ఢిల్లీ అసెంబ్లీ తీర్మానం
న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసు కమిషనర్‌గా రాకేశ్ అస్థానా నియామకంపై ఢిల్లీ అసెంబ్లీ నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు అసెంబ్లీ గురువారం తీర్మానం చేసింది. అస్థానా నియామకం రాజ్యాంగ వ్యతిరేకం అని, ఆమ్ ఆద్మీపార్టీ నేతలను వేధించేందుకు ఈ నియామకం జరిగిందని ఈ తీర్మానంలో తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం ఆరంభం అయ్యాయి. తొలిరోజే ఆప్ ఎమ్మెల్యే సంజీవ్ ఝా తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. అస్థానా నియామకం అనుచితం, పైగా సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా ఉందని ఆప్ సభ్యులు విమర్శించారు.
గుజరాత్ కేడర్‌కు చెందిన పోలీసు అధికారిని ఢిల్లీలో పెత్తనానికి కేంద్ర సర్కారు తీసుకువచ్చిందని, దీనిని ఢిల్లీ ప్రభుత్వం ఆమోదించేది లేదని, ఈ నియామకానికి తమ ఆమోదం లేదని ఢిల్లీ అసెంబ్లీ తెలియచేస్తోందని పేర్కొంటూ తీర్మానంలో పేర్కొన్నారు. ప్రస్తుతం సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) డైరెక్టర్ జనరల్‌గా ఉన్న ఐపిఎస్ అధికారి అస్థానా ఈ నెల 31వ తేదీన రిటైర్ కానున్నారు. అయితే ఆయనకు ఏడాది పదవీకాలం పొడిగింపు నడుమ ఢిల్లీ పోలీసు కమిషనర్‌గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు వెలువరించింది. ఆయనను ఢిల్లీ పోలీసు బాస్‌గా తీసుకురావడం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే అని, ఆప్ నేతలను కేసులలో ఇరికించేందుకు వేధించేందుకు ఉద్ధేశించిందేనని తీర్మానంపై చర్చ సందర్భంగా ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ ఇతరులు ఆక్షేపించారు.
Delhi assembly passes resolution against Rakesh Asthana