Wednesday, January 22, 2025

ఆత్మవిశ్వాసంతో ఢిల్లీ క్యాపిటల్స్…. నేడు రాజస్థాన్ రాయల్స్‌తో పోరు

- Advertisement -
- Advertisement -

ముంబయి:  ఒకవైపు కొవిడ్ కేసులు వెంటాడుతున్నా ఢిల్లీ క్యాపిటల్స్ కిందటి మ్యాచ్‌లో అసాధారణ ఆటతో పంజాబ్ కింగ్స్ వంటి బలమైన జట్టును చిత్తుగా ఓడించి ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకొంది. శుక్రవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ అద్భుత ఆటతో చెలరేగి పోయింది. మయాంక్, ధావన్, లివింగ్‌స్టోన్, బెయిర్‌స్టో వంటి అగ్రశ్రేణి బ్యాటర్లు ఉన్న పంజాబ్‌ను ఢిల్లీ 115 పరుగులకే కట్టడి చేసి సంచలనం సృష్టించింది. స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, లలిత్ యాదవ్‌లతో పాటు ఫాస్ట్ బౌలర్లు ముస్తఫిజుర్, ఖలీల్ అహ్మద్‌లు అద్భుత బౌలింగ్‌ను కనబరిచారు. దీంతో పంజాబ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో ఢిల్లీ సఫలమైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 10.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి మ్యాచ్‌ను సొంతం చేసుకొంది. ఈ గెలుపు ఢిల్లీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుందనడంలో సందేహం లేదు. ఓపెనర్లు పృథ్వీషా, డేవడ్ వార్నర్‌లు ఫామ్‌లో ఉండడం ఢిల్లీకి అతి పెద్ద ఊరటగా చెప్పాలి. ఎలాంటి బౌలింగ్‌నైనా చిన్నాభిన్నం చేసే సత్తా వార్నర్, షాలకు ఉంది. కిందటి మ్యాచ్‌లో ఇద్దరు దూకుడుగా ఆడారు. వార్నర్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా ఢిల్లీకి ఓపెనర్లు కీలకంగా మారారు. వార్నర్ విజృంభిస్తే రాజస్థాన్ బౌలర్లకు ఇబ్బందులు తప్పక పోవచ్చు. మరోవైపు కెప్టెన్ రిషబ్ పంత్,రొమాన్ పొవెల్, లలిత్ యాదవ్, శార్దూల్, అక్షర్‌లతో బ్యాటింగ్ బలంగా ఉంది. ముస్తఫిజుల్, కుల్దీప్, ఖలీల్, అక్షర్, శార్దూల్‌లతో బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా కనిపిస్తోంది. దీంతో ఢిల్లీ భారీ ఆశలతో మ్యాచ్‌కు సిద్ధమైంది.
జోరుమీదున్న రాయల్స్..
మరోవైపు రాజస్థాన్ రాయల్స్ కూడా వరుస విజయాలతో ఐపిఎల్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఓపెనర్ జోస్ బట్లర్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే రెండు సెంచరీలతో సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో కూడా చెలరేగేందుకు సిద్ధమయ్యాడు. కోల్‌కతాతో జరిగిన కిందటి మ్యాచ్‌లో బట్లర్ శతకంతో కదంతొక్కాడు. భారీ సిక్సర్లు, కళ్లు చెదిరే ఫోర్లతో బట్లర్ ఈ ఐపిఎల్ సీజన్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఢిల్లీపై కూడా అదే జోరును కనబరచాలనే పట్టుదలతో ఉన్నాడు. మరో ఓపెనర్ పడిక్కల్ కూడా దూకుడు మీదున్నాడు. ధాటిగా ఆడుతూ బట్లర్‌కు తనవంతు సహకారం అందిస్తున్నాడు. ఇక కెప్టెన్ సంజు శాంసన్ కూడా మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకుంటున్నాడు. హెట్‌మెయిర్ రూపంలో మరో విధ్వంసక బ్యాటర్ రాజస్థాన్‌కు అందుబాటులో ఉన్నాడు. ప్రతి మ్యాచ్‌లో హెట్‌మెయిర్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగి పోతున్నాడు. ఇక ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, అశ్విన్, చాహల్‌లతో రాజస్థాన్ బౌలింగ్ కూడా బలంగా ఉంది. కిందటి మ్యాచ్‌లో చాహల్ హ్యాట్రిక్‌తో చెలరేగి పోయాడు. కీలక సమయంలో ఒకే ఓవర్‌లో హ్యాట్రిక్‌తో సహా నాలుగు వికెట్లు తీసి రాజస్థాన్‌ను గెలిపించాడు. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఈ సీజన్‌లో రాజస్థాన్ నిలకడైన విజయాలు సాధిస్తోంది. ఆరు మ్యాచుల్లో నాలుగింటిలో విజయం సాధించి మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి నాకౌట్ అవకాశాలను మరింత మెరుగు పరుచుకోవాలని తహతహలాడుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News