Thursday, January 23, 2025

జడ్జీల నియామకంలో జాప్యమేల?

- Advertisement -
- Advertisement -

దేశంలో జడ్జీల కొరత తీవ్రంగా వుంది. కేసుల పరిష్కారానికి ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నాయి. ఇటీవల పార్లమెంటులో కూడా జడ్జీల కొరత గురించి చర్చ జరిగింది. దేశంలోని కోర్టుల్లో సుమారు ఐదు కోట్ల కంటే ఎక్కువ కేసులు పెండింగ్‌లో వున్నాయని న్యాయశాఖ మంత్రి ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు. ప్రస్తుతం హైకోర్టులో 31% జడ్జీల కొరత వుంటే, జిల్లా కోర్టుల్లో 21% జడ్జీల కొరత వుందని ఇటీవలే సుప్రీంకోర్టు ఒక నివేదికలో వెల్లడించింది. సుప్రీంకోర్టుకు చెందిన సెంటర్ ఫర్ రీసెర్చి అండ్ ప్లానింగ్ అట్టడుగు వర్గాల వారికి ప్రాతినిధ్యం కల్పించాలని సిఫారసు చేసింది. అయితే 2018లో హైకోర్టులకు 650 మంది జడ్జీలను నియమిస్తే 492 మంది జనరల్ కేటగిరిలో నియమించారని నివేదికలో పేర్కొంది. సుప్రీంకోర్టు ఇటీవల స్టేట్ ఆఫ్ ది జ్యూడిషరీ పేరుతో ఒక నివేదిక విడుదల చేసింది. మౌలిక సదుపాయాలు, బడ్జెటింగ్, మానవ వనరులు ఐసిటి అంశాలను స్పృశించింది. ఈ నివేదికను సుప్రీం కోర్టు వెబ్‌సైట్ ఈ నెల 15న అప్‌లోడ్ చేశారు.

కాగా న్యాయవ్యవస్థలో అట్టడుగు వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేలా అధ్యయనం చేస్తారని కూడా నివేదికలో వివరించింది. రాజ్యాంగంలోని అధికరణలు 15, 16లో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రభుత్వ సర్వీసుల్లో కొన్ని వర్గాలకు రిజర్వు చేయాలనే నిబంధన వుంది. ఉదాహరణకు షెడ్యూల్డ్ కాస్ట్ (ఎస్‌సి), షెడ్యూల్డ్ ట్రైబ్ (ఎస్‌టి), ఇతర వెనుకబడిన వర్గాలు (ఒబిసి)లకు, ఆర్థికంగా బలహీన వర్గాలకు (ఇడబ్ల్యుఎస్)లకు రిజర్వేషన్ కల్పించాలని రాజ్యాంగంలో ఖచ్చితమైన నిబంధన వుంది. ఇక జిల్లా స్థాయిలో జడ్జీల రిక్రూట్‌మెంట్‌లలో కూడా పైన తెలిపిన వర్గాల వారికి రిజర్వేషన్ కల్పించాల్సి వుంటుందని తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.ఇదే నివేదికలో సివిల్ జడ్జీల రిక్రూట్‌మెంట్‌ల విషయానికి వస్తే (జూనియర్ డివిజన్) రిజర్వుడ్ కేటగిరిలో ఆరు రాష్ట్రాలను తీసుకుంటే బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో పెద్ద రిక్రూట్‌మెంట్లు జరగలేదు. ఈ రాష్ట్రాల్లో అట్టడుగు వర్గాలకు చెందిన జడ్జీల ఖాళీలు అలాగే వున్నాయి. పెద్ద సంఖ్యలో జడ్జీలను నియమించాల్సి ఉంది. తాజాగా విడుదల చేసిన ఐసిటి నివేదికలో పైన తెలిపిన ఆరు రాష్ట్రాల్లో సుమారు 1,389 సివిల్ జడ్జీలు (జూనియన్ డివిజన్) సీట్లు ఖాళీగా వున్నాయని ప్రకటనలు కూడా ఇచ్చారు.

