ఐపిఎల్‌లో భాగంగా శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ పది పరుగుల తేడాతో విజయం సాధించింది. మరోవైపు ముంబై ఆడిన తొమ్మిది మ్యాచుల్లో ఆరో ఓటమిని చవిచూసింది. ఈ పరాజయంతో ముంబై ప్లేఆఫ్ అవకాశాలు మరింత క్లిష్టంగా మారాయి. ఇక ఢిల్లీ ఐదో గెలుపుతో ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 257 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. తర్వాత క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. భారీ లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి ఆశించిన స్థాయిలో శుభారంభం లభించలేదు. ఓపెనర్ రోహిత్ శర్మ ఒక ఫోర్‌తో 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ 4 ఫోర్లతో 20 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
వన్‌డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 13 బంతుల్లో 26 పరుగులు చేసి వెనుదిరిగాడు. దీంతో ముంబై 65పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను తిలక్ వర్మ, కెప్టెన్ హార్దిక్ పాండ్య తమపై వేసుకున్నారు. ఇద్దరు ప్రత్యర్థి జట్టు బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన హార్దిక్ 24 బంతుల్లో 3 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 46 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన నెహాల్ వధెరా (4) విఫలమయ్యాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన తిలక్ వర్మ 4 ఫోర్లు, మూడు సిక్సర్లతో 46 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ధాటిగా ఆడిన టిమ్ డేవిడ్ 17 బంతుల్లో మూడు సిక్సర్లు, రెండు బౌండరీలతో 37 పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది.
జాక్ ఫ్రెజర్ మెరుపులు..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓపెనర్ జాక్ ఫ్రెజర్ మెక్‌గుర్క్, అభిషేక్ పొరెల్‌లు శుభారంభం అందించారు. పొరెల్ సమన్వయంతో ఆడగా ఫ్రెజర్ మెరుపులు మెరిపించాడు. ముంబై బౌలర్లను హడలెత్తించిన ఫ్రెజర్ స్కోరును పరిగెత్తించాడు. చెలరేగి ఆడిన ఫ్రెజర్ 27 బంతుల్లోనే 11 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 84 పరుగులు సాధించాడు. అభిషేక్ పొరెట్ 27 బంతుల్లో 36 పరుగులు చేశాడు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన హోప్ 17 బంతుల్లోనే ఐదు సిక్సర్లతో 41 పరుగులు సాధించాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో అలరించిన రిషబ్ 29 పరుగులు చేశాడు. ఇక చివర్లో ట్రిస్టన్ స్టబర్స్ విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగి పోయాడు. దూకుడుగా ఆడిన స్టబ్స్ 25 బంతుల్లోనే ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 48 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో ఢిల్లీ స్కోరు 257 పరుగులకు చేరింది.