అన్నింటిలోనూ టిజిగా నమోదు
కేంద్రం నుంచి గెజిట్ విడుదల కావడంతో
వచ్చేనెల 02వ తేదీ నాటికి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ
టిజిని అమలు చేసేలా అధికారుల సన్నహాలు
ఆ దిశగా చర్యలు
మనతెలంగాణ/హైదరాబాద్: కేంద్రం నుంచి గెజిట్ విడుదల కావడంతో టిజి నెంబర్ ప్లేట్‌తో వాహనాల రిజిస్ట్రేషన్ ప్రారంభం కాగా, టిఎస్ ఆర్టీసి కాస్త టిజిఎస్ ఆర్టీసిగా మారిపోయింది. ఇందుకు సంబంధించిన లోగోను కూడా మార్చే పనిలో ఆర్టీసీ అధికారులు నిమగ్నమయ్యారు. వీటితో పాటు టిఎస్పీఎస్సీ వెబ్‌సైట్ కూడా ఇప్పుడు టిజిపిఎస్సీగా మార్చేశారు. టిఎస్ అనే పదం ఉన్న కార్పొరేషన్ బోర్డులు, వెబ్‌సైట్‌ల నుంచి తొలగిపోతోంది. తెలంగాణ స్టేట్ ఫారెస్టు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టిఎస్‌ఎఫ్డీసీ) పేరును కాస్త టిజిఎఫ్‌డిసిగా అధికారులు మార్పులు చేశారు. తెలంగాణ స్టేట్ మార్క్‌ఫెడ్‌ను తెలంగాణ మార్క్ ఫెడ్‌గా ప్రస్తుతం మారింది. టిఎస్ రెడ్ కో కాస్త టిజిరెడ్ కోగా చేంజ్ అయ్యింది.
తెలంగాణ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి స్టేట్ అనే పదం తొలగించారు. దీనిని తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్‌గా మార్చారు. దీంతోపాటు పలు వెబ్ సైట్లలోనూ మార్పులు చేస్తున్నారు. టిఎస్‌ఎండిసి, తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ పేర్లను మార్చాల్సి ఉంది. తెలంగాణ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్, తెలంగాణ స్టేట్ పోలీస్ డిపార్ట్ మెంట్ నుంచి స్టేట్ అనే పదాన్ని తొలగించాల్సి ఉంది. ఇప్పటికే చాలా శాఖల్లో స్టేట్ అనే పదం దాదాపుగా డిలీట్ అయ్యింది. జూన్ 2వ తేదీ నాటికి పూర్తిగా అన్ని వెబ్‌సైట్‌లకు కొత్తరూపు ఇస్తామని అధికారులు పేర్కొంటున్నారు.