3 విమానాలు రద్దు, 5 దారిమళ్లింపు
దేశ రాజధానిని ముంచెత్తిన కుండపోత వర్షం
మురికి కాలువలో జారిపడి ఒకరి మృతి
న్యూఢిల్లీ: ఢిల్లీని వరదలు ముంచెత్తాయి. శనివారం తెల్లవారుజాము నుంచే కుండపోత వర్షం కురియడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు నదులను తలపిస్తున్నాయి. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అండర్‌పాస్ వంతెనల వద్ద నీరు నిలవడంతో ఆ మార్గాల్లో వాహనాల్ని నిలిపివేశారు. నరేలా పారిశ్రామిక ప్రాంతంలోని సి బ్లాక్ వద్ద వరద నీటితో నిండిన మురికి కాలువలో జారిపడి ఓ వ్యక్తి చనిపోయారు. పాలం ఫ్లైఓవర్ వద్ద అండర్‌పాస్‌లో చిక్కుకున్న బస్సు నుంచి 40 మంది ప్రయాణికుల్ని ఫైర్ సిబ్బంది కాపాడింది. డబ్లూహెచ్‌ఒ సమీపంలోని రింగ్‌రోడ్డు, ఐటిఒ, ఎయిర్‌పోర్టు రోడ్డు, మోతీబాగ్, ఆర్‌కె పురం, మధువిహార్, హరినగర్,రోహ్‌తక్ రోడ్డు, సోమ్‌విహార్, వికాస్‌మార్గ్,సంగం విహార్ వరదనీటిలో చిక్కుకున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 97 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్టు వాతావరణశాఖ తెలిపింది.
ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి వరదనీరు చేరడంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాంతో, మూడు విమానాలను రద్దు చేయగా, ఐదింటిని దారిమళ్లించారు. నాలుగు దేశీయ విమానాలను జైపూర్‌కు, దుబాయ్‌ఢిల్లీ అంతర్జాతీయ విమానాన్ని అహ్మదాబాద్‌కు దారిమళ్లించారు. ఎయిర్‌పోర్టులో కార్లు మునిగిన వీడియోలు సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. రన్‌వేపై నీరు నిలిచింది. నీటిని తొలగిస్తున్నట్టు ఎయిర్‌పోర్టు అధికారులు తనకు తెలిపారని విమానయానశాఖమంత్రి జ్యోతిరాదిత్యసింధియా ట్విట్ చేశారు. 30 నిమిషాల్లో క్లియరవుతుందన్నారు. ఎయిర్‌పోర్టు చుట్టుపక్కల వరదనీరు నిలవడంతో ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పలు వాహనాలు నీట మునిగిన వీడియోలు వైరల్ అయ్యాయి.
బ్రేక్ కానున్న 77 ఏళ్ల రికార్డు
సెప్టెంబర్ నెలలో ఢిల్లీలో ఈస్థాయి వర్షాలు కురియడం 77 ఏళ్ల తర్వాత ఇది రికార్డు కానున్నదని ఐఎండి అధికారి ఒకరు తెలిపారు. 1944 సెప్టెంబర్‌లో 417.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇప్పటికే 383.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఢిల్లీలో ఈ నెలలో గత రికార్డులు ఇలా ఉన్నాయి.. 1914లో 360.9మి.మీ., 1945లో 359.2 మి.మీ.,1933లో 341.9 మి.మీ. ఈ ఏడాది ఈ నెలలో కొన్ని రికార్డులు.. సెప్టెంబర్ 1న 112.1 మి.మీ.,2న 117.7మి.మీ., 11న 94.7 మిల్లీమీటర్లు నమోదైంది. వర్షాకాలంలో ఢిల్లీలో ఈ స్థాయిలో కుండపోత వర్షాలు కురియడం 46 ఏళ్లలో ఇదే తొలిసారని ఐఎండికి చెందిన మరో అధికారి తెలిపారు. 1975లో 1150 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, ఈ ఏడాది ఇప్పటికే 1100 మార్క్ దాటిందని ఆ అధికారి తెలిపారు. ఈ నెల 25న ఢిల్లీని నైరుతి రుతుపవనాలు వీడనున్నాయి.