Tuesday, January 21, 2025

ఢిల్లీ పరిపాలన సేవల నియంత్రణ బిల్లును ప్రవేశ పెట్టిన కేంద్రం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో రూపొందించిన “ది గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెర్రిటొరీ ఆఫ్ ఢిల్లీ 2023” బిల్లును కేంద్రం లోక్‌సభలో మంగళవారం ప్రవేశ పెట్టింది. ఓ వైపు మణిపూర్ అంశంలో ఉభయ సభల్లోనూ ప్రతిష్టంభన పరిస్థితులు కొనసాగుతుండగా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా బిల్లును సభలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీకి సంబంధించిన ఏ చట్టానైనా రూపొందించే అధికారాన్ని లోక్‌సభకు రాజ్యాంగం కల్పించిందని, అంతేకాకుండా చట్టాన్ని తీసుకువచ్చే అధికారం కేంద్రానికి ఉందని సుప్రీం కోర్టు కూడా గతంలో స్పష్టం చేసిందని చెప్పారు.

కేవలం రాజకీయ దురుద్దేశం తోనే ఢిల్లీ ప్రభుత్వం బిల్లును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని , ఈ బిల్లును తీసుకొచ్చేందుకు అనుమతించాలని స్పీకర్‌ను కోరారు. దీనిపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ బిల్లును తీసుకురావడాన్ని సమాఖ్య విధానంపై దాడిగా కాంగ్రెస్ పేర్కొంది. ఢిల్లీ సర్వీసెస్ బిల్లు అప్రజాస్వామికమని, సమాఖ్య విధానానికి విరుద్ధమని, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ ఎంపీ కేసీ వేణుగోపాల్ విమర్శించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని, సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరించి ఈ బిల్లును తీసుకొచ్చారని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. దేశంలో సమాఖ్య విధానంపై దాడి ఆమోదయోగ్యం కాదని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ ) ఎంపీ మనోజ్ ఝా మండి పడ్డారు. ఇవాళ ఈ ఢిల్లీపై దాడి జరుగుతోందని, రేపు ఏ రాష్ట్రంలోనైనా జరగొచ్చని ఆయన వ్యాఖ్యానించారు. దేశ రాజధాని లోని పరిపాలన సేవలపై నియంత్రణను లెఫ్టినెంట్ గవర్నర్‌కి అప్పగించేలా కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పటి నుంచి ఢిల్లీ ప్రభుత్వం దానిని తీవ్రంగా వ్యతిరేకిసూ ్తనే ఉంది.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విపక్షాలను కూడగట్టే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు అతడికి మద్దతు తెలిపాయి. ఢిల్లీ పరిపాలన సేవల బిల్లు లోక్‌సభకు చేరిన నేపథ్యంలో ఏం జరుగుతోందో చూడాలి. ఢిల్లీలో గ్రూపు ఎ అధికారుల బదిలీలు, నియామకాలు, క్రమశిక్షణ చర్యలకు గాను నేషనల్ కేపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీ ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రతిపాదిస్తోంది. ఆప్ సర్కారు సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, బదిలీలపై నియంత్రణాధికారం ఆ రాష్ట్ర ప్రభుత్వానిదేనని మే 11న తీర్పు వెలువడింది. ఆ నేపథ్యంలో అదే నెల 19 న కేంద్రం ఆర్డినెన్సు జారీ చేసింది. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండడంతో దానిని బిల్లు రూపంలో కేంద్రం ప్రవేశ పెట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News