకులకు ఉద్యోగ భద్రత లేని కారణంగా గెస్ట్ లెక్చరర్లు చనిపోయినా, ఏదన్న ప్రమాదాలు జరిగినా సర్వం కోల్పోవాల్సిందే గాని ప్రభుత్వం నుండి ఎలాంటి ఆర్థిక సహాయం అందదు. అలాగే వారి కుటుంబాలకు భవిష్యత్తులో భద్రత, పెన్షన్లు కూడా ఉండ వు. అతిథి అధ్యాపకులు రోజు కూలీల కన్నా అధ్వానమైన పరిస్థితుల్లో వున్నారు. ప్రస్తుతమున్న ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి పని చేస్తున్న 1600 మంది అతిథి అధ్యాపకుల ప్రధాన డిమాండ్లు: ప్రస్తుతం పని చేస్తున్న గెస్ట్ లెక్చరర్లను ఆటో రెన్యూవల్ చేసి సర్వీసును కంటిన్యూ చేయాలి. 2 నెలలకు యుజిసి నిబంధనల ప్రకారం పీరియడ్ విధానాన్ని రద్దు చేసి ప్రతి నెలకు రూ. 50 వేల ఏకీకృత వేతనాలు చెల్లించాలి. డెమో తీసుకొని పునర్నియమించే విధానానికి స్వస్తి పలికి ఉద్యోగ భద్రత కల్పించి మినిమం టైం స్కేల్ ఉద్యోగులుగా గుర్తించాలి. ప్రమాద బీమా సౌకర్యం కల్పించి తగు న్యాయం చేయాలి. మూడు సంవత్సరాల పైబడి బోధన చేస్తున్న లెక్చరర్లందరికీ ఈక్వాలేంట్ సెట్ సర్టిఫికెట్‌ను కమిషనర్‌చే జారీ చేయాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News