న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అధికార బిజెపి ఇంతకు ముందు వాగ్దానం చేసినట్లుగా మహిళలకు నెల నెలా రూ. 2500 ఆర్థిక సహాయం అందజేసే విషయమై చర్చించేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో ఆప్ ఎంఎల్‌ఎల సమావేశం ఏర్పాటు చేయించాలని ఆప్ నాయకురాలు ఆతిశీ విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఒక ఎన్నికల ర్యాలీలో వాగ్దానం చేసినప్పుడు కొత్త ప్రభుత్వం తొలి మంత్రివర్గ సమావేశంలొ మహిళలకు ఆర్థిక సహాయ పథకాన్ని ఎందుకు ఆమోదించలేదని ఆతిశీ శనివారం రేఖా గుప్తాను ఒక లేఖలో ప్రశ్నించారు.
ఈ నెల మొదటి వారంలో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌పై బిజెపి విజయం సాధించిన అనంతరం రేఖా గుప్తా, ఆమె మంత్రి మండలి గురువారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం విదితమే. ఆ ఎన్నికల్లో ఆప్ 22 సీట్లు గెలుచుకున్నది. ఆతిశీ కల్కాజీ నియోజకవర్గం వాటిలో ఒకటి. 70 సీట్లు ఉన్న అసెంబ్లీలో బిజెపి 48 సీట్లు కైవసం చేసుకున్నది. పూర్వపు ఆప్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఆతిశీ తమ పార్టీ ఎంఎల్‌ఎలతో కలసి ఆదివారం (23న) సిఎంతో సమావేశానికి అపాయింట్‌మెంట్ కోరారు.
‘బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటట్లయితే తొలి మంత్రివర్గ సమావేశంలో రూ. 2500 మేరకు నెల నెలా చెల్లించే పథకాన్ని ఆమోదిస్తుందని ఢిల్లీ తల్లులకు, సోదరీమణులకు ప్రధాని నరేంద్ర మోడీ జనవరి 31న ద్వారకలో ఒక ఎన్నికల ర్యాలీలో వాగ్దానం చేశారు. బిజెపి ప్రభుత్వ తొలి మంత్రివర్గ సమావేశం గురువారం (20న) జరిగింది. కానీ ఆ పథకాన్ని ఆమోదించలేదు’ అని ఆతిశీ తెలిపారు. ‘మోడీ గ్యారంటీ’ని విశ్వసించిన ఢిల్లీ తల్లులు ‘మోసపోయామని’ భావిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. కాగా, పార్టీ వాగ్దానం చేసినట్లుగా ఆ పథకాన్ని మార్చి నుంచి అమలు పరచనున్నట్లు సిఎం రేఖా గుప్తా సహా బిజెపి నేతలు స్పష్టం చేశారు.