Thursday, January 30, 2025

గందరగోళంలో బిజెపి, ఆత్మరక్షణలో ఆప్

- Advertisement -
- Advertisement -

ప్రపంచంలోనే అత్యధికంగా జనసాంద్రత గల రెండో మహా నగరం, అత్యంత కాలుష్య నగరమైన ఢిల్లీ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలకు మొత్తం మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంగా మారారు. ప్రధాన ప్రతిపక్షాలైన బిజెపి, కాంగ్రెస్ – రెండు కూడా వరుసగా మూడోసారి ఆప్ గెలుపొందితే జాతీయ రాజకీయాలలో కేజ్రీవాల్ ప్రాముఖ్యత పెరుగుతుందని భయపడుతున్నాయి. అందుకనే ఏ విధంగా అయినా ఓడించాలని పట్టుదలగా పని చేస్తున్నాయి. మరోవంక, ఈ ఎన్నికలు కేజ్రీవాల్ రాజకీయ భవిష్యత్‌కు మాత్రమే కాకుండా, ఆప్ అస్తిత్వానికి కూడా సవాల్‌గా మారాయి. ఇప్పటి వరకు ఆప్ తిరిగి మెజారిటీ స్థానాలు గెలుచుకుంటుందని పలు అంచనాలు స్పష్టం చేస్తున్నా, మొత్తం 70 సీట్లు ఉండగా కనీసం 50 గెల్చుకొనని పక్షంలో ఆప్ స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కష్టం కాగలదని భయపడుతున్నారు.

ఎంఎల్‌ఎలను లోబరచుకొని బిజెపి అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తుందని ఆందోళన చెందుతున్నారు. సుమారు 12 ఏళ్లుగా ఢిల్లీలో అధికారంలో ఉండడంతో ఆప్ సహజంగానే ప్రభుత్వ వ్యతిరేకతను కొంత మేరకు ఎదుర్కొంటున్నది. దేశంలో మరే ముఖ్యమంత్రి చేయని విధంగా కార్పొరేట్ స్థాయిలో పాఠశాలలను, మొహల్లా క్లినిక్‌లను అభివృద్ధి చేయడం ద్వారా పేద ప్రజలకు రారాజుగా కేజ్రీవాల్ వెలుగొందుతున్నా, మూడోసారి గెలుపొందడానికి ఆ మద్దతు మాత్రమే సరిపోదు. ముఖ్యంగా కేజ్రీవాల్, మనీష్ సిసోడియా దగ్గర నుండి కీలకమైన ఆప్ నాయకులు అవినీతి కేసులలో జైళ్లకు వెళ్లి, బెయిల్‌పై బైటకు రావడంతో ఆ పార్టీ నిజాయితీ పట్ల ప్రజలలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అవినీతి వ్యతిరేక ఉద్యమంగా ప్రారంభమై, రాజకీయ పార్టీగా అవతరించడంతో ప్రజలు ఆ పార్టీ నాయకుల నుండి భిన్నమైన ప్రవర్తన ఆశిస్తున్నారు. పైగా, ముఖ్యమంత్రిగా తనకు అధికార భవనం వద్దని మొదట్లో చెప్పిన కేజ్రీవాల్ ముఖ్యమంత్రి నివాసం ‘శేష్ మహల్’ కోసం భారీగా ప్రజాధనాన్ని ఖర్చు చేయడం బిజెపికి పెద్ద ప్రచార అస్త్రంగా దొరికింది. ఈ విషయమై సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు.

ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తూ ఎన్నికలలో ప్రజా తీర్పు కోరి, తిరిగి ఆ పదవిలోకి వస్తానని ప్రకటించిన కేజ్రీవాల్ ఇప్పుడు ఆప్ తిరిగి గెలుపొందితే తానే ముఖ్యమంత్రి అని చెప్పలేక వాపోతున్నారు. ఆయన ఎటువంటి ఫైల్ పై సంతకం చేయరాదని, ముఖ్యమంత్రి కార్యాలయంలోకి ప్రవేశింపరాదని బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు జారీ చేసిన షరతులు అడ్డంకిగా ఉన్నాయి. గతంలో యుపిఎ హయాంలో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ మాదిరిగా పెత్తనం తానే చేస్తూ, ఆతిశీని ముఖ్యమంత్రిగా కొనసాగిస్తారా? తేల్చుకోవాల్సి ఉంది. ఒక విధంగా ఢిల్లీలోని రాజకీయ పరిస్థితులు 27 ఏళ్ళ తర్వాత తిరిగి అధికారం చేపట్టేందుకు బిజెపికి అనుకూలంగా ఉన్నప్పటికి ఆ పార్టీ నాయకత్వం సంక్షోభం ఎదుర్కొంటున్నది. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుండి మొత్తం గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటున్నది. అసలు పార్టీలో బాస్ ఎవ్వరు? తేల్చుకోలేక పోతున్నారు. ఢిల్లీ ఎన్నికల ఇన్ ఛార్జ్‌గా నియమించిన జయ పాండా గాని, ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవా గాని ప్రేక్షకపాత్ర వహించాల్సి వస్తుంది.

