సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు, పోస్ట్‌లు
రద్దీని తగ్గించే చర్యలకు విమానయానశాఖమంత్రి సిందియా ఆదేశం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఐజిఐ) ఇప్పుడు కొవిడ్19 ఒమిక్రాన్ వేరియంట్‌కు హాట్‌స్పాట్‌గా మారుతోందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫోటోలు ఆందోళన కలిగిస్తున్నాయి. రెండు వారాల క్రితం దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్‌ను వేగంగా వ్యాప్తిచెందే రకంగా ఇప్పటికే గుర్తించారు. దాంతో, కేంద్ర ప్రభుత్వం నవంబర్ 30న విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. రిస్క్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరితోపాటు ఇతర దేశాల ప్రయాణికుల్లోని రెండుశాతం మందికి ఆర్‌టిపిసిఆర్ పరీక్షల్ని తప్పనిసరి చేసింది. మరోవైపు ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. దాంతో, వచ్చేవారు, వెళ్లేవారితో ఐజిజి కిటకిటలాడుతోంది. డిసెంబర్ 1 నుంచి ఐజిఐలో ఇలాంటి రద్దీనే ఉన్నదని ఇమేజెస్ ద్వారా ప్రయాణికులు తెలియజేస్తున్నారు. మాస్క్‌లు ధరిస్తున్నప్పటికీ, భౌతిక దూరం పాటించకపోవడం పట్ల వైద్య నిపుణుల నుంచి కూడా ఆందోళన వ్యక్తమవుతోంది.
పలు విమానాలు ఐజిఐకి వచ్చే సమయం ఉదయం 5 గంటలు కావడంతో రద్దీ ఏర్పడుతోందని ఓ ప్రయాణికుడు ట్విట్ చేశారు. ఇలాంటి గుంపుల వల్ల ఒమిక్రాన్ విస్తరిస్తుందని ఆ ప్రయాణికుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై ఆర్‌పిజి గ్రూప్ చైర్మన్ హర్ష్‌గోయెంకా కూడా ఓ ఫోటోను షేర్ చేశారు. ఆదివారం ఢిల్లీ ఐజిఐలో కనిపించిన ఈ సీన్ కొవిడ్‌కు హాట్‌స్పాట్‌లాంటిదని ఆయన కామెంట్ చేశారు. విమానాశ్రయ సిబ్బంది, విమానయానశాఖ అధికారులు ఇలాంటి పరిస్థితిని తెలివిగా ఎదుర్కోవాలని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌సిసోడియా మరో ట్విట్ చేశారు. నిర్ణయాధికారమున్నవారికి మనసుంటే భారీ సమూహాలను కట్టడి చేయడానికి పరిష్కారాలుంటాయని హితవు పలికారు. విమానయానశాఖమంత్రి జ్యోతిరాదిత్యసిందియా ఫోటోను ట్యాగ్ చేస్తూ ఈ పోస్ట్ పెట్టారు.
ఐజిఐలో పరిస్థితిపై సిందియా స్పందించారని ఓ అధికారి తెలిపారు. రద్దీని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని ఐజిఐ అధికారులను సిందియా ఆదేశించారని ఆ అధికారి తెలిపారు. సోమవారం సంబంధిత ఉన్నతాధికారులతో ఓ సమావేశం అనంతరం ఈ ఆదేశాలిచ్చారని ఆ అధికారి తెలిపారు. ఆర్‌టిపిసిఆర్ పరీక్షా ఫలితాలు రావడానికి 68 గంటలు పట్టడం కూడా ఓ కారణమని ప్రయాణికులు తెలిపారు. త్వరగా ఫలితాల కోసం ర్యాపిడ్ పిసిఆర్ పరీక్షలవైపే అధికభాగం ప్రయాణికులు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. దీనికి రూ.3500 అవుతుండగా, ఆర్‌టిపిసిఆర్‌కు రూ.500 ఖర్చవుతుంది. ఫలితాల్లో నెగెటివ్ వస్తేనే ప్రయాణికుల్ని ఇళ్లకు పంపిస్తారన్నది గమనార్హం. పాజిటివ్ వస్తే ఐసోలేషన్‌కు, ఆ తర్వాత జీనోమ్ సీక్వెన్సింగ్‌లో ఒమిక్రాన్ అని తేలితే క్వారంటైన్‌కు పంపిస్తారు.