వచ్చే ఏడాది మొదట్లోనే ఢిల్లీ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆమ్‌ఆద్మీ పార్టీ, బిజెపి వడివడిగా పావులు కదుపుతున్నాయి. అయితే పట్టణ మధ్యతరగతి అవసరాలను గుర్తించి వారిని సంతృప్తి పర్చడంలో కేజ్రీవాల్ ఎప్పుడూ ముందుంటారు. ఇది ఢిల్లీ మోడల్ పరిపాలన అని చాటుతుంటారు. ఇదే బాణీతో రెండేళ్ల క్రితం పంజాబ్‌లో ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) అఖండ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓటర్లను అమితంగా ఆకర్షించే రెండు పథకాలను తయారు చేశారు.
ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన పథకం ఒకటి, వృద్ధులకు ఉచితంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యచికిత్స అందించే సంజీవన్ యోజన పథకం మరొకటి. ఇది బిజెపికి కంటగింపుగా మారుతోంది. మరి ఎవరు వెనుక నుండి నాటకం ఆడిస్తున్నారో బయటపడడం లేదు కానీ బుధవారం ఒక వార్తాపత్రికలో ఢిల్లీ అధికారులే ఈ పథకాల గురించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని, వాటిని అధికారికంగా విశ్వసించలేమని వ్యాఖ్యానిస్తూ ఒక ప్రకటన వెలువడింది. దీనికి ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ ఆ ప్రకటన తప్పుడు ప్రకటన అని సంబంధిత అధికారులపై చర్య తీసుకుంటామని హెచ్చరించారు. దీనిని బట్టి ఆప్ పార్టీని దెబ్బ తీయడానికి కేంద్రం లోని కొన్నిశక్తులు పని చేస్తున్నాయని తెలుస్తోంది. కేంద్రానికి తాబేదారుగా ఢిల్లీ గవర్నర్ పనిచేస్తున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఆయన ఒత్తిడితోనే అధికారులు తప్పుడు ప్రకటనలు ఇచ్చారన్న అపోహలు వస్తున్నాయి.
ఏదేమైనా ప్రజాకర్షక పథకాల అమలులో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్‌ఆద్మీ ప్రభుత్వానికి మంచి గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్‌యోజన పథకం కింద మహిళలకు నెలనెలా రూ. 2100 వరకు ఆర్థిక సహాయం అందిస్తామని, అలాగే వృద్ధులకు ఉచితంగా ఆరోగ్యభద్రత కల్పిస్తామని ప్రచారం చేస్తూ ఆమ్‌ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్, ముఖ్యమంత్రి అతిశీ లబ్ధిదారుల పేర్ల జాబితా తయారు చేయడం బుధవారం ప్రారంభించారు. బుధవారం మధ్యాహ్నం ఈస్ట్ కిద్వాయి నగర్‌లో ఈ పథకాల లబ్ధిదారుల రిజిస్ట్రేషన్లు చేపట్టారు. అయితే ఈ విధంగా పేర్లు రిజిస్ట్రేషన్ చేస్తుండటం కేవలం కంటితుడుపే తప్ప మరేంకాదని బిజెపి ఎద్దేవా చేస్తోంది.
గౌరవభృతి మంజూరు చేసే ఫారాలను నింపుతున్నది అధికారులు కాదని, ఆప్ నాయకులని బిజెపి విమర్శిస్తోంది. అయితే ఓటర్ల జాబితాలో పేర్లు ఉంటేనే వెంటనే వారి పేర్లను రిజిస్టర్ చేసి పథకాల ప్రయోజనాలు పొందేలా పసుపు రంగు కార్డులు మహిళలకు అందిస్తున్నామని కేజ్రీవాల్ చెప్పారు. బుధవారం నుంచి మహిళా సమ్మాన్ యోజన, సంజీవని యోజన పథకాలకు సంబంధించి ఢిల్లీ మొత్తం మీద రిజిస్ట్రేషన్ ప్రారంభించినట్టు తెలిపారు. ఈ విధంగా తన నియోజకవర్గం (న్యూఢిల్లీ) నుంచి ఈ డ్రైవ్ మొదలు పెట్టామన్నారు. మహిళలు తమకోసం ప్రత్యేకించిన పసుపు రంగు రిజిస్ట్రేషన్ కార్డు భద్రంగా దాచుకోవాలన్నారు. ఢిల్లీ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు సంక్షేమ పథకాల అమలుపై ప్రభావం చూపిస్తుందా? అన్నప్రశ్నకు పథకాలకు నిధుల విషయంలో ఎలాంటి ఆందోళన అక్కరలేదన్నారు. ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతున్నట్టే ఈ రెండు పథకాలు అమలవుతాయని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. మహిళలకు తప్పకుండా ప్రతినెలా రూ. 2100 అందుతుందని భరోసా ఇచ్చారు.
