Thursday, December 19, 2024

ఢిల్లీలో కొనసాగుతున్న తీవ్ర వాయు కాలుష్యం

- Advertisement -
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో వాయునాణ్యత రోజురోజుకూ క్షీణిస్తోంది. వరుసగా ఐదో రోజు ఆదివారం వాయు నాణ్యత సూచీ 428గా నమోదై ఢిల్లీని తీవ్ర కేటగిరిలో చేర్చింది. సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చి (ఎస్‌ఎఎఫ్‌ఎఆర్ ) ప్రకారం నగరం మొత్తం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉదయం 8 గంటలకు ప్రమాదకర స్థాయిలో 409 వద్ద నమోదైంది. ఇది ఢిల్లీ ప్రజలకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. మరోవైపు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సిపిసిబి) ప్రకారం ఆదివారం ఢిల్లీ లోని 14 చోట్ల ఎక్యుఐ స్థాయిలు 400 దాటడం విశేషం. వాయు కాలుష్యంతో విమాన సర్వీసులపై ప్రభావం పడినట్టు అధికారులు పేర్కొన్నారు. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో 800 మీటర్ల మేర దృశ్యాలు కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో 107 విమాన సర్వీసులు ఆలస్యమయ్యాని, మూడు రద్దు అయ్యాయని ఫ్లైట్ రాడార్ సంస్థ వెల్లడించింది.

ఈ పరిస్థితులపై ఢిల్లీ ఎయిర్‌పోర్ట్, విమానయాన సంస్థలు ప్రయాణికులను అప్రమత్తం చేశాయి. వాతావరణ శాఖ వివరాల ప్రకారం జాతీయ రాజధాని ప్రాంతాల్లోని అనేక మానిటరింగ్ స్టేషన్లలో వాయు నాణ్యత సూచీ 400 పైనే నమోదైంది. బవానాలో అత్యధికంగా 471, అశోక్ విహార్, జహంగీర్‌పురిలో 466, ముండ్కా, వజీర్‌పుర్‌లో 463 గా వాయు నాణ్యత సూచీ నమోదయ్యింది. దీంతో ఈ ప్రాంతాలు “ సీవియర్ ప్లస్‌” వాయు నాణ్యత కేటగిరి లోకి పడిపోయాయని అధికారులు పేర్కొన్నారు. ఢిల్లీలో కాలుష్య స్థాయిలు విపరీతంగా పెరుగుతుండడంతో ప్రజలు శ్వాసకోశ, కంటి సమస్యల బారిన పడే అవకాశం ఉందని , ఇతర అనారోగ్య సమస్యలూ రావొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. దేశ రాజధానిలో వాయు కాలుష్యం తీవ్రత ఇలాగే పెరిగితే అత్యవసరం కాని నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు ఢిల్లీ లోని నోయిడా, గురుగ్రామ్, ఘజియాబాద్, ఫరీదాబాద్‌ల్లో వరుసగా వాయునాణ్యత సూచీ 308, 307, 372,260గా నమోదయ్యింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది వాయు నాణ్యతలో స్వల్ప మెరుగుదలను సూచిస్తోంది.

ప్రజలకు హెచ్చరికలు
కాలుష్యాన్ని నివారించేందుకు ప్రజలు అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రభుత్వం హెచ్చరించింది. ఢిల్లీలో ఐదో తరగతి వరకు పిల్లలకు తరగతులు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. మరోవైపు 6 వ తరగతి వరకు పిల్లలకు పాఠశాలల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి చేశారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం అనేక చోట్ల నీటిని చల్లుతోంది. ఈ నేపథ్యంలో రాజధానిలో జిఆర్‌ఎపి3 నిబంధనలు అమలు చేస్తున్నారు. ఈ నిబంధనల ప్రకారం ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో అన్ని రకాల నిర్మాణాలు , మైనింగ్, కూల్చివేతలు నిషేధించారు. ఇతర రాష్ట్రాల వాహనాలపై నిషేధం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బీఎస్3 పెట్రోల్, బీఎస్4డీజిల్ వాహనాలపై ఢిల్లీలో నిషేధం విధించారు. ఢిల్లీలో కాలుష్య కారక పారిశ్రామిక యూనిట్లు, థర్మల్ పవర్ ప్లాంట్లు కూడా రద్దయ్యాయి. తాండూర్‌లో బొగ్గు, కలప వాడకంపై నిషేధం వంటి పలురకాల చర్యలను అమలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన వారు మోటారు వాహనాల చట్టం (1988 లోని సెక్షన్ 194(1) ప్రకారం జరిమానాలను ఎదుర్కొంటారు. ఇందులో రూ. 20.000 వరకు జరిమానా ఉంటుంది. అయినప్పటికీ కాలుష్యం మాత్రం 400 స్థాయి నుంచి తగ్గడం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News