రాణించిన అయ్యర్, అక్షర్, అవేశ్ ఖాన్ మ్యాజిక్, ముంబైపై ఢిల్లీ గెలుపు
షార్జా: వరుస విజయాలతో జోరుమీదున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఐపిఎల్ సీజన్14లో నాకౌట్‌కు చేరుకుంది. శనివారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ 4 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. ఈ గెలుపుతో ఢిల్లీ ఈ సీజన్‌లో నాకౌట్ బెర్త్‌ను దక్కించుకున్న రెండో జట్టుగా నిలిచింది. ఇంతకుముందు మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కూడా ప్లేఆఫ్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. ఇక ఢిల్లీ చేతిలో ఓటమి పాలైన ప్రస్తుత విజేత ముంబై నాకౌట్ అవకాశాలను క్లిష్టంగా మార్చుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. బౌలర్లుకు అనుకూలించిన షార్జా పిచ్ ఈ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు కూడా ఢిల్లీ చివరి వరకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. శ్రేయస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్‌లు చివరి వరకు అజేయంగా క్రీజులో నిలిచి ఢిల్లీకి విజయం సాధించి పెట్టారు. శ్రేయస్ అయ్యర్, అశ్విన్‌లు అసాధారణ బ్యాటింగ్‌ను కనబరచడంతో ఢిల్లీ 19.1 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి విజయం అందుకుంది.
ఆరంభంలోనే..
స్వల్ప లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్లు శిఖర్ ధావన్, పృథ్వీషాలు జట్టుకు శుభారంభం అందించలేక పోయారు. జట్టును ఆదుకుంటాడని భావించిన స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఒక సిక్సర్‌తో 8 పరుగులు మాత్రమే చేసి రనౌటయ్యాడు. ఆ వెంటనే మరో ఓపెనర్ పృథ్వీషా కూడా ఔటయ్యాడు. కృనాల్ పాండ్య అద్భుత బంతితో ఈ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. షా ఆరు పరుగులు మాత్రమే చేశాడు. కొద్ది సేపటికే సీనియర్ ఆటగాడు స్టీవ్ స్మిత్ కూడా వెనుదిరిగాడు. ఒక సిక్సర్‌తో 9 పరుగులు చేసి స్మిత్‌ను కౌల్టర్ నైల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ దశలో కెప్టెన్ రిషబ్ పంత్ కొద్ది మెరుపులు మెరిపించాడు. మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 26 పరుగులు చేసి జోరు మీద కనిపించిన రిషబ్‌ను జయంత్ యాదవ్ ఔట్ చేశాడు. తర్వాత వచ్చిన అక్షర్ పటేల్ కూడా నిరాశ పరిచాడు. 9 పరుగులు మాత్రమే చేసి బౌల్ట్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో ఢిల్లీ 77 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది.
అయ్యర్ పోరాటం..
ఒకవైపు వికెట్లు పడుతున్నా స్టార్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ పోరాటం కొనసాగించాడు. అతనికి తొలుత షిమ్రోన్ హెట్‌మెయిర్ అండగా నిలిచాడు. అతని సహకారంతో అయ్యర్ జట్టును లక్షం దిశగా నడిపించాడు. ఇద్దరు కుదురు కోవడంతో ఢిల్లీకి సునాయాస విజయం ఖాయమనిపించింది. కానీ తీవ్ర ఒత్తిడిలోనూ ముంబై బౌలర్లు అసాధారణ బౌలింగ్‌ను కనబరిచారు. బుమ్రా, బౌల్ట్ కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేస్తూ అయ్యర్‌ను కట్టడి చేయడంలో సఫలమయ్యారు. మరోవైపు ధాటిగా ఆడుతున్న హెట్‌మెయిర్‌ను బుమ్రా ఔట్ చేశాడు. రెండు ఫోర్లతో 15 పరుగులు చేసి హెట్‌మెయిర్ పెవిలియన్ బాట పట్టాడు. అయితే తర్వాత వచ్చిన అశ్విన్ అండతో శ్రేయస్ అయ్యర్ మరో వికెట్ కోల్పోకుండానే ఢిల్లీని విజయ తీరాలకు చేర్చాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన అయ్యర్ రెండు ఫోర్లతో అజేయంగా 33 పరుగులు చేశాడు. మరోవైపు అశ్విన్ ఒక సిక్సర్‌తో 20 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ఢిల్లీ మరో బంతులు మిగిలివుండగానే విజయం సాధించి నాకౌట్ బెర్త్‌ను సొంతం చేసుకుంది.
అక్షర్ మాయ..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబైను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో ఢిల్లీ బౌలర్లు సఫలమయ్యారు. ప్రతి బౌలర్ కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేసి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ ఏడు పరుగులు మాత్రమే చేసి అవేశ్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ దశలో సూర్యకుమార్‌తో కలిసి మరో ఓపెనర్ డికాక్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచేందుకు ప్రయత్నించాడు. ఇద్దరు సమన్వయంతో ఆడుతూ స్కోరు ముందుకు తీసుకెళ్లారు. కానీ ఒక ఫోర్, సిక్స్‌తో 19 పరుగులు చేసిన డికాక్‌ను అక్షర్ ఔట్ చేశాడు.
మరోవైపు సూర్యకుమార్ దూకుడుగా ఆడాడు. రెండు ఫోర్లు, మరో రెండు బౌండరీలతో 33 పరుగులు చేసి జోరు మీద కనిపించిన సూర్యకుమార్‌ను కూడా అక్షర్ ఔట్ చేశాడు. కొద్ది సేపటికే సౌరభ్ తివారి కూడా వెనుదిరిగాడు. 15 పరుగులు చేసిన తివారిని కూడా అక్షర్ వెనక్కి పంపాడు. ఆ తర్వాత ముంబై మళ్లీ తేరుకోలేక పోయింది. హార్దిక్ పాండ్య (17), కృనాల్ పాండ్య 15 (నాటౌట్), జయంత్ యాదవ్ (11) కాస్త రాణించారు. దీంతో ముంబై స్కోరు 129 పరుగులకు చేరింది. ఢిల్లీ బౌలర్లలో అవేశ్ ఖాన్, అక్షర్ పటేల్ మూడేసి వికెట్లు పడగొట్టారు. అక్షర్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.