దీనికి బడ్జెట్ ఎక్కడ నుంచి వస్తుంది అని ఆందోళన అక్కరలేదని, అది నా బాధ్యతని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ రెండు పథకాలు ప్రారంభించడం విప్లవాత్మకమైన చర్యగా ఆప్ చెబుతోంది.అయితే బిజెపి మాత్రం ఈ పథకాల అమలుపై అనేక ప్రశ్నలు వేస్తోంది ఎలాంటి నోటిఫికేషన్ లేదా బడ్జెట్ కేటాయింపు లేకుండా ఏ విధంగా ఈ పథకాలను అమలు చేస్తారని ఢిల్లీ బిజెపి చీఫ్ సచ్‌దేవ ప్రశ్నిస్తున్నారు. పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం 2022 నుంచి ఎలాంటి పథకాలను అమలు చేయలేనప్పుడు ఇక్కడి ఆప్ ప్రభుత్వం ఏ విధంగా అమలు చేయగలుగుతుందని విమర్శిస్తున్నారు.
సంజీవని యోజన పథకం పేరుతో వృద్ధ జనాభాను కేజ్రీవాల్ మోసగిస్తున్నారని ఢిల్లీ బిజెపి అధికార ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్ ధ్వజమెత్తారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో వృద్ధులకు వైద్య చికిత్స అన్నముసుగులో ప్రైవేట్ ఆస్పత్రులకు కిక్‌బాక్ స్కీమ్‌ను అమలు చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఇదిలా ఉండగా కేజ్రీవాల్ పోటీ చేస్తున్న న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో బుధవారం ఢిల్లీ బిజెపి నేత పర్వేష్ వర్మ మహిళా ఓటర్లకు రూ. 1100 చొప్పున పంచుతూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికినట్టు ఆమ్‌ఆద్మీ పార్టీ ఆరోపించింది. పర్వేష్ వర్మను తమ సిఎం అభ్యర్థిగా ప్రకటించనున్నట్టు కొందరు తనతో చెప్పారని, అలాంటి వ్యక్తిని సిఎంగా ఢిల్లీ ప్రజలు అంగీకరిస్తారా అని కేజ్రీవాల్ ప్రశించారు.
ఈ ఆరోపణలను పర్వేష్ వర్మ తోసిపుచ్చారు. తన తండ్రి దివంగత సాహిబ్ సింగ్ వర్మ (ఢిల్లీ మాజీ సిఎం) ఏర్పాటు చేసిన ఎన్‌జిఒ రాష్ట్రీయ స్వాభిమాన్ తరఫున డబ్బులు అందజేసినట్టు వివరణ ఇచ్చుకున్నారు. కేజ్రీవాల్ 11 ఏళ్లపాలనలో మహిళల ఆవేదనను తాను చూశానని, అందుకే నెలవారీ మహిళలకు రూ. 1100 వంతున ఇవ్వాలని తాను నిర్ణయించుకున్నట్టు చెప్పారు. కేజ్రీవాల్ తరహాలో తాను మద్యం పంపిణీ చేయలేదు కదా అని విమర్శించారు. అయితే ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఇప్పటినుంచి ఓటర్లకు బిజెపి నగదు పంపిణీ చేయడం ప్రారంభించిందని ఆప్ వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి.