Sunday, December 22, 2024

ఎన్‌డిఎకు 340 పైగా సీట్లు

- Advertisement -
- Advertisement -

అత్యధిక ఎగ్జిట్ పోల్ జోస్యాలకు అనుగుణంగా ఢిల్లీలోని బుకీలు అధికార బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ లోక్‌సభ ఎన్నికల్లో 340 పైగా సీట్లు సాధిస్తుందని, ప్రతిపక్ష ఇండియా కూటమికి సుమారు 200 సీట్లు వస్తాయని భావిస్తున్నారు. ఢిల్లీలో బుకీలు, పంటర్ల లెక్కల ప్రకారం, ఎన్‌డిఎ 341, 343 మధ్య సీట్లు సంపాదించవచ్చునని, ఇండియా కూటమికి 198, 200 మధ్య సీట్లు రావచ్చునని బుకీ నెట్‌వర్క్‌లో పని చేస్తున్న ఒక ప్రతినిధి ‘పిటిఐ’తో చెప్పారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి) స్వయంగా 310 నుంచి 313 వరకు సీట్లు గెలవవచ్చునని, కాంగ్రెస్ సీట్లు 57, 59 మధ్య ఉండవచ్చునని బుకీలు సూచించారు. బుకీలు ఢిల్లీలోని ఏడు లోక్‌సభ సీట్లలో ఇండియా కూటమికి ఒక సీటు ఇచ్చినట్లు ఆ ప్రతినిధి తెలిపారు. బెట్టింగ్ మార్కెట్ రెండు వారాల క్రితం మొదలైందని, కోట్లాది రూపాయల మేరకు బెట్లను ఇంత వరకు ఢిల్లీ, ఎన్‌సిఆర్‌లో ఎన్నికల ఫలితాలపై పెట్టారని ఆయన చెప్పారు. పంటర్లు రాజధాని నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఉన్నట్లు ఆయన తెలిపారు.

బెట్టింగ్ విభాగంలో బెట్టు కట్టే వ్యక్తిని పంటర్ అని, పందాలు నిర్ణయించే వ్యక్తిని బుకీ అని అంటారని, బుకీ ఈ ప్రక్రియలో కమిషన్ ద్వారా ఆర్జిస్తుంటాడని పేరు వెల్లడి చేయకూడదన్న షరతుతో పోలీస్ అధికారి ఒకరు చెప్పారు. భారత్‌లో బెట్టింగ్ చట్టవిరుద్ధం కనుక బుకీలు, పంటర్లపై పోలీసులు నిఘా వేసి ఉంచుతారు. బెట్టింగ్ (సట్టా) ప్రక్రియలో పట్టుబడిన వ్యక్తినని ఏడు సంవత్సరాల వరకు ఖైదుతో శిక్షించదగిన నేరానికి ఐపిసి 420 (వంచన) సెక్షన్ కింద బుక్ చేస్తారు. కాగా, బెట్టింగ్ మార్కెట్‌లో ఎన్‌డిఎకు రేట్లు తక్కువ. ఎన్‌డిఎ విజయావకాశాలు అధికంగా ఉండడమే ఇందుకు కారణం. ఇండియా కూటమిపై బెట్ ‘రిస్క్’ తో కూడుకున్నది కనుక ప్రతిపక్ష కూటమిపై బెట్లకు రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఎన్‌డిఎ పూర్తి ఆధిక్యంతో మరొక సారి తేలికగా విజయం సాధిస్తుందని బుకీలు సూచించారని, అయితే, ఎన్‌డిఎ 400 సీట్లు దాటే అవకాశం లేదని వారు స్పష్టం చేశారని మరొక ప్రతినిధి చెప్పారు.

దుబాయికి చెందిన ఒక బుకీ నెట్‌వర్క్ కూడా ఈ ఎన్నికల్లో ఎన్‌డిఎకు అఖండ ఆధిక్యం లభిస్తుందని జోస్యం చెప్పినట్లు ఆయన తెలిపారు. అనేక మంది పలు బెట్లు పెట్టారని, ఒక దానిలో డబ్బు కోల్పోయినా మరొక దాని ద్వారా దానిని రాబట్టుకొనేందుకు వారికి వీలు ఉంటుందని పోలీస్ అధికారి సూచించారు. 400 పైచిలుకు సీట్లతో తమ పార్టీ అఖండ విజయం సాధిస్తుందని బిజెపి నాయకులు చెబుతుండగా తాము 295 సీట్లు గెలుస్తామని ఇండియా కూటమి జోస్యం చెప్పింది. వోట్ల లెక్కింపు మంగళవారం జరగనున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News