Wednesday, January 22, 2025

సాగునీటి పనులకు అటవీ అనుమతుల జాప్యం తగదు

- Advertisement -
- Advertisement -

అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

Delay in issuance of forest permits for irrigation works

 

మనతెలంగాణ/ హైద్రాబాద్ : సదర్మట్ బ్యారేజ్ గేట్ల బిగింపు పనులు త్వరగా పూర్తి చేసి వర్షకాలంలోగా ఆయకట్టుకు సాగునీరు అందించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మంగళవారం నీటిపారుదల, అటవీ శాఖ ఉన్నతాధికారులతో అరణ్యభవన్‌లో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. బ్యారేజ్ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనుమతుల విషయంలో అటవీ శాఖ నిర్లక్ష్యంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. సదర్మాట్ బ్యారేజ్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, 55 గేట్లను బిగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని నీటిపారుదల శాఖ అధికారులు వివరించారు.

ప్యాకేజీ 27 యూనిట్ -3 పనులను జూన్‌లోగా పూర్తి చేసి చెరువులను నింపి ఖరీఫ్‌లో 1500 ఎకరాలకు, వివిధ డైరెక్టరీ తూముల ద్వారా 600 ఎకరాలకు సాగనీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. డిసెంబర్ నాటికి 18 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్నారు. నిర్మల్ రూరల్ మండలం మేడిపల్లి నుంచి మామడ మండలం దిమ్మదుర్తి వరకు 19 కిలోమీటర్ల మేర కెనాల్ తవ్వకం పనులను ఆగస్టులోగా పూర్తి చేసి చేయాలని గడువు విధించారు. భూసేకరణలో జాప్యం, కాంట్రాక్ట్ ఏజెన్సీ అలసత్వంతో ప్యాకేజీ 28 పనులలో పురోగతి లేదని మంత్రి తెలుపగా… ఇప్పుడున్న ఏజెన్సీ కాంట్రాక్ట్ ను రద్దు చేస్తూ.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని అధికారులు వెల్లడించారు.

ప్రభుత్వ ఆమోదం పొందిన వెంటనే వేరే టెండర్లు పిలిచి కొత్త ఏజెన్సీకి పనులు అప్పగించాలని మంత్రి ఆదేశించారు. నిర్మల్ నియోజవర్గంలో రూ.89 కోట్లతో నిర్మించనున్న 15 చెక్ డ్యాంల నిర్మాణానికి త్వరగా టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, పిసిసిఎఫ్ ఆర్.ఎం. డొబ్రియల్, నీటిపారుదల శాఖ ఇఎన్‌సి మురళీధర్ రావు, సిఎఫ్ వినోద్‌కుమార్, నీటిపారుదల శాఖ సిఈ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఈ సుశీల్ కుమార్, ఈఈ రామారావు, సుశీల్ ఇన్ ఫ్రా, మేఘా, బృంద, రాఘవ ఎజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News