Wednesday, January 22, 2025

ఢిల్లీలో కాలుష్య తీవ్రతరం.. ట్రైనింగ్ సెషన్‌ను రద్దు చేసుకున్న బంగ్లాదేశ్ జట్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా మూడో రోజు కూడా వాయుకాలుష్యం అతి తీవ్రస్థాయిలో ఉంది. శనివారం ఉదయం వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 504 కి చేరింది. ఈ సూచీ 702కు జహంగీర్‌పురి ప్రాంతంలోను, 618 కి విహార్ లోను పడిపోవడం పరిస్థితి తీవ్రతను వెల్లడిస్తోంది. విషపూరిత పొగమంచు దేశ రాజధానిని కమ్మేయడంతో ఆటగాళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ట్రైనింగ్ సెషన్‌ను రద్దు చేసుకుంది.

ప్రస్తుతం భారత్ వన్డే ప్రపంచకప్ 2023 కు ఆతిథ్యం ఇస్తోంది. ఐసీసీ షెడ్యూల్ ప్రకారం నవంబర్ 6న ఢిల్లీ వేదికగా మ్యాచ్ జరగనుంది. బంగ్లాదేశ్ శ్రీలంక తలపడనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే ఇరు జట్లు ఢిల్లీ చేరుకున్నాయి. అయితే కాలుష్య తీవ్రత కారణంగా బంగ్లాదేశ్ జట్టు ట్రైనింగ్ సెషన్‌ను ర్దు చేసుకోవాల్సి వచ్చింది. ‘షెడ్యూల్ ప్రకారం శుక్రవారం సాయంత్రం ఈ ట్రైనింగ్ సెషన్ జరగాల్సి ఉంది. మాకు ఇంకా శిక్షణకు సమయం ఉండడంతో ఈ పరిస్థితుల మధ్య ఎలాంటి ఛాన్స్ తీసుకోదల్చుకోలేదు.’ అని బంగ్లా టీమ్ డైరెక్టర్ వెల్లడించారు.

పరిమితుల కంటే 80 రెట్లు ఎక్కువ
ఢిల్లీలో విష వాయువుల గాఢత ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిమితుల కంటే 80 రెట్లు ఎక్కువగా ఉండడంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యం కారణంగా ఢిల్లీలో దగ్గు, జలుబు, గొంతు ఇన్ఫెక్షన్లు, కంటి దురదతో ఆస్పత్రులకు వచ్చేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ సీజనులో ఇలా కాలుష్య తీవ్రత పెరగం ఇదే తొలిసారి. దీంతో ఢిల్లీ ఎన్‌సిఆర్ ప్రాంతాన్ని అతి తీవ్ర కాలుష్య జోన్‌గా గుర్తించారు. రెండు వారాల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడం, అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఈ కాలుష్యానికి కారణమయ్యాయి.

యోగీజీ … వాటిని రానివ్వకండి : ఢిల్లీ మంత్రి
‘ ప్రస్తుతం ఢిల్లీలో సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ బస్సులే తిరుగుతున్నాయి. కానీ యూపీ నుంచి నిషేధిత బీఎస్3. బీఎస్4 వాహనాలు ఆనంద్ విహార్ డిపోకు వస్తున్నాయి. విపరీతంగా పొగను వదిలే ఆ వాహనాలను పంపొద్దని యూపీ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను’ అని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ , ఉత్తరప్రదేశ్ సిఎం యోగీ ఆదిత్యనాథ్‌ను అభ్యర్థించారు. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని గోపాల్ రాయ్ కోరారు. ఉత్తరభారతమంతా ఇదే పరిస్థితి ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News