దీనికి పరీక్షలు నిర్వహిస్తామని పత్రికా ప్రకటన ఇచ్చారు. వాటిలో 766 పోస్టులు రిజర్వు కేటగిరికి చెందినవి. వాటిలో ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి, ఇడబ్ల్యుసితో పాటు ఇతర కేటగిరిలకు సంబంధించినవి వున్నాయి. అయితే ఒక్కో రాష్ట్రంలో రిజర్వేషన్లు ఒక్కో విధంగా వుంటాయి. అయితే ఇప్పటి రిజర్వుడ్ కేటగిరి విషయానికి వస్తే సుమారు 37.5 % సీట్లను ఇవే ఆరు రాష్ట్రాల్లో ఇప్పటికీ భర్తీ చేయనేలేదు. ఈ లెక్కన చూస్తే మొత్తం ఖాళీల విషయానికి వస్తే 66.3 శాతానికి చేరుకుంటాయి. చివరిగా సివిల్ జడ్జీలు అంటే జూనియర్ డివిజన్‌లో రిక్రూట్‌మెంట్ పరీక్ష తర్వాత ఈ ఖాళీలను పూరించలేదని నివేదకలో వివరించింది.పైన తెలిపిన ఆరు రాష్ట్రాల్లో ఎస్‌టి కేటగిరి కోసం రిజర్వు చేసిన 168 సీట్లకుగాను 142 సీట్లను ఇప్పటికీ భర్తీ చేయలేదు. అంటే 84.5% సీట్లు ఇప్పటికీ ఖాళీగానే వున్నాయి. దేశంలో పలు రాష్ట్రాల్లో గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్న కేసులు సత్వరం పరిష్కారానికి పెద్ద ఎత్తున జడ్జీలను నియమించాల్సి వుంటుంది. ముఖ్యంగా రిజర్వు కేటగిరిలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని నివేదికలో సూచించింది.

ఇక దేశ వ్యాప్తంగా చూస్తే 5,300 జడ్జీల కొరత ఉంది. ఇదే నివేదికలో హ్యూమన్ రీ సోర్సెస్ మేనేజ్‌మెంట్ దేశంలోని కోర్టుల్లో జడ్జీల కొరత తీవ్రంగా వుందని వెల్లడించింది. దేశ జనాభా విషయానికి వస్తే సుమారు 140.76 కోట్లు కాగా.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 5.05 కోట్ల కేసులు పెండింగ్‌లో వున్నాయి. ఈ కేసులను పరిష్కరించడానికి దేశంలోని అన్నీ స్థాయిలో 20,850 మంది జడ్జీలున్నారు. కాగా ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీ నాటికి చూస్తే దేశంలోని హైకోర్టుల్లో 347 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే 31% జడ్జీ పోస్టులు ఖాళీగా వున్నట్లు లెక్క. కాగా మొత్తం జడ్జీల కేటాయింపు విషయానికి వస్తే 1,114 మంది. కాగా వాటిలో మూడో వంతు జడ్జీలు తక్కువగా వున్నారని నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నాటికి చూస్తే జిల్లా స్థాయిలో జడ్జీల సంఖ్య 25,081 మంది వుండాలి.కాగా ప్రస్తుతం జిల్లా స్థాయిలో వున్న జడ్జీల సంఖ్య 19,781గా తేలింది. ఈ లెక్కన చూస్తే 5,300 మంది జడ్జీల కొరత వుంది. ఈ లెక్కన చూస్తే 21% మంది జడ్జీలు కొరత వున్నట్లు లెక్క. ఇక మహిళా జడ్జీల విషయానికి వస్తే పరిస్థితి ఏమంత సానుకూలంగా లేదు. జిల్లా స్థాయిలో మహిళా జడ్జీలు 36.3% ఉండాలి.అయితే ఎక్కడా మహిళా జడ్జీల ప్రాతినిధ్యం మాత్రం కనిపించడం లేదు.

