ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ : పాస్‌పోర్టులో తండ్రి పేరుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. కొడుకు పుట్టక ముందే విడిచిపెట్టి వెళ్లి పోయిన తండ్రి పేరును పాస్‌పోర్ట్‌లో చేర్చాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే ప్రత్యేక పరిస్థితుల్లో తండ్రి పేరును తొలగించడంతోపాటుగా ఇంటి పేరును కూడా మార్చుకోవచ్చని కోర్టు పేర్కొంది. తన కుమారుడి పాస్‌పోర్టు విషయమై ఓ ఒంటరి తల్లి వేసిన పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆమె మైనర్ కుమారుడి పాస్‌పోర్టులో వెంటనే తండ్రి పేరును తొలగించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
పాస్‌పోర్టు మాన్యువల్ 2020 దీనికి సంబంధించిన పలు షరతులను స్పష్టంగా పేర్కొన్నందున మైనర్ బాలుడి పాస్‌పోర్టులో అతడి తండ్రి పేరును ఉంచాల్సిన అవసరం లేదంటూ జస్టిస్ ప్రతిభా ఎం సింగ్ తీర్పు ఇచ్చారు. ఓ తల్లి, ఆమె కొడుకు తండ్రి నుంచి విడిపోయి జీవిస్తున్నారు. అయితే భర్త తోడు లేకుండా ఒంటరిగా బిడ్డను పెంచిన ఓ మహిళ తన మైనర్ కుమారుడి పాస్‌పోర్టు విషయంలో కోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలో తన బిడ్డ కడుపులో ఉండగానే తన భర్త ఆమెను వదిలి వెళ్లి పోయాడని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దాంతో తాను ఒంటరి గానే తన బిడ్డ బాధ్యతలన్నీ పూర్తిగా తానే చూసుకున్నానని, అందువల్ల తండ్రి పేరు లేకుండా కొత్త పాస్‌పోర్టు జారీ చేయాలని ఆమె ధర్మాసనాన్ని కోరారు.
దీనిపై న్యాయమూర్తి జస్టిస్ ప్రతిభా ఎంసింగ్ తీర్పు వెలువరించారు. తండ్రి బిడ్డను పూర్తిగా వదిలిపెట్టిన కేసు ఇది.మైనర్ కుమారుడి పాస్‌పోర్టు నుంచి తండ్రి పేరును తొలగించి కొత్తది జారీ చేయాలని అధికారులను ఆదేశిస్తున్నాం. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో తండ్రి పేరును తొలగించడంతోపాటు ఇంటిపేరును కూడా మార్చుకునే వెసులుబాటు ఉందిఅంటూ తీర్పును వెలువరించారు. ఈ తీర్పుపై తల్లీకొడుకులిద్దరూ సంతోషం వ్యక్తం చేశారు.