డిసెంబర్ 8 నుండి ‘పరివర్తన పాదయాత్ర’ చేపడుతున్నట్లు వీరేంద్ర పెద్ద ఎత్తున పోస్టర్లు, బ్యానర్లు వేసినా ఆ యాత్ర ప్రారంభమే కాలేదు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ఢిల్లీలోనే ఉంటున్నప్పటికీ తనకేమి సంబంధం లేనట్లు తన మంత్రిత్వ శాఖ వ్యవహారాలకు పరిమితం అవుతున్నారు. 20% మంది ఉత్తర ప్రదేశ్, బీహార్ ప్రజలు ఢిల్లీలో ఓటర్లుగా ఉన్నారు. అయితే పూర్వాంచల్ ప్రజలను కించపరిచే విధంగా పార్టీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా చేసిన వ్యాఖ్యను వెంటనే పార్టీ ఎంపి మనోజ్ తివారి ఖండించినా జరగవలసిన నష్టం జరిగింది. దానితో ప్రధాని నరేంద్ర మోడీ, యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లను రంగంలోకి దింపి నష్టనివారణ చర్యలకు దిగారు. గ్రామీణ ప్రాంతాల్లో మంచి పట్టు ఉన్న అభ్యర్థులను విద్యావంతులు, సంపన్నులు ఎక్కువగా ఉంది ఢిల్లీ మధ్యలో నిలబెడితేవారు ప్రతి రోజూ వివాదాలకు కేంద్ర బిందువు అవుతున్నారు.

అన్ని పార్టీలు యమునా నది కాలుష్యం గురించి విమర్శలు గుప్పించడమే గాని, దాని పరిష్కారం కోసం ఎవ్వరూ నిర్దుష్టంగా ఎటువంటి ప్రణాళికలను ప్రజల ముందుంచలేక వాపోతున్నారు. అదే విధంగా నగర కాలుష్యం, నగరంలో అధ్వానంగా ఉన్న శాంతిభద్రతలను విమర్శలకు మాత్రమే ఉపయోగించుకుంటున్నారు.
ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్న బిజెపి ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ముఖ్యమంత్రిని మున్సిపల్ మేయర్ కన్నా తక్కువగా కుదించే ప్రయత్నాలు చేస్తున్నది. శాంతి భద్రతలు కేంద్ర హోం శాఖ పర్యవేక్షణలో అధ్వానంగా మారడం, ముఖ్యంగా మహిళలపై అత్యాచారాలతో దేశంలో అగ్రగామిగా ఉండటం బిజెపిని ప్రజల ముందు దోషిగా నిలబెడుతున్నాయి. ఢిల్లీలో ఎన్నికల ప్రచారం జరిపేందుకు బిజెపి, కాంగ్రెస్‌లకు ప్రజలకు తెలిసిన స్థానిక నాయకులు ఎవ్వరూ లేరు. హర్యానా, మహారాష్ట్రలలో అనూహ్యమైన విజయాలు సాధించిన ఉత్సహంతో ఉన్న బిజెపి అదే దూకుడుతో ఢిల్లీ కూడా గెల్చుకోగలమని ముందుగా వేసుకున్న అంచనాలు పోలింగ్ దగ్గరవుతున్న కొలది సన్నగిల్లుతున్నాయి.