అది సుప్రీం కోర్టు అయినా లేదా హైకోర్టుల్లో అయినా వారి ప్రాతినిధ్యం అంతంత మాత్రంగానే వుందని నివేదికలో వివరించింది. ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీ నాటికి సుప్రీం కోర్టులో కేవలం ముగ్గురు మాత్రమే మహిళా జడ్జీలు వున్నారు. వాస్తవానికి మహిళా జడ్జీల సంఖ్య 32 వుండాలి. ఇక దేశంలోని హైకోర్టుల విషయానికి వస్తే దేశ వ్యాప్తంగా 767 పర్మినెంట్, అదనపు జడ్జీలు వుండాలి. అయితే ప్రస్తుతం కేవలం 103 మంది మహిళా జడ్జీలు మాత్రమే వున్నారు. అంటే దేశ వ్యాప్తంగా వాస్తవంగా వుండాల్సిన సంఖ్య కంటే 13.42% మంది మాత్రమే పని చేస్తున్నట్లు భావించాల్సి వుంటుంది.
జిల్లాలో జ్యుడిషియల్ ఆఫీసర్ల నియామకాల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది. ఆయా రాష్ట్రాల హైకోర్టులే దీనికి బాధ్యత వహించాలి. దేశంలోని పలు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్, బీహార్, చత్తీస్‌గఢ్, కర్నాటక, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లలో మాత్రం జ్యుడిషియల్ పరీక్షల్లో మహిళలకు రిజర్వేషన్లు వున్నాయి. దీంతో పాటు ప్రమోషన్లలో కూడా మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తున్నాయి. అయితే కాస్తా ఊరట కలిగించే అంశం ఏమిటంటే ఇటీవల కాలంలో జ్యుడిషియల్ వ్యవస్థలో మహిళా జడ్జీల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుండడం శుభ పరిణామమే అని చెప్పుకోవచ్చు.

దేశంలోని 16 రాష్ట్రాల్లో సివిల్ జడ్జీల (జూనియర్ డివిజన్) రిక్రూట్ పరీక్షల చివరి ఫలితాలను బట్టి చూస్తే తెలుస్తోంది. ఈ పరీక్షా ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటే జూనియర్ డివిజన్ సివిల్ జడ్జీల్లో 14 మంది మహిళా జడ్జీలను ఎంపిక చేశారు. అంటే 50% మంది జడ్జీలను ఎంపిక చేసినట్లు ఆ నివేదిక వివరించింది.ఇవన్నీ ఒక ఎత్తయితే దేశంలోని జ్యుడిషియరీ రంగంలో మౌలిక వసతుల కొరత వేధిస్తోంది. జిల్లా స్థాయిలో 25,081 మంది జడ్జీల నియామకాలకు అనుమతి లభిస్తే దేశ వ్యాప్తంగా 4,250 కోర్టుల రూముల కొరత వుంది. అలాగే జడ్జీలకు కావాల్సిన రెసిడెన్సియల్ యూనిట్లు నివాస గృహాల కొరత 6,021 వరకు వుందని నివేదికలో తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నాటికి చూసుకుంటే గత మూడు సంవత్సరాల నుంచి కోర్టు రూముల నిర్మాణం కొనసాగుతూనే వుంది. ఈ లెక్కన చూస్తే 42.9% కోర్టు రూములు నిర్మాణ దశలో వున్నట్లు లెక్క. ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే జిల్లా స్థాయిలో కోర్టు రూములు పుష్కలంగా వున్నాయి.

అలాగే జడ్జీలకు ఇళ్ల కొరత కూడా పెద్దగా లేదని చెప్పుకోవచ్చు. అలాగే జమ్మూకశ్మీర్, లడఖ్, త్రిపురలో కూడా గరిష్ఠంగా కోర్టు రూములున్నాయి. జడ్జీలకు కూడా కావాల్సినంత ఇల్లు అందుబాటులో వున్నాయని నివేదికలో వివరించింది. మొత్తానికి చూస్తే తాజా నివేదికలో దేశంలో జడ్జీల నియామకాల్లో రిజర్వేషన్లు అమలు చేయడం లేదని ప్రముఖంగా ప్రస్తావించింది. ఇప్పటికైనా ఎస్‌సి, ఎస్‌టిలకు, వెనుకబడిన వర్గాలకు జడ్జీలుగా అవకాశం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే వుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News