Tuesday, November 5, 2024

ఢిల్లీకి సవాల్.. నేడు టైటాన్స్‌తో పోరు

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో మంగళవారం జరిగే మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు చాలా కీలకంగా మారింది. గుజరాత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా ఢిల్లీ వరుస ఓటములతో అట్టడుగు స్థానంలో నిలిచింది. గుజరాత్ ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. ఇక హైదరాబాద్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో ఓటమి పాలైన ఢిల్లీకి ఈ పోరు సవాల్‌గా తయారైంది. బలమైన గుజరాత్‌ను ఓడించాలంటే ఢిల్లీ అసాధారణ ఆటను కనబరచక తప్పదు. ఇప్పటికే ఆరు మ్యాచుల్లో ఓడడంతో ఢిల్లీ నాకౌట్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. ఇక గుజరాత్ చేతిలోనూ ఓడితే ఆశలు పూర్తిగా నీరుగారడం ఖాయం. ఇలాంటి స్థితిలో ఇకపై జరిగే ప్రతి మ్యాచ్ కూడా ఢిల్లీకి చాలా కీలకమనే చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఢిల్లీ ఆశించిన స్థాయిలో రాణించలేక పోతోంది. వరుస వైఫల్యాలు చవిచూసిన స్టార్ ఓపెనర్ పృథ్వీషాను తుది జట్టుకు దూరంగా పెట్టాల్సి వచ్చింది.

పృథ్వీషా ఘోరంగా విఫలం కావడం ఢిల్లీపై బాగానే ప్రభావం చూపించింది. జట్టుకు అండగా నిలుస్తాడని భావిస్తే పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశ పరిచాడు. ఇక కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశ పరుస్తున్నాడు. ఇటు బ్యాటర్‌గా అటు కెప్టెన్‌గా వార్నర్ రాణించలేక పోతున్నాడు. రిషబ్ పంత్ అందుబాటులో లేకపోవడంతో ఢిల్లీ యాజమాన్యం వార్నర్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. అతను మాత్రం ఆశించిన స్థాయిలో సత్తా చాటడంలో విఫలమయ్యారు. వార్నర్ వైఫల్యం ఢిల్లీకి ప్రతికూలంగా మారింది. ఆల్‌రౌండర్ మిఛెల్ మార్ష్ ఒక మ్యాచ్‌లో రాణిస్త్తే తర్వాతి మ్యాచ్‌లో విఫలమవుతున్నాడు. మార్ష్ ఆటలో నిలకడ లోపించింది. అయితే సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మార్ష్ మెరుపు ఇన్నింగ్స్ ఆడడం ఢిల్లీకి కాస్త ఊరటనిచ్చే అంశమే. వికెట్ కీపర్ ఫిలిప్ సాల్ట్ కూడా కాస్త బాగానే ఆడుతున్నాడు. కానీ మనీష్ పాండే, ప్రియమ్ గార్గ్, సర్ఫరాజ్ ఖాన్ తదితరులు పేలవమైన ప్రదర్శనతో సతమతమవుతున్నారు. వీరి వైఫల్యం జట్టును వెంటాడుతోంది. ఈ మ్యాచ్‌లోనైనా బ్యాటర్లు తమ బ్యాట్‌లకు పని చెప్పాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఢిల్లీకి గెలుపు అవకాశాలుంటాయి. లేకుంటే మరో ఓటమి ఖాయం.

జోరుమీదున్న టైటాన్స్..

మరోవైపు గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలతో జోరుమీదుంది. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ ఆరింటిలో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని భావిస్తోంది. ఇక ఢిల్లీపై గెలిస్తే టైటాన్స్‌కు ప్లేఆఫ్ బెర్త్ దాదాపు ఖాయమవుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో గుజరాత్ చాలా బలంగా ఉంది. శుభ్‌మన్ గిల్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, సాహా, హార్దిక్ పాండ్య, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మనోహర్ తదితరులతో గుజరాత్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక షమి, జోషువా లిటిల్, నూర్ మహ్మద్, రషీద్‌లతో బౌలింగ్ కూడా బాగానే ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News