ఆ రెండు రాష్ట్రాలలో మాదిరిగా నిర్దుష్టమైన ప్రణాళికతో బిజెపి ఎన్నికల ప్రచారం చేయడం లేదనిపిస్తుంది. ఢిల్లీలో సుమారుగా నాలుగో వంతు ప్రజలు దక్షిణాది రాష్ట్రాల నుండి వెళ్లినవారున్నారు. కానీ బిజెపి స్టార్ కాంపైనర్‌లలో ఒక్కరూ దక్షిణాది నేతలు లేకపోవడం గమనార్హం. గతంలో ఎప్పుడూ ఈ విధంగా బిజెపి చేయలేదు.
బిజెపి కేవలం ప్రధాని ప్రచారం ద్వారా ఢిల్లీలో గెలుపొందాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. అయితే, గత ఏడాది లోక్‌సభ ఎన్నికల నాటి నుండి ఓటర్లను ఆకర్షించడంలో ఆయన ప్రాబల్యం సన్నగిల్లుతున్నట్లు స్పష్టం కావడాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. చివరకు పార్టీ ఘన విజయం సాధించిన హర్యానా, మహారాష్ట్రలలో సైతం ప్రధాని పరిమితంగానే ప్రచారం చేయడం గమనార్హం. కాంగ్రెస్‌కు ఢిల్లీలో అధికారం చేపట్టగల నాయకత్వం గాని, సంస్థాగత బలం గాని లేవు. ఆ పార్టీకి వచ్చే ప్రతి ఓటు కూడా ఆప్‌కు నష్టదాయకం, పరోక్షంగా బిజెపికి లాభదాయకం కాగలవు. ఢిల్లీలో బిజెపిని పరోక్షంగా అధికారంలోకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ నాయకులు సిద్ధం గా ఉన్నారు. ముఖ్యంగా దళితులు, ముస్లింల ఓట్లలో గండికొట్టడం ద్వారా ఆప్‌ను తిరిగి అధికారంలోకి రాకుండా చేయడమే ఆ పార్టీ ప్రధాన ఎత్తుగడగా కనిపిస్తున్నది. ఇండియా కూటమిలోని ప్రాంతీయ పార్టీలు అన్ని ఢిల్లీలో ఆప్‌కు మద్దతు ఇస్తున్నాయి. ఇప్పటికే ఇండియా కూటమికి రాహుల్ గాంధీ నాయకత్వంపై ఆయా పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆప్ గెలుపొందితే బిజెపికి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలు బలమైన కూటమిగా ఏర్పడే అవకాశం ఉందని కాంగ్రెస్ ఆందోళన చెందుతున్నది. అటువంటి అవకాశం లేకుండా చేయాలని చూస్తున్నది.

రాహుల్ గాంధీ జరిపిన భారత్ జోడి యాత్ర ద్వారా దళితులలో కొంత మద్దతు పొందామని అంచనా వేస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ అధినేత డా. మోహన్ భగవత్‌ను లక్ష్యంగా చేసుకుని గత వారం రాహుల్ గాంధీ చేసిన విమర్శలు సైతం ముస్లింలను ఆకట్టుకోవడం కోసమే అని స్పష్టం అవుతుంది. అయితే, పరోక్షంగా బిజెపికి మేలు జరిగే విధంగా ఈ వర్గాలు కాంగ్రెస్‌కు ఏ మేరకు మద్దతు ఇస్తాయో చూడాల్సి ఉంది. మరోవంక, ఒక ఉద్యమ పార్టీగా ప్రారంభమై, రెండు రాష్ట్రాలలో అధికారంలో ఉండటమే కాకుండా పలు రాష్ట్రాల్లో ఉనికి చాటుకుంటూ, 12 ఏళ్లలో జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన కేజ్రీవాల్ రాజకీయ ఎత్తుగడలో ఒకవైపు బిజెపిని, మరోవైపు కాంగ్రెస్‌ను కలవరానికి గురిచేస్తున్నారు. ప్రధాని మోడీ మాదిరిగా జనాభాలో చెప్పుకోదగిన సంఖ్యలో లేని ‘బనియా’ సామాజిక వర్గానికి చెందిన కేజ్రీవాల్ రాజకీయంగా ఢిల్లీలోని మురికివాడలలో పేద ప్రజలకు నేతగా ఎదిగారు.

ముస్లింలను దూరం చేసుకోకుండానే హిందుత్వ పోకడలు అనుసరిస్తున్నారు. హనుమాన్ దేవాలయంలో పూజలు చేస్తారు. బిజెపి పదజాలాన్ని ఉపయోగిస్తుంటారు. పేద ప్రజల నేతగా వారికి అర్థమయ్యే పదజాలం ప్రయోగిస్తుంటారు. ప్రతిపక్ష కూటమిలో కాంగ్రెస్ ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ ఉండటం ద్వారా ఇతర ప్రాంతీయ పార్టీలకు దగ్గర కాగలుగుతున్నారు. ఒక విధంగా ఆయన వ్యక్తిత్వం, రాజకీయ ఎత్తుగడలు విశ్లేషకులకు అంతుబట్టని విధంగా ఉంటున్నాయి. ముఖ్యమంత్రిగా చెప్పుకోదగిన అధికారాలు లేని ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపిస్తూ జాతీయ రాజకీయాలపై తనదైన ప్రభావం ఏర్పాటు చేసుకోవాలని కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారు. ఇతర ప్రాంతీయ పార్టీల నాయకుల మాదిరిగా అయన దృష్టి కేవలం తమ రాష్ట్ర రాజకీయాలపై ఆధిపత్యం వహించడం మాత్రమే కాదు. అందుకనే కేజ్రీవాల్ ఎదుగుదల జాతీయ పార్టీలకు మింగుడు పడటం లేదు. రాబోయే రోజులలో జాతీయ రాజకీయాలలో గుణాత్మక మార్పులకు సహితం ఈ ఎన్నికల ఫలితాలు దోహదపడే అవకాశాలు ఉన్నాయి.

చలసాని నరేంద్ర
98495 